Fact: పక్షులు 'V' ఆకారంలో ఎందుకు ఎగురుతాయో తెలుసా? అసలు కారణం ఏంటంటే..
ఆకాశంలో పక్షులు విహరిస్తుంటే చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల పక్షులు 'V' ఆకారంలో ఎగరడం గమనించే ఉంటాం. అయితే పక్షులు ఇదే ప్యాటరన్‌లో ఎగరడానికి ఒక కారణం ఉందని మీకు తెలుసా.? ఇంతకీ పక్షులు ఇలా ఎగరడానికి అసలు కారణం ఏంటి.? దీనివెనకాల ఉన్న సైంటిఫిక్ లాజిక్ ఏంటి.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పక్షులు V ఆకారంలో వలస వెళ్లడం ప్రకృతిలో చాలా అద్భుతమైన దృశ్యాలలో ఒకటి. ఇది ఒక క్రమ పద్ధతిలో ఎగరడంలా కనిపిస్తుంది. అయితే దీనికి వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. పక్షులు ఇలా ఒక ప్యాటరన్‌లో విహరించడం వల్ల వాటి శక్తిని ఆదా చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అందుకోసమే పక్షులు ఇలా విహరిస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది.
'V'ఆకారంలో పక్షులు విహరించే సమయంలో ముందుండే పక్షి గాలిని చీల్చుకుంటూ వెళ్తుంది. దీనివల్ల వెనకాల వచ్చే పక్షులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ విధానం ద్వారా గుంపులోని పక్షులు శక్తిని ఆదా చేసుకుని సమర్థవంతంగా ప్రయాణించగలవు.
పక్షుల శక్తి ఎలా ఆదా అవుతుంది.?
ఈ విధానంలో పక్షులు తమ శక్తిని ఎలా ఆదా చేస్తాయో తెలుసుకోవడానికి, శాస్త్రవేత్తలు ఐబిస్ పక్షులపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఆ పక్షులను ఆస్ట్రియా నుంచిటలీకి ఒక చిన్న విమానం ద్వారా తీసుకెళ్లారు. ప్రతి పక్షి కదలికలను ట్రాక్ చేయడానికి ఒక పరికరాన్ని అమర్చారు. ఈ అధ్యయనంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఐబిస్‌లు ముందున్న పక్షిని అనుసరించకుండా, గాలి ప్రవాహానికి అనుగుణంగా తమ రెక్కలను కదిలిస్తాయి. వాటి కదలికలను సమన్వయం చేసుకోవడం చాలా గొప్ప విషయం.
V-ఆకారంలో పక్షులు నాయకుడిని అనుసరిస్తున్నట్లు అనిపించవచ్చు, కానీ వాటి ప్రయాణం చాలా క్లిష్టమైనది. వెనుక ఉన్న పక్షులు గాలి ఒత్తిడిని తగ్గించడానికి తమ స్థానాన్ని, రెక్కల కదలికలను మారుస్తాయి. పక్షులు కదిలే రెక్కలతో విమానాల్లా ఉంటాయి. ఈ అధ్యయనం ఐబిస్‌లపై దృష్టి సారించినప్పటికీ, బాతులు, కొంగలు వంటి ఇతర పెద్ద వలస పక్షులు కూడా ఇలాంటి శక్తిని ఆదా చేసే పద్ధతులను ఉపయోగిస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.
అదనంగా, కొంగలు, ఫ్లెమింగోలు, కొన్ని బాతులు కూడా ఈ పద్ధతిని ఉపయోగిస్తాయి. V ఆకారంలో ఎగరడం ద్వారా, ఈ పక్షులు శక్తిని ఆదా చేస్తాయి. వెనుక ఉన్న పక్షులు ముందున్న పక్షి ఉత్పత్తి చేసే గాలి ప్రవాహాల నుంచి ప్రయోజనం పొందుతాయి. ఇదండీ పక్షులు 'V' ఆకారంలో విహరించడం వెనకాల ఉన్న అసలు కారణం.