ఇవి ముఖానికి రాస్తే.. వారం రోజుల్లోనే మచ్చలు పోయి, మంచి గ్లో వస్తుంది
కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు మన చర్మానికి అంటుకుని ఉన్న దుమ్మును, ధూళిని, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి అందంగా చేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ లను తయారుచేయడం చాలా ఈజీ కూడా.

స్కిన్ కేర్
కొంతమంది చర్మం ఎప్పుడూ డ్రైగా, నీరసంగా కనిపిస్తుంటుంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నా.. డెడ్ స్కిన్ సెల్స్ ప్రధాన కారణం. చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోవడం వల్ల మన ముఖం దాని సహజ ప్రకాశాన్ని కోల్పోతుంది. దీంతో మీ ముఖం నీరసంగా, పొడిగా కనిపిస్తుంది.
మీరు ఎంత మేకప్ వేసినా కూడా మీ ముఖంలో గ్లో రాదు. కానీ కొన్ని ఫేస్ ప్యాక్ లతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు వారం రోజుల్లోనే ముఖం మీదున్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి, మచ్చలు లేకుండా చేసి ముఖాన్ని కాంతివంతంగా చేస్తాయి. వాటిని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పెరుగు, శెనగపిండి ఫేస్ ప్యాక్
మీకు తెలుసా? ఎన్నో ఏండ్ల నుంచి శెనగపిండిని చర్మ సంరక్షణలో ఉపయోగిస్తూ వస్తున్నారు. ఈ శెనగపిండి చనిపోయిన చర్మ కణాలను తొలగించే మంచి ఎక్స్ ఫోలియేటర్. ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి రెండు టీ స్పూన్ల శెనగపిండి, టీ స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు అవసరమవుతాయి.
దీన్ని తయారుచేయడానికి ఈ పదార్థాలన్నింటిని ఒక గిన్నెలో వేసి చిక్కటి పేస్ట్ లా చేయండి. దీన్ని ముఖానికి బాగా అప్లై చేయండి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత చేతులతో రుద్దుతూ కడిగేయాలి.
ఓట్స్, తేనె ఫేస్ ప్యాక్
తేనె మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. నిజానికి ఇదొక నేచురల్ మాయిశ్చరైజర్ అయితే ఓట్స్ మంచి స్క్రబ్ లాగ పనిచేస్తాయి. ఈ తేనె, ఓట్స్ ఫేస్ ప్యాక్ పొడి చర్మం, చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి టీ స్పూన్ ఓట్స్ లో టీ స్పూన్ తేనె వేసి బాగా కలపండి. ఇందులోనే కొంచెం రోజ్ వాటర్ ను కూడా యాడ్ చేయండి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేయండి. అయితే వాష్ చేయడానికి ముందు ఖచ్చితంగా ముఖాన్ని మసాజ్ చేయాలి.
చక్కెర, టమాటా ఫేస్ ప్యాక్
టమాటాల్లో చర్మానికి మేలు చేసే లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. టమాటాల్లో ఉండే లైకోపీన్ చర్మాన్ని హెల్తీగా ఉంచడానికి, చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి.. చిన్న టమాటా తీసుకుని గుజ్జులాగ చేయండి. దీనిలో సగం టీ స్పూన్ చక్కెరను వేసి కలపండి. దీన్ని చేతుల్లోకి తీసుకుని ముఖానికి పెట్టండి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత చల్ల నీళ్లతో కడిగేయండి.
ముల్తానీ మట్టి, వేప ఫేస్ ప్యాక్
మొటిమలు, ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టి అదనపు ఆయిల్ ను గ్రహిస్తుంది. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి టీ స్పూన్ ముల్తానీ మట్టిలో 1/2 టీస్పూన్ వేప పొడిని, కొంచెం రోజ్ వాటర్ ను వేసి పేస్ట్ చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి.
కీరదోసకాయ, కలబంద ఫేస్ ప్యాక్
కీరదోసకాయ, కలబంద రెండూ మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటిలో చర్మాన్ని చల్లగా ఉంచే లక్షణాలుంటాయి. అలాగే చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఈ ఫేస్ ప్యాక్ సెన్సిటీవ్ స్కిన్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
దీన్ని తయారుచేయడానికి టీ స్పూన్ కలబంద జెల్ లో టీ స్పూన్ కీరదోసకాయ రసం వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ లను వారానికి 2-3 సార్లు వేసుకుంటే మీ ముఖంలో మార్పును మీరే గమనిస్తారు.