అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న ఇసుక కొరత రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఇసుక కొరతతో గతకొద్దిరోజులగా భవన నిర్మాణ కార్మికులతో పాటు మరికొందరు వృత్తులవారు రోడ్డున పడ్డారు. ఇలా ఇసుక కొరతతో ఉపాది కోల్పోయిన ఇద్దరు కార్మికులు బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఆత్మహత్యలపై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఆత్మహత్యలకు వైఎస్సార్‌సిపి ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికన విరుచుకుపడ్డారు. 

''జీవితం ఎంతో విలువైనది, పోరాడి సాధించాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఇంకెవరూ తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంది. నేను ఉన్నాను. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాడుదాం. ఇసుక అక్రమాలపై నిలదీద్దాం.''

read more కార్మికుల ఆత్మహత్యల గురించి తెలుసా...? విజయసాయి గారూ..: బుద్దా వెంకన్న
 
''పండుగ వేళ భవన నిర్మాణరంగానికి చెందిన మేస్త్రీలు బ్రహ్మాజీ, వెంకట్రావుల ఆత్మహత్య వార్తలు నన్ను కలిచివేశాయి! ఇసుక కొరతతో పనుల్లేక కార్మికులు బలవన్మరణం పాలు కావడం ఆవేదనకు గురిచేస్తోంది. వైసీపీ ప్రభుత్వం మాత్రం తమ పార్టీ నేతల జేబులు నింపడమే లక్ష్యంగా పనిచేస్తోంది.'' అంటూ కార్మికులు కుటుంబాలతో కలిసున ఫోటోలను జతచేస్తూ ట్వీట్ చేశారు.

''అనాలోచిత నిర్ణయాలు, అవినీతి పోకడలతో రోజు కూలీలకు, నిర్మాణ రంగ కార్మికులకు దసరా పండగ లేకుండా చేశారు, ఆఖరికి దీపావళి రోజున కూడా కార్మికుల బ్రతుకులు చీకటి పాలు చేశారు.''

read more video news : తాపీమేస్త్రీని బలితీసుకున్న ఇసుక కొరత
 
''వైసీపీ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతోంది. కొత్త ఇసుక విధానం తేకుండానే ఉన్నదాన్ని రద్దు చేసారు. కొత్త విధానం తెచ్చి రెండు నెలలు కావస్తోంది. ఇసుక కొరత సమస్య రోజురోజుకు క్లిష్టం చేసారు. 30 లక్షల పైగా కార్మిక కుటుంబాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు.''
 
''పాత ఇసుక విధానం రద్దు చేయమని కార్మికులు అడిగారా? మీ ఇష్టానుసార నిర్ణయాలకు లక్షలాది కార్మిక కుటుంబాలు బలి కావాలా?''

''వైసీపీ ప్రభుత్వం సృష్టించిన ఇసుక సమస్యతో ఉపాధి కోల్పోయి లక్షలాదిమంది కార్మికులు పస్తులుంటున్నారు. వారందరికీ పరిహారం ఇమ్మని టీడీపీ డిమాండ్ చేస్తే ఇచ్చేది లేదని మంత్రి మాట్లాడడం వైసీపీ నిర్లక్ష్యానికి పరాకాష్ట.'' అంటూ ఇంతకుముందే చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ట్వీట్లు చేశారు.