తిన్న తర్వాత గ్యాస్ తో కడుపు ఉబ్బిపోయినప్పుడు.. ఏం చేస్తే వెంటనే తగ్గుతుంది?
చాలా మందికి గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుంది. కానీ ఇది లైట్ తీసుకునేంత చిన్న సమస్య అయితే కాదు. దీనివల్ల ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే దీన్ని చాలా సింపుల్ గా, తొందరగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

gas
మనం ఎంత హెల్తీ ఫుడ్ ను తింటే మన ఆరోగ్యం అంత బేషుగ్గా ఉంటుంది. కానీ మీరు ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్ ను తిన్నా.. తిన్న వెంటనే పడుకుంటే ఆరోగ్యం ఖచ్చితంగా దెబ్బతింటుందనేది నిజం. ఇదొక్కటి మాత్రమే కాదు.. మీరు తిన్న తర్వాత చేసే కొన్ని పనులు, అలవాట్ల వల్ల కూడా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల గ్యాస్ , కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
gas
తిన్న తర్వాత గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావొద్దంటే మాత్రం తిన్న వెంటనే పడుకోవడం, స్మోకింగ్ చేయడం, పండ్లను తినడం, స్నానం చేయడం, వ్యాయామం చేయడం, టీ లేదా కాఫీలను తాగడం వంటివి చేయకూడదు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే తిన్న తర్వాత కొన్ని పనులను చేయాలి. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గ్యాస్, ఉబ్బరాన్ని ఎలా తగ్గించుకోవాలి?
వజ్రాసనం
వజ్రాసనమనేది తిన్నది జీర్ణం కావడానికి ఒక మాయా యోగాసనం. ఈ యోగాసనం వేశారంటే మీ గ్యాస్ వెంటనే తగ్గుతుంది. దీన్ని ఎలా చేయాలంటే? రెండు మోకాళ్లను వంచి నడుము నిటారుగా పెట్టి కూర్చోవాలి. దీనివల్ల శరీరం దిగువ భాగంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ సక్రమంగా, సజావుగా పనిచేస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా తగ్గిపోతాయి.
వాకింగ్
తిన్న తర్వాత ఒక చిన్న నడక కూడా మిమ్మల్ని గ్యాస్, కడుపు ఉబ్బరానికి దూరంగా ఉంచుతాయి. ఇందుకోసం మీరు బ్రిస్క్ వాక్ చేయాల్సిన అవసరమేమీ లేదు. తిన్న తరువాత 15 నుంచి 20 నిమిషాల పాటు నెమ్మదిగా నడిస్తే సరిపోతుంది. దీనివల్ల మీరు తిన్నది సులువుగా జీర్ణమవుతుంది.
పళ్లను తోమాలి
తిన్న తర్వాత పళ్లు తోముకుంటే చాలా మంచిది. ఈ అలవాటు వల్ల పళ్లలో పేరుకుపోయిన మురికి తొలగిపోవడమే కాకుండా.. ఆ తర్వాత ఏమి తినకూడదని మీ మెదడు మీకు చెప్తుంది. ముఖ్యంగా చిప్స్ లాంటి ఆరోగ్యాన్ని పాడుచేసేవి.
సోంపు తినండి
భోజనం చేసిన తర్వాత సోంపును తినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే సోంపులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీరు తిన్నది సులువుగా అరగడానికి బాగా సహాయపడతాయి. అలాగే జీర్ణవ్యవస్థలో ఉన్న నీటిని గ్రహిస్తాయి. మలబద్దకం సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి. గ్యాస్, గుండెల్లో మంట, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి కూడా సోంపు సహాయపడుతుంది.
ఎడమ వైపు పడుకోండి
తిన్న తర్వాత గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకూడదంటే మీరు ఎడమ వైపు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీరు తిన్నది బాగా జీర్ణం అవుతుంది. అలాగే ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మీ పేగు కదలికలు కూడా మెరుగుపడతాయి.