Hair Mask: సెలబ్రెటీల హెయిర్ లాగా మీది కూడా మెరిసిపోవాలా? ఈ హెయిర్ మాస్క్ వాడితే సరి
Hair Mask: మార్కెట్లో దొరికే ఉత్పత్తుల కన్నా కోడి గుడ్డు తో హెయిర్ మాస్క్ వాడితే జుట్టు సహజంగా అందంగా మారుతుంది. ఎందుకంటే గుడ్డులో ఉండే ప్రోటీన్, బయోటిన్, ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు మెరుపు తెస్తాయి.

Hair care
ప్రస్తుత కాలంలో జుట్టును కాపాడుకోవడం అంత ఈజీ కాదు అనే చెప్పాలి. ఒకప్పుడు ఎవరి జడ చూసినా నడుము పొడవు వరకు అందంగా కనిపించేవి. ఇప్పుడు పెంచుకుందామన్నా కూడా ఎవరికీ జుట్టు పెరగడం లేదు. జుట్టు పెరగకపోగా... విపరీతంగా ఊడిపోతోంది. ఇలా జుట్టు ఊడటానికి చాలా కారణాలు ఉండొచ్చు. వాతావరణ కాలుష్యం, కెమికల్స్ తో నిండిన ఉత్పత్తుల వాడకం, సరైన పోషకాలు తీసుకోకపోవడం... ఇలా కారణం ఏదైనా జుట్టు అందంగా లేదని బాధపడేవారు మాత్రం చాలా మంది ఉన్నారు.
ఈ సమస్య నుంచి బయట పడేందుకు కొందరు ఏవేవో షాంపూలు, ఆయిల్స్ వాడుతూ ఉంటే... మరి కొందరు ఖరీదైన ట్రీట్మంట్స్ చేయించుకుంటున్నారు. డాక్టర్ల దగ్గర క్యూలు కట్టేవారు కూడా లేకపోలేదు. అయితే... ఇవన్నీ చేసినా మీ జుట్టు అందంగా కనిపించడం లేదు అని మీరు అనుకుంటే... కచ్చితంగా ఈ కింది హెయిర్ మాస్క్ లు ప్రయత్నించాల్సిందే.
గుడ్డు హెయిర్ మాస్క్ (Egg Hair Mask)
మూడు గుడ్ల సొనలను బాగా గిలకొట్టి, తలకు, జుట్టుకు పూయండి.
అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి.
ఇది జుట్టును మృదువుగా చేస్తుంది, పొడిబారడాన్ని తగ్గిస్తుంది.
తేనె & గుడ్డు మాస్క్ (Honey and Egg Mask)
రెండు గుడ్డు సొనలను ఒక టీస్పూన్ తేనెతో కలపండి.
ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడగండి.
తేనె జుట్టుకు తేమను అందిస్తుంది, పొడి జుట్టు సమస్య ఉన్నవారికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
వేప నూనె & గుడ్డు మాస్క్ (Neem Oil and Egg Mask)
ఒక టీస్పూన్ వేపనూనెను ఒక గుడ్డు పచ్చసొనతో కలిపి జుట్టుకు పూయండి.
30 నిమిషాల తర్వాత షాంపూతో కడగండి.
ఇది చుండ్రు, దురద, స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.
4. నిమ్మరసం & గుడ్డు మాస్క్ (Lemon and Egg Mask)
ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని ఒక గుడ్డు పచ్చసొనతో కలిపి తలకు రాసి, షవర్ క్యాప్‌తో 30 నిమిషాలు ఉంచండి.
ఇది పేను సమస్యలను తగ్గిస్తుంది, జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది.
5. పెరుగు & గుడ్డు మాస్క్ (Curd and Egg Mask)
పెరుగు ఒక టేబుల్ స్పూన్, గుడ్డు పచ్చసొన కలిపి తలకు రాయండి.
ఇది తల దురదను తగ్గిస్తుంది, చుండ్రును నివారిస్తుంది.
వర్షాకాలంలో ఈ మాస్క్ వాడకపోవడం మంచిది.
ఈ మాస్క్ లను ఎలా వాడాలి...?
ఈ మాస్క్‌లను వారానికి 1–2 సార్లు వాడండి. నూనె రాసిన తర్వాత వీటిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రసాయనాలతో ఉన్న షాంపూలకు బదులుగా మైల్డ్ షాంపూ వాడండి.మరీ ముఖ్యంగా సల్ఫేట్ లేని షాంపూ వాడి.. తలస్నానం చేస్తే సరిపోతుంది. రెగ్యులర్ గా వీటిని వాడటం వల్ల... జుట్టు అందంగా మారుతుంది.