మీ పిల్లలు డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే.. ఈ డాక్టర్ల సూచనలు పాటించండి
World Diabetes Day 2025 : మారుతున్న జీవనశైలి, అహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుతం డయాబెటిస్ బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇది మీ పిల్లల ధరిచేరకుండాా ఉండాలంటే ఈ డాక్టర్ల సూచనలు పాటించండి.

డయాబెటిస్ పై అవగాహన
World Diabetes Day 2025 : నవంబర్ 14 అనగానే గుర్తుకువచ్చేది చిల్ట్రన్స్ డే. కానీ అదేరోజు నేడు మానవ సమాజాన్ని పట్టిపీడిస్తున్న డయాబెటిస్ డే కూడా. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వేగంగా విస్తరిస్తోంది... ముఖ్యంగా భారతదేశంలో అయితే కోట్లాదిమంది ఇప్పటికే దీని బారిన పడ్డారు. ఈ క్రమంలో డయాబెటిస్ వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలు, దీన్ని తగ్గించుకునే మార్గాలు, అసలు ఇది ధరిచేరనివ్వకుండా ఉండేందుకు పాటించాల్సిన ముందుజాగ్రత్తలు వంటివాటి గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా వరల్డ్ డయాబెటిస్ డే ను ప్రకటించారు.
ఈ ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ బి.శ్రావ్య, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ భావన ప్రజల్లో డయాబెటిస్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పెరుగుతున్న మధుమేహం కేసులు, దాని వల్ల ఏర్పడే సమస్యలు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.
జీవనశైలిని మార్చుకుంటే డయాబెటిస్ కంట్రోల్
''గత కొద్ది దశాబ్దాల కిందట మధుమేహం సాధారణంగా 40–50 సంవత్సరాల వయసు ఉన్నవారిలో మాత్రమే కనిపించేదని డాక్టర్లు తెలిపారు. కానీ ఇప్పుడు 15–20 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతలో కూడా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన జీవనశైలి, సరైన నిద్రలేమి, వ్యాయామం చేయకపోవడం, ఆహారపు అలవాట్లు... ఇవన్నీ కలసి ఊబకాయం (ఒబెసిటీ)కి దారితీస్తాయన్నారు. దీంతో మధుమేహం త్వరగా వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని కామినేని డాక్టర్లు తెలిపారు.
డాక్టర్ శ్రావ్య మాట్లాడుతూ.. “మధుమేహం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. టైప్-1 డయాబెటీస్ అనేది శరీరంలో అనేక మార్పుల కారణంగా ప్యాంక్రియాస్ సరైన రీతిలో పనిచేయకపోవడంతో వస్తుంది. దీనివల్ల ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ రకానికి చెందిన రోగులు జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. టైప్-2 డయాబెటీస్ మాత్రం ఎక్కువగా జీవనశైలి సంబంధించిందే... దీన్ని జీవనశైలిలో మార్పులు చేసి నియంత్రించవచ్చు,” అని తెలిపారు.
“ఇటీవలి కాలంలో యువతలో టైప్ 2 డయాబెటిస్ అధికంగా కనిపిస్తోంది. ప్రతి రోజు మా అవుట్‌పేషెంట్ విభాగానికి 20–30 మంది మధుమేహ రోగులు వస్తారు... వారిలో సుమారు 30% మంది యువకులు లేదా యువతులే... కొందరు 20, 30 ఏళ్ల వయసులోనే ఉంటారు.. మరికొందరు 10–15 సంవత్సరాల వయసులోనే డయాబెటీస్ తో బాధపడుతున్నారు. వీరిలో చాలా మంది అధిక బరువుతో ఉంటారు, ఇది వారి జీవనశైలిలో మార్పు అవసరాన్ని సూచిస్తోంది. పిల్లల్లో కూడా ఊబకాయం పెరుగుతోంది, ఇది ఆందోళన కలిగించే విషయం” అని డాక్టర్ శ్రావ్య అన్నారు.
మధుమేహంతో ఇండియన్స్ జాగ్రత్త..
“పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఆసియా దేశాలవారు మధుమేహానికి ఎక్కువగా గురవుతారు. అందుకే ప్రజలు 30 ఏళ్ల వయసు నుంచే మధుమేహ పరీక్షలు చేయించుకోవడం ప్రారంభించాలి. గర్భిణీ స్త్రీలు కూడా గర్భధారణ సమయంలో మధుమేహం ఉందో లేదో నిర్ధారించుకునే పరీక్షలు తరచుగా చేయించుకోవాలి. అధిక బరువున్నవారు, ఊబకాయంతో బాధపడేవారు తరచుగా టెస్టులు చేయించుకోవాలి. అలాగే రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ ఉన్నవారు ప్రతి ఏడాది ఒకసారి డయాబెటీస్ టెస్టులు చేయించుకోవడం అవసరం'' అంటున్నారు డాక్టర్ శ్రావ్య.
''మునుపటిలా కేవలం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం మాత్రమే కాకుండా ఇప్పుడు గుండె, కిడ్నీలు, కళ్ళు, కాళ్ల వంటి ముఖ్య అవయవాలను కూడా రక్షించడంపై దృష్టి పెడుతున్నారు. బరువు నియంత్రణ కూడా ఇప్పుడు చికిత్సలో కీలక భాగమైంది. కొన్ని ఆధునిక మధుమేహ మందులు బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి” అని ఆమె వివరించారు.
బరువు నియంత్రణ చాలా ముఖ్యం
కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ భావన మాట్లాడుతూ.. “మధుమేహ రోగులు తప్పనిసరిగా తమ శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. కేవలం 5–10% శరీర బరువు తగ్గించడం ద్వారా కూడా మధుమేహ నియంత్రణలో గణనీయమైన మార్పు వస్తుంది. ప్రతిరోజూ నడక వంటి శారీరక వ్యాయామం తప్పనిసరి. వైద్యులు సూచించిన మందులు సమయానికి తీసుకోవాలి. నియమపాలనతో జీవిస్తే ఆరోగ్యంగా, మధుమేహాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు,” అన్నారు.
“మధుమేహ పరీక్షలు కేవలం భోజనం ముందు, తర్వాత చేసే రక్త చక్కెర పరీక్షలకే పరిమితం కాకూడదు. గత కొన్ని నెలల రక్త చక్కెర సగటును తెలియజేసే HbA1c పరీక్ష కూడా అంతే ముఖ్యం. ఈ పరీక్ష ద్వారా రోగస్థితి గురించి వైద్యులు స్పష్టమైన అంచనా వేసి సరైన చికిత్స సూచించగలరు,” అని డాక్టర్ భావన తెలిపారు.