Periods: నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తే ఏమౌతుంది?
Periods: మీకు పీరియడ్స్ నెలకు ఎన్నిసార్లు వస్తుంది..? ఎన్ని రోజుల గ్యాప్ తో వస్తోంది..? చాలా మందికి పీరియడ్స్ ఆలస్యంగా వస్తేనే ప్రాబ్లం అనుకుంటారు. కానీ, తక్కువ గ్యాప్ తో వచ్చినా కూడా సమస్యలు ఉన్నట్లే అని మీకు తెలుసా?

Periods
మహిళలకు ప్రతినెలా పీరియడ్స్ రావడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. సాధారణంగా ప్రతి 28 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి. అయితే... కొంతమందికి 24 నుంచి 35 రోజుల గ్యాప్ లో కూడా వస్తూ ఉంటాయి. దీనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. చాలా కామన్. కానీ, కొన్ని సందర్భాల్లో నెలలో రెండుసార్లు పీరియడ్స్ వస్తుంటాయి. ఇది ప్రమాదానికి సంకేతమా? లేక శరీరంలో జరిగే సహజ మార్పులలో భాగమా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం....
నెలలో రెండుసార్లు పీరియడ్స్ ఎందుకు వస్తాయి..?
హార్మోన్ అసమతుల్యత (Hormonal Imbalance):
ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరోన్ హార్మోన్లలో మార్పులు వచ్చినప్పుడు రుతుచక్రం క్రమం తప్పుతుంది. ఒత్తిడి, నిద్రలేమి, అధిక వ్యాయామం లేదా హఠాత్తుగా బరువు తగ్గడం కూడా హార్మోన్లపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇలా పీరియడ్స్ రెండు సార్లు రావచ్చు.
థైరాయిడ్ సమస్యలు:
థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే రుతుస్రావం అసమానంగా జరగవచ్చు. అందుకే, థైరాయిడ్ కి సరైన చికిత్స తీసుకోవాలి. లేకపోతే పీరియడ్స్ లో సమస్యలు వచ్చేస్తాయి.
గర్భాశయ గడ్డలు లేదా సిస్టులు:
యుటరైన్ ఫైబ్రాయిడ్స్ లేదా ఓవేరియన్ సిస్టులు ఉన్నప్పుడు, రక్తస్రావం తరచుగా జరగవచ్చు. వీరికి ఒక్కోసారి రెండు, మూడు నెలలకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి. లేదంటే.. నెలలోనే రెండుసార్లు వస్తాయి.
పిల్లల జనన నియంత్రణ మాత్రలు లేదా ఇంజెక్షన్లు:
కొంతమంది మహిళలు కొత్తగా బర్త్ కంట్రోల్ మాత్రలు మొదలు పెట్టినప్పుడు లేదా మార్చినప్పుడు పీరియడ్స్ ఇలా క్రమం తప్పుతాయి.
పెరిమెనోపాజ్ దశ:
మెనోపాజ్ సమీపంలో ఉన్న మహిళల్లో కూడా నెలకు రెండుసార్లు పీరియడ్స్ రావడం సాధారణంగా కనిపిస్తుంది.
ఇది సాధారణమా లేదా జాగ్రత్త అవసరమా?
పీరియడ్స్ నెలలో ఒకసారికి మించి తరచుగా వస్తే, అది ప్రతిసారీ ప్రమాద సూచన కాదు. అయితే, ఇది క్రమం తప్పకుండా కొనసాగితే లేదా రక్తస్రావం ఎక్కువగా ఉంటే, వెంటనే గైనకాలజిస్ట్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), థైరాయిడ్ వ్యాధులు లేదా రక్తసంబంధ సమస్యల సంకేతం కావచ్చు.
డాక్టర్ ని ఎప్పుడు కలవాలి..?
పీరియడ్స్ మధ్యలో అధిక రక్తస్రావం ఉన్నా, కడుపు లేదా నడుము నొప్పి ఉన్నా, పీరియడ్ బ్లడ్ కలర్ మారినా ఇలాంటి సంకేతాలు ఏవి కనిపించినా వెంటనే... డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
రోజూ ఒకే సమయానికి భోజనం చేయాలి. ప్రతిరోజూ కనీసం 8 గంటలు నిద్ర పోవాలి. అధిక ఒత్తిడి లేదా ఆందోళన తగ్గించుకోవాలి. శరీరానికి తగినంత నీరు తాగడం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 లాంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.
ఫైనల్ గా....
నెలలో రెండుసార్లు పీరియడ్స్ రావడం ఎప్పుడూ ప్రమాద సూచన కాదు. కానీ అది తరచుగా జరుగుతూ ఉంటే, అది మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యత లేదా ఇతర వైద్య కారణాల సంకేతం కావచ్చు. కాబట్టి, సిగ్గు లేకుండా వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.