డ్రాగన్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనకు తెలుసు. మార్కెట్లో వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అంత ధర పెట్టి కొనే బదులు మీ ఇంట్లోనే, మీ టెర్రస్ మీద డ్రాగన్ ఫ్రూట్ పెంచడం చాలా సులభం. కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ ఫ్రూట్స్ ని ఈజీగా పండించవచ్చు.
Dragon Fruit Growing at Home: ఈ మధ్యకాలంలో డాబాల మీద, బాల్కనీల్లో పండ్ల మొక్కలు పెంచడం ఒక ట్రెండ్ అయిపోయింది. ఈ లిస్టులో డ్రాగన్ ఫ్రూట్స్ ముందు వరుసలో ఉంటాయి. ఇది కాక్టస్ జాతికి చెందిన మొక్క. దీన్ని చాలా తక్కువ నీళ్లు, సంరక్షణతో పెంచవచ్చు. సరైన పద్ధతులు పాటిస్తే, ఇంట్లోనే ఫ్రెష్‌గా, ఆరోగ్యంగా డ్రాగన్ ఫ్రూట్స్ పండించుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
సరైన మొక్క, కుండీ ఎంచుకోవడం
డ్రాగన్ ఫ్రూట్ పెంచడానికి ఏదైనా నర్సరీ నుంచి దాని కొమ్మ లేదా చిన్న మొక్కను కొనవచ్చు. దీన్ని నాటడానికి పెద్దగా, బలంగా ఉండే కుండీని ఎంచుకోవాలి. నీళ్లు పోవడానికి కింద కచ్చితంగా రంధ్రాలు ఉండాలి. ఈ మొక్క వేగంగా పెరుగుతుంది కాబట్టి, కనీసం 15-20 అంగుళాల కుండీ అయితే బెస్ట్.

మట్టిని ఎలా రెడీ చేయాలి?
ఈ మొక్కకు నీళ్లు నిలవని మట్టి కావాలి. దీనికోసం 50% గార్డెన్ మట్టి, 30% ఇసుక, 20% పశువుల ఎరువు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొక్కకు పోషకాలు అందడమే కాకుండా, నీళ్లు నిలిచి వేర్లు కుళ్లిపోకుండా ఉంటాయి.
మొక్కను నాటే పద్ధతి
కొమ్మను మట్టిలో సుమారు 2-3 అంగుళాల లోతులో నాటి, కొద్దిగా నీళ్లు పోయాలి. రోజూ 5-6 గంటల పాటు నేరుగా ఎండ తగిలే చోట కుండీని పెట్టాలి. డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఒక తీగలా పెరుగుతుంది, కాబట్టి దానికి సపోర్ట్‌గా కర్ర లేదా ఇనుప రాడ్ పాతితే మంచిది.
నీళ్లు, సంరక్షణ
డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకు ఎక్కువ నీళ్లు అవసరం లేదు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు పోస్తే సరిపోతుంది. వేసవిలో కొంచెం ఎక్కువ పోయవచ్చు, కానీ మట్టిలో నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. నెలకోసారి సేంద్రియ ఎరువు వేస్తే మొక్క ఎదుగుదల వేగంగా ఉంటుంది.

పూత, కాత దశ
8-10 నెలల్లో మొక్క పెద్దగా పెరుగుతుంది. సాధారణంగా 1-2 ఏళ్లలోపు కాయలు కాయడం మొదలవుతుంది. దీనికి పెద్ద తెల్లటి పువ్వులు పూస్తాయి. ఇవి రాత్రిపూట వికసించి, ఆ తర్వాత కాయలుగా మారతాయి. పూత సమయంలో కొద్దిగా ఎరువు, సరైన మోతాదులో నీళ్లు పోస్తే మంచి దిగుబడి వస్తుంది.
పంట కోత సమయం
కాయలు ఏర్పడిన 30 నుంచి 50 రోజుల తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కోతకు రెడీ అవుతుంది. పండు రంగు ముదురు గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారినప్పుడు కోసుకోవాలి. మొక్క ఒకసారి బాగా పెరిగాక, సంవత్సరంలో చాలాసార్లు కాయలు కాస్తుంది.


