ఈ ఒక్క హార్మోన్ తగ్గడం వల్ల ఆడవారికి ఇన్ని సమస్యలా
Low Estrogen: ఆడవాళ్లకు ఎంతో ముఖ్యమైన హార్మోన్లలో ఈస్ట్రోజెన్ ఒక్కటి. అయితే చాలా మందిలో ఈ హార్మోన్ చాలా తక్కువగా రిలీజ్ అవుతుంటుంది. దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

ఈస్ట్రోజెన్
చాలా రకాల హార్మోన్లలో ఈస్ట్రోజెన్ ఒకటి. ఇది ఆడవారిని, మగవారిని ఇద్దరినీ ప్రభావితం చేస్తుంది. కానీ ఆడవారిలో ఈ హార్మోన్ చాలా ముఖ్యమైనది. ఇది ఎన్నో ముఖ్యమైన విధులను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా జుట్టును చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం, ఎముకల్ని బలంగా ఉంచడం, పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం, బోలు ఎముకల వ్యాధిని నియంత్రించడం, కొలెస్ట్రాల్ నియంత్రణకు సహాయపడటం, గర్భాధారణకు సహాయపడటం వంటి పనులకు ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎంతో సహాయపడుతుంది.
ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటే ఆడవారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పునరుత్పత్తిపై ప్రభావం
ఈస్ట్రోజెన్ హార్మోన్ తక్కువగా ఉంటే ఆడవారి పునరుత్పత్తి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ హార్మోన్ లోపించడం వల్ల పీరియడ్స్ ఆగిపోవడం లేదా రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు రావడం జరుగుతుంది. కానీ గర్భం దాల్చాలంటే మాత్రం ఖచ్చితంగా పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలి. కాబట్టి ఈస్ట్రోజెన్ లోపించడం వల్ల గర్భందాల్చడంలో ఇబ్బంది కలుగుతుంది.
రుతువిరతి
ఈ ఈస్ట్రోజెన్ లెవెల్స్ పెరిమెనోపాజ్ టైంలో బాగా తగ్గుతాయి. అంటే రుతువిరతి ముందు టైంలో ఎక్కువగా తగ్గుతాయి. దీంతో ఈ పెరిమెనోపాజ్ రుతువిరతికి చాలా సంవత్సరాల ముందు ఉండొచ్చు. అంటే ఈ రుతువిరతి సాధారణంగా 51 ఏండ్లలో జరగుతుంది. కానీ ఇంతకంటే ముందే కొందరికి ఈ సమస్య రావొచ్చు. దీనికి వయస్సు పెరగడం కూడా ఒక కారణమే. కానీ ఈ రుతువిరతి వల్ల మానసిక స్థితిలో ఎన్నో మార్పులు వస్తాయి. అలాగే యోని పొడిబారడం, రాత్రిపూట విపరీతంగా చెమలు పట్టడం వంటి సమస్యలు వస్తాయి.
గుండె ఆరోగ్యం
ఈస్ట్రోజెన్ హార్మోన్ గుండె ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. ఈ హార్మోన్ తగ్గినప్పుడు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల ఊరికే చిరాకు పడటం, నిరాశ, ఆందోళన వంటి మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
చర్మ, జుట్టు సమస్యలు
ఆడవారి శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్లు తగ్గడం వల్ల చర్మానికి, జుట్టుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే చర్మం పొడిబారడం, ముడతలు, గీతలు ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి. అలాగే జుట్టు రాలడం, డ్రైగా అవ్వడం వంటి హెయిర్ కు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.