Pulivendula: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు.
KNOW
Pulivendula: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌లో జరిగిన అవాంఛనీయ ఘటనలు, రిగ్గింగ్, బెదిరింపులపై స్పందిస్తూ, ఈ ఎన్నికలను రాష్ట్ర ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. చిన్న స్థాయి స్థానిక ఎన్నికల్లో కూడా అధికారం కోసం ఈ స్థాయిలో అరాచకాలు జరగడం రాష్ట్ర చరిత్రలో లేదని అభిప్రాయపడ్డారు.
బ్లాక్ డేగా అభివర్ణించిన వైఎస్ జగన్
“ఒక చిన్న జడ్పీటీసీ సీటు గెలవడానికే రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని దెబ్బకొట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థను తన కంట్రోల్‌లోకి తీసుకుని, ఎన్నికలను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఈ స్థాయిలో గాయపరిచిన రోజు ‘బ్లాక్ డే’గా మిగిలిపోతుంది అన్నారు. ఈ ఎన్నికలను రద్దు చేసి తిరిగి కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
పోలింగ్ బూత్‌ల మార్పులపై విమర్శలు
పోలింగ్ బూత్‌లను అనవసరంగా 2–4 కి.మీ.ల దూరాలకు మార్చి, ఓటర్లకు ఇబ్బందులు కలిగించారని జగన్ ఆరోపించారు. బయట ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలను తీసుకువచ్చి, పోలింగ్ కేంద్రాలను ఆక్రమించి, ఓటర్లను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఓటర్ల స్లిప్పులు లాక్కుని, తమ అనుచరులతో ఓటేయించారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బూత్‌లలో కూర్చోనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా ఏజెంట్లపైన కూడా దాడులు జరిగాయని జగన్ ఆరోపించారు.
పోలీసులు, భద్రతా బలగాల పాత్రపై విమర్శలు
ప్రజలు నిర్భయంగా ఓటు వేయగల వాతావరణం కల్పించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. కానీ ఈ ఎన్నికల్లో పోలీసులు కూడా చంద్రబాబు ఆదేశాలకు లోబడి, టీడీపీ కార్యకర్తల దాడులకు కాపలా కాశారంటూ జగన్ విమర్శలు గుప్పించారు. 2017 నంద్యాల ఉప ఎన్నిక ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అప్పట్లో కూడా ఇలాగే అరాచకాలు జరిగాయనీ, చివరికి ప్రజలు నిజమైన తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు.
పులివెందులలో 76.44% పోలింగ్
పులివెందులలో 76.44% పోలింగ్, ఒంటిమిట్టలో 79.39% పోలింగ్ నమోదైంది. రెండు చోట్లా 11 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పోరు వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే సాగింది. ఎన్నికల రోజున పలు ప్రాంతాల్లో ఘర్షణలు, హౌస్ అరెస్టులు, పోలీసుల, ప్రజల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కడప కలెక్టర్ పర్యవేక్షణలో 1,400 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో ఉన్నప్పటికీ, అనేక సమస్యలు వెలువడ్డాయి. ఫలితాలు ఎల్లుండి వెలువడనుండగా, ఈ వివాదం ఎన్నికల ఫలితాలపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఆసక్తికరంగా మారింది.
