బుడతడి సాహసం.. 139 కి.మీ. సైకిల్ తొక్కి మరీ తల్లిపై అమ్మమ్మకు ఫిర్యాదు.. చివరికి....
తల్లి మీద అమ్మమ్మకు కంప్లైంట్ చేయడానికి ఏకంగా 130కి.మీ.లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడో 11యేళ్ల చిన్నారి. ఈ విషయం వెలుగు చూడడంతో వైరల్ గా మారింది.
చైనా : తల్లికొప్పడిందనో, మందలించిందనో…తాను అడిగింది ఇవ్వలేదనో.. చిన్నారులు అలగడం.. తండ్రికో, తాతయ్య నాయనమ్మలకో.. తల్లి మీద ఫిర్యాదు చేయడం ప్రతి ఇంట్లోనూ చూస్తూనే ఉంటాం. వారి ముద్దు చేష్టలు చూసి నవ్వుకుంటాం. అయితే ఇలాంటి పనే ఓ 11 ఏళ్ల బాలుడు చేశాడు. కానీ, ఇలా తల్లి మీద అమ్మమ్మకు ఫిర్యాదు చేయడం కోసం.. 130 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్ళాడు. ఈ వార్త వెలుగు చూడడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెడితే…
చైనాకు చెందిన ఓ చిన్నారి ఏదో విషయంలో తల్లితో గొడవపడ్డాడు. దీంతో మనస్థాపానికి గురైయ్యాడు. ఎలాగైనా చేసి తల్లిని అమ్మమ్మతో తిట్టించాలనుకున్నాడు. దీనికోసం అమ్మమ్మకు ఫిర్యాదు చేయాలని ఆమె ఇంటికి బయలుదేరాడు. కానీ ఎలా వెళ్లాలో తెలియదు. ఆమె ఇల్లు ఇక్కడా, అక్కడా కాదు మరి.. 130 కిలోమీటర్ల దూరంలోని మిజియాంగ్ లో ఉంది.
తన దగ్గర ఉన్నది ఒకటే వాహనం సైకిల్. దాని మీదే ప్రయాణం మొదలుపెట్టాడు. రోడ్డు మీద ఉండే గుర్తుల సహాయంతో ముందుకు సాగాడు. వచ్చేప్పుడు తనతో పాటు తెచ్చుకున్న బ్రెడ్, మంచినీళ్లతో ఆకలి తీర్చుకున్నాడు. అలా ఏకంగా 130కి.మీ. వెళ్ళాడు చిన్నారి, సరిగా రూటు తెలియదు.. కానీ వెళ్లాలన్న పట్టుదల.. అయినా దారి తప్పాడు.. ఒక్క రోజులో చేరుకోవాల్సిన దూరానికి రెండో రోజుకు చేరినా చేరుకోలేకపోయాడు.
సైకిల్ తొక్కి తొక్కి అలసిపోయి నడవలేని స్థితిలోకి చేరాడు. ఓ దగ్గర అలిసిపోయి ఒంటరిగా కూర్చున్నాడు. అది చూసిన కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడిని వివరాలు కనుక్కున్నారు. చిన్నారి చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయారు.. వాడి సాహసానికి షాక్ అయ్యారు. అప్పటికే చిన్నారి నడవలేని స్థితిలో ఉండడంతో తమ కారులో దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి అప్పజెప్పారు.
అక్కడి నుంచి బాలుడి తల్లిదండ్రులకు, అమ్మమ్మకు విషయాన్ని తెలిపారు. కొడుకుని వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్న తల్లి.. చిన్నారిని కోప్పడిన తర్వాత కోపంలో అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపో అని బెదిరించినట్లుగా తెలిపింది. కానీ నిజంగానే కొడుకు అలా చేస్తాడని అనుకోలేదని అనింది.
ప్రస్తుతం ఈ స్టోరీ వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాత్రిపూట కూడా భయపడకుండా బాలుడు ప్రయాణించిన తీరును చాలామంది మెచ్చుకున్నారు. మరి కొంతమంది.. ఇంతకీ బాలుడి అమ్మమ్మ.. వాళ్ళ అమ్మని కోప్పడిందా లేదా.. ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని అన్నారు.