Wine Shops: ఈ ప్రాంతాల్లో వైన్స్ దుకాణాలు బంద్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.
Wine Shops: బోనాల పండుగను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆల్కహాల్ విక్రయాలపై కీలక ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో వైన్ షాపులు బంద్ చేయాలని ఆదేశించారు.

ఈ ప్రాంతాల్లో ఆల్కహాల్ విక్రయాలు నిలిపివేత
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కూకట్‌పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మేడ్చల్, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు కూడా ఈ ఉత్తర్వులకు లోబడి ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే స్టార్ హోటళ్లలో నిర్వహిస్తున్న బార్లు, చట్టబద్ధంగా నమోదైన క్లబ్‌లలోని బార్లకు ఈ నిషేధం వర్తించదని తెలిపారు.
ఇతర జోన్లలో మరింత కఠిన ఆంక్షలు
బోనాల వేడుకలు జరిగే ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఇతర పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలో కూడా ఆల్కహాల్ విక్రయాలపై ప్రత్యేక ఆంక్షలు విధించారు. రాజేంద్రనగర్, గోల్కొండ జోన్‌లలో ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం 10 గంటల వరకు అన్ని వైన్స్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఇక చార్మినార్ జోన్ పరిధిలో ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 11 ఉదయం 9 గంటల వరకు ఆల్కహాల్ విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు.
ముందస్తు చర్యలు
బోనాల ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో శాంతి, భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఆల్కహాల్ విక్రయాలపై తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. మరోవైపు బోనాల సందర్భంగా పలు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లను కూడా అధికారులు చేపట్టారు. అలాగే బోనాల వేడుకల నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

