చిన్న వయసులోనే పీరియడ్స్ వస్తే.. డయాబెటీస్ వస్తుందా?
ఒక రీసెర్చ్.. పీరియడ్స్, డయాబెటిస్ మధ్య సంబంధం గురించి వెల్లడించింది. 13 ఏండ్ల కంటే తక్కువ వయస్సులో పీరియడ్స్ వచ్చిన వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఒక అధ్యయనంలో తేలింది. ఇలాంటి వారు డయాబెటీస్ రిస్క్ ను ఎలా తప్పించుకోవాలంటే?
పీరియడ్స్ ఒక సహజ ప్రక్రియ. ఇది ప్రతి మహిళకు అవుతుంది. సాధారణంగా పీరియడ్స్ కౌమారదశ ప్రారంభంలో వస్తాయి. అయితే కొన్ని కొన్ని సార్లు పీరియడ్స్ 13 ఏండ్ల వయసులో కూడా వస్తాయి. తాజాగా దీనిపై ఓ అధ్యయనం షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. అదేంటంటే.. 13 ఏండ్ల కంటే ముందే పీరియడ్స్ వచ్చిన వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
diabetes
బ్రిటిష్ మెడికల్ జనరల్ న్యూట్రిషన్ ప్రివెన్షన్ అండ్ హెల్త్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనంలో 20-65 సంవత్సరాల వయస్సున్న 17,000 మంది మహిళలు పాల్గొన్నారు. కాగా 13 ఏండ్ల కంటే ముందే పీరియడ్స్ వచ్చిన ఆడవారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాదు 10 ఏండ్లలోపు పీరియడ్స్ ప్రారంభమైన మహిళల్లో మధుమేహం కూడా ఉంటే 65 ఏళ్ల లోపు వీళ్లకు స్ట్రోక్ రిస్క్ కూడా బాగా పెరుగుతుందని ఈ అధ్యయనం వెల్లడిస్తోంది. అయితే దీనికి కారణాలేంటో మాత్రం వెల్లడించలేదు. ఏదేమైనా పీరియడ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేం. కాబట్టి మధుమేహాన్ని నివారించడానికి మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
diabetes
మధుమేహాన్ని ఎలా నివారించాలి?
హెల్తీ డైట్
ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని రెగ్యులర్ గా తింటుంటారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇవి వివిధ రోగాలతో పాటుగా డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. అందుకే వీటికి బదులుగా పాలు, పండ్లు, ఆకుకూరలు, పెరుగు మొదలైన వాటిని మీరోజువారి ఆహారంలో చేర్చుకోండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
వ్యాయామం
వ్యాయామం మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా ఎన్నో రోగాలకు కూడా దూరంగా ఉంచుతుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే ఊబకాయం తగ్గుతుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. అందుకే ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటైనా వ్యాయామం చేయండి. దీనివల్ల మీ శరీరంలోని అదనపు కేలరీలు తగ్గుతాయి.
diabetes
బరువు తగ్గండి
మీ బిఎమ్ఐ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నట్టైతే ఖచ్చితంగా బరువు తగ్గడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎక్కువ బరువు వల్ల మీకు డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. బరువు తగ్గాలంటే ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. హెల్తీ ఫుడ్ నే తినాలి.
స్మోకింగ్ వద్దు
స్మోకింగ్ తో ఒక్కటేమిటీ ఎన్నో డేంజర్ రోగాలు వస్తాయి. వీటిలో డయాబెటీస్ కూడా ఉంది. అందుకే మీకు డయాబెటీస్ రావొద్దంటే మాత్రం స్మోకింగ్ చేయకండి.