రాజ్యాంగబద్దం కాదు...అయినా అగ్రిగోల్డ్ బాధితులకు సాయం...: అప్పిరెడ్డి
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచిన ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బాధితుల సంఘం నాయకులు అప్పిరెడ్డి ప్రశంసల వర్షం కురిపించాడు. ఆయన నిర్ణయం వల్లే బాధితుల కుటుంబాల్లో దీపావళి వెలుగులు కాస్త ముందుగానే వచ్చాయన్నారు.
తాడేపల్లి: అగ్రిగోల్డ్ బాధితుల జీవితాల్లో ఒక రోజు ముందే దీపావళి వచ్చిందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థ అగ్రిగోల్డ్ తమను మోసం చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పించిందని...కానీ జగన్ ప్రభుత్వం అండగా నిలిచి పునర్జన్మనిచ్చారని బాధితులు చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి రోజు బడుగు బలహీన వర్గాల మంచి కోసమే ఆలోచిస్తున్నారని అన్నారు. అగ్రిగోల్ట్ బాధితులు జగన్ పై నమ్మకం వుంచారని....దాన్ని వమ్ము చేయకుండా ఆయన కూడా భాదితులకు అండగా నిలిచారని అన్నారు. బాధితులు కోసం తొలివిడతలో 3లక్షల 70 వేల మంది బాధితుల కోసం 264 కోట్లు...రెండవ విడతలో 886 కోట్లు విడుదల చేశారని గుర్తుచేశారు.
ఓ ప్రైవేట్ సంస్థ మోసం చేస్తే పాలక ప్రభుత్వం నిధులు ఇచ్చి బాధితులను ఆదుకున్న చరిత్ర ఈ దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వానికి లేదన్నారు. కానీ జగన్ చరిత్రను తిరగరాస్తూ... రాజ్యాంగాన్ని కూడా ఒప్పించేలా న్యాయపరమైన ఇబ్బందులు అధిగమించి ఈ పనిచేశారన్నారు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రజాసంక్షేమంపై కమిట్‌మెంట్ వుండాలని...అది జగన్ చాలా ఎక్కువగా వుందన్నారు.
read more నిరుద్యోగులకు శుభవార్త... భారీ ప్రభుత్వోద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
అగ్రిగోల్డ్ బాధితులకోసం రూ. 1150 కోట్లు నోటి మాటగా కాకుండా జోవో విడుదల చేశారని...దీంతో జగన్ మాట ఇస్తే తప్పరనేది మరోసారి రుజువైందన్నారు. ఈ విషయంలో అగ్రిగోల్డ్ బాధితులంతా జగన్ కు రుణపడి వుంటారని అప్పిరెడ్డి తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు పాలించిన చంద్రబాబు ఖాళీ ఖజానాను జగన్మోహన్ రెడ్డి చేతికి ఇచ్చినా జగన్ వెనుకడుగు వేయడంలేదన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులు కోసం భారీ నిధులు విడుదల చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు.
అగ్రిగోల్డ్ బాధితుల సాయం విషయంలో చంద్రబాబు, లోకేష్ సిగ్గుండే విమర్శలు చేస్తున్నారా...? అని ప్రశ్నించారు. చంద్రబాబుది కోతల ప్రభుత్వమని, జగన్మోహన్ రెడ్డి చేతల ప్రభుత్వమని ఆయన కొనియాడారు. అగ్రిగోల్డ్ అనేది చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే పుట్టి ఆయన హయాంలోనే బైట పడిందన్నారు. కానీ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాల్సింది పోయి సాయం కోరితే అరెస్టులు చేయించారని ఆరోపించారు.
read more కార్మికుల ఆత్మహత్యలపై చంద్రబాబు ఆవేదన... ప్రభుత్వంపై సీరియస్
చంద్రబాబు నిర్వాకం వలన 300 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారని గుర్తుచేశారు. బాధితులను అడుకోకుండా కమిటీల పేరుతో చంద్రబాబు కాలయాపన చేశారన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలే కాజేశారని ఆరోపించారు.
చంద్రబాబు అగ్రిగోల్డ్ అస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేస్తామని మాటలు చెబితే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్మకుండా బాధితులకు న్యాయం చేశారని తెలిపారు.
రాజశేఖర్ రెడ్డి కుటంబం మాట ఇస్తే నెరవేర్చి తీరుతుందని పేర్కొన్నారు.
ఈ నెల 29 తేదీన అన్ని అగ్రిగోల్డ్ బాధిత సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అప్పిరెడ్డి ప్రకటించారు. భవిష్యత్‌లో ఏ అగ్రిగోల్డ్ బాధితుడు ఆత్మహత్య చేసుకోరాదని ఆయన సూచించారు.