జుట్టుకు కలర్ ఎక్కువగా వేస్తే ఏమౌతుందో తెలుసా?
తెల్ల జుట్టును నల్లగా చేసేందుకు లేదా స్టైలీష్ గా కనిపించేందుకు చాలా మంది ఆడవారు ఎక్కువగా హెయిర్ డైలను వేస్తుంటారు. కానీ వీటిని ఎక్కువగా వేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
మగవారు ఆడవారు అంటూ తేడా లేకుండా ఈ రోజుల్లో చాలా మంది జుట్టుకు రంగులను వేస్తున్నారు. కొంతమంది తెల్ల జుట్టును దాచేందుకు కలర్ ను వేస్తే మరికొంతమంది మాత్రం అందంగా, స్టైలీష్ గా కనిపించేందుకు నచ్చిన రంగును జుట్టుకు వేయించుకుంటున్నారు.
జుట్టుకు కలర్లను అప్పుడప్పుడు వేయడం వల్ల పెద్దగా వచ్చే సమస్యలేమీ లేవు. కానీ వీటిని తరచుగా వాడితేనే ప్రాబ్లమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవున తరచుగా హెయిర్ డై లను వాడే ఆడవారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 9% ఎక్కువగా ఉందని ఒక అధ్యయనం పేర్కొంది.
ప్రతి ఐదు నుంచి ఎనిమిది వారాలకోసారి కెమికల్ హెయిర్ డై, స్ట్రెయిటెనర్లను వాడే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ 30% ఎక్కువగా ఉందని కూడా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ లో ప్రచురితమైంది. కొన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో మనకు హాని చేసే కెమికల్స్ ఉంటాయి. ఇశి మనల్ని ఎన్నో ప్రమాదకరమైన రోగాల బారిన పడేస్తాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. హెయిర్ కేర్ ఉత్పత్తుల్లో రెండు ప్రమాదరకమైన అంశాలు ఉంటాయి.
1. ఎండోక్రైన్-డిస్‌రప్టింగ్ కాంపౌండ్స్ (EDCs): అంటే ఇవి మన శరీరంలో హార్మోన్లను అసమతుల్యంగా చేస్తాయి. ఇది సంతానోత్పత్తి సమస్య, క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీస్తాయి.
2. కార్సినోజెన్లు: ఇవి మన DNAను దెబ్బతీస్తాయి. లేదా కణాల పనితీరును నాశనం చేస్తాయి.
అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఒక్క హెయిర్ డైలు, స్ట్రెయిటెనర్ల వల్లే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా వస్తుంది. జెనెటిక్స్, లేట్ గా పీరియడ్స్ ఆగిపోవడం, హార్మోన్ల కారకాలు, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, వంటివి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్, చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటివి కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
హెయిర్ కలర్ ను వేసుకోవడం వల్ల వచ్చే ఇతర సమస్యలు
తరచుగా జుట్టుకు కలర్ ను వేయడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడతాయి. ఎందుకంటే వీటిలో అమ్మోనియా,హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి హానికరమైన పదార్థాలుంటాయి. ఇవి మన జుట్టు క్యూటికల్లోకి చొచ్చుకుపోయి జుట్టులోని సహజ నూనెలను, ప్రోటీన్లను తొలగిస్తాయి. దీంతో జుట్టు పొడిబారడం, జీవం లేనట్టుగా కనిపించడం, జుట్టు చిట్లిపోవడం, తెగిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ హానికరమైన కెమికల్ కలర్స్ ను ఎక్కువగా వాడటం వల్ల జుట్టు మూలాలు బలహీనపడతాయి. దీంతో మీ జుట్టు నీరసంగా, ఫ్రిజ్ గా, జుట్టు చివర్లు రెండు మూడుగా చీలిపోవడం జరుగుతుంది.
జుట్టుకు తరచుగా రంగు వేయడం వల్ల నెత్తిమీద చిరాకు కలుగుతుంది. కొంతమందికైతే అలెర్జీ కూడా వస్తుంది. హెయిర్ డైలల్లో ఉండే కెమికల్స్ నెత్తిమీది చర్మాన్ని కఠినంగా మారుతాయి. దీనివల్ల నెత్తిమీద దురద పెట్టడం, మంట, ఎర్రగా మారడం వంటి సమస్యలు వస్తాయి. కొన్ని కొన్ని సార్లైతే వాపు, దద్దుర్లు, బొబ్బలు కూడా అవుతాయి. అందుకే సున్నితమైన చర్మం లేదా తామర లేదా సోరియాసిస్ వంటి సమస్యలున్నవారు వీటిని వాడకపోవడమే మంచిది.
ముఖ్యంగా కెమికల్స్ ఉండే హెయిర్ డైలను తరచుగా వాడితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. హెయిర్ కలర్లలో ఉండే కెమికల్స్ మూత్రాశయ క్యాన్సర్ మరియు నాన్-హాడ్కిన్స్ లింఫోమాతో పాటుగా కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయి.