Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...
Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు వర్షాలు కురుస్తున్నాయి… మరోవైపు చలి ఇరగదీస్తోంది. మరి సంక్రాంతి సమయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా?

తెలంగాణలో వర్షం
IMD Rain Alert : తెలంగాణలో ఈ ఏడాది (2026లో) మొదటివర్షం కురిసింది... దాదాపు రెండు నెలల తర్వాత పొడి వాతావరణానికి బ్రేక్ వేస్తూ చిరుజల్లులు కురిశాయి. రాజధాని హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో బుధవారం(జనవరి 14న) సాయంత్రం వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ లో మోస్తరు వానలు పడగా... ఇక కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి.
హైదరాబాద్ లో వర్షం
హైదరాబాద్ విషయానికి వస్తే... చందానగర్, మియాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, సోమాజీగూడ ప్రాంతాల్లో చినుకులు కురిశాయి. దిల్ సుఖ్ నగర్ లో కూడా వర్షం కురిసిందని వెదర్ మ్యాన్ తెలిపారు. ఇలా నగరంలోని అనేక ప్రాంతాలను వర్షం పలకరించింది... దీంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఈ వర్షం కారణంగా తెలంగాణలో చలి తీవ్రత కూడా తక్కువగా ఉంది.
తెలంగాణలో చలి
గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటున్నాయి... దీంతో చలి తగ్గింది. కానీ సంక్రాంతి పండగ సమయంలో మెళ్లిగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి... ఇవాళ (జనవరి 15న) రాత్రి, రేపు (జనవరి 16, శుక్రవారం) తెల్లవారుజామున ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుండి 15 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలిపింది. మిగతాజిల్లాల్లో 15 డిగ్రీలకు పైనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించింది.
ఏపీలో పెరిగిన చలి
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వర్షాలు తగ్గడంతో చలి పెరిగింది. దట్టమైన పొగమంచు కూడా కురుస్తోంది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది... మరికొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇలాగే సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఉత్తరాదిని వణికిస్తున్న చలి
దేశ రాజధాని డిల్లీని చలి వణికిస్తోంది... హిమాలయా ప్రాంతాల్లో కంటే ఇక్కడే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. డిల్లీలోని పలుప్రాంతాల్లో 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి... గత 13 ఏళ్లలో ఇదే అత్యల్ప టెంపరేచర్. ఇక జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అక్కడక్కడ మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల ఈ చలిగాలులకు తోడుగా మంచు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ జనవరి నెలంతా చలి ఇదేస్థాయిలో ఉంటుందని IMD హెచ్చరిస్తోంది.

