Weather Update: అతి భారీ వర్షాలు.. రానున్న 72 గంటలు అలర్ట్‌గా ఉండండి
Weather Update: తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో వచ్చే 72 గంటలు అత్యంత అలెర్ట్‌గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణ లో భారీ వర్షాల అంచనాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలనీ, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే హెచ్చరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
వచ్చే 72 గంటల వ్యవధిలో హైఅలర్ట్ లో ఉండాలన్నారు. ఏదైనా జరిగితే తక్షణ చర్యలు తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కంట్రోల్ రూమ్‌తో అన్ని కమ్యూనికేషన్లు నిరంతరం కొనసాగించాలని ముఖ్యమంత్రి సూచించారు.
భారీ వర్షాలతో అన్ని విభాగాలు అప్రమత్తం
అకస్మిక వరదల పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే హెలికాప్టర్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సిబ్బందితో సమన్వయం నిర్వహించాలని సీఎం పేర్కొన్నారు.
విద్యుత్ అంతరాయాలు రాకుండా, మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను సిద్ధంగా ఉంచాలని, హైదరాబాద్‌లో వరద పరిస్థితులపై హెచ్‌డీఎంఎస్ (Hydra) ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సమయంలో ప్రజలు ఫిర్యాదు చేయగలిగేలా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు.
స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
భారీ వర్షాల సమయంలో స్కూల్స్, కాలేజీలు, ఐటి సంస్థలకి సెలవులు ప్రకటించాల్సిన అవసరం ఉంటే సంబంధిత శాఖల అధికాధికారులు తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు బయటకు రాకుండా, ప్రాణనష్టం జరగకుండా అన్ని అవసర చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్న విపత్తు నివారణ నిధులను తక్షణం వినియోగించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.
విపత్తు మేనేజ్‌మెంట్ దిశగా ప్రభుత్వం సమన్వయం
తెలంగాణలో ఇప్పటికే 2,000 మంది విపత్తు స్పందన సిబ్బంది శిక్షణ పొందినట్లు, అవసరమైన ప్రాంతాలకు వీరిని పంపించమని సూచించారు. హెలికాప్టర్ అవసరం ఉంటే ముందుగానే కోఆర్డినేషన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. గతంలో ఖమ్మం జిల్లాలో కలెక్టర్ చర్యల లోపం వల్ల పెద్ద నష్టం జరిగిందని గుర్తు చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
మెడికల్, హెల్త్ శాఖ సిబ్బందిని, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజలను ప్రమాద ప్రదేశాలకు వెళ్లనివ్వకుండా చూడాలని, పోలీసులు, ఉన్నతాధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
ప్రజలకి ఎఫ్ఎం, టీవీలు అలర్ట్ లు
వర్షాల సమయంలో తప్పుడు వార్తల ప్రసారం జరగకుండా అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. ఎఫ్ఎం రేడియో, టీవీ ద్వారా ప్రజలకు నిరంతర అప్డేట్లు అందించాలని ఆదేశించారు.
పాత భవనాలు భద్రంగా లేకపోతే ప్రజలను తరలించాలని సూచించారు. “నేను కూడా అందుబాటులో ఉంటాను. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే తెలియజేయండి” అంటూ సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy participates in video conference with all District Collectors at TGICCC, Hyderabad. https://t.co/CpriEdh30V
— Telangana CMO (@TelanganaCMO) August 12, 2025