- Home
- Telangana
- IMD Cold Wave Alert : చలి నుండి ఉపశమనం మూన్నాళ్ల ముచ్చటే.. మళ్లీ గజగజలాడించే చలి, పొగమంచు ఎక్స్ట్రా
IMD Cold Wave Alert : చలి నుండి ఉపశమనం మూన్నాళ్ల ముచ్చటే.. మళ్లీ గజగజలాడించే చలి, పొగమంచు ఎక్స్ట్రా
Telangana And Andhra Pradesh Weather : తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గడం మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలింది. మళ్లీ క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగి చలి పీక్స్ కు చేరుకుంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది... ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రారంభం అయ్యింది. డిసెంబర్ నెలంతా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదై చలి చంపేసింది... కానీ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూనే వెదర్ చేంజ్ అయ్యింది. చలిగాలుల తీవ్రత తగ్గి పొగమంచు తీవ్రత పెరిగింది... తెల్లవారుజామున జీరో విజిబిలిటి స్థాయిలో మంచు కురుస్తోంది. దీంతో ఉదయం వేళ ప్రయాణాలు చేసేందుకు ప్రజలు జంకుతున్నారు... అత్యవసరం అయితేనే రోడ్డెక్కుతున్నారు.
తెలంగాణలో చలి తగ్గడానికి కారణమిదే...
తెలంగాణలో గత రెండుమూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడానికి, చలి తగ్గడానికి తూర్పు, ఆగ్నేయ దిశల నుండి తేమ గాలులు ప్రవేశించడమే కారణమని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ప్రస్తుతం ఈ తేమగాలుల ప్రభావం తగ్గుతోందట.... ఉత్తర గాలులు ప్రారంభమై మళ్లీ చలి పెరుగుతోందని హెచ్చరిస్తోంది. జనవరి 4 నుండి తెలంగాణలో మళ్లీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... చలి వణికిస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలంగాణలో రేపట్నుంచి మళ్లీ సింగిల్ డిజిట్ టెంపరేచర్స్
తెలంగాణవ్యాప్తంగా ఇవాళ (జనవరి 3, శనివారం) కూడా 11 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలుంటాయని వాతవారణ శాఖ తెలిపింది. రేపటి (జనవరి 4, ఆదివారం) నుండి క్రమంగా టెంపరేచర్స్ తగ్గుతాయని... కొన్నిజిల్లాల్లో మళ్లీ సింగిల్ డిజిట్ కు పడిపోతాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 5-10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... మిగతా జిల్లాల్లో 11 నుండి 20 డిగ్రీల లోపు ఉంటాయని ప్రకటించింది.
అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే...
శుక్రవారం (జనవరి 2) అత్యల్పంగా మెదక్ జిల్లాలో 12.4 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది. ఇక ఆదిలాబాద్ లో అత్యల్పం 13.7, అత్యధికం 30.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 16.6, నిజామాబాద్ లో 16.3, నల్గొండలో 16, మహబూబ్ నగర్ లో 19.5. ఖమ్మంలో 18, హన్మకొండలొ 16.5, భద్రాచలంలో 18.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్ లోనూ తగ్గిన చలి
హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగాయి... పటాన్ చెరులో 13.4 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. రాజేంద్రనగర్ లో 15, హయత్ నగర్ లో 16, హకీంపేటలో 17.5, బేగంపేటలో 18.3, దుండిగల్ లో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఓవరాల్ గా హైదరాబాద్ లో సగటు లోయెస్ట్ టెంపరేచర్స్ 18.3 డిగ్రీలు కాగా గరిష్ఠం 27.1 డిగ్రీలుగా నమోదయ్యింది.
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ప్రస్తుతం చలి తీవ్రత కాస్త తక్కువగానే ఉంది... కానీ విపరీతమైన పొగమంచు కురుస్తోంది. అత్యల్పంగా మినుమలూరులో 8, పాడేరులో 10, అరకులో 11, చింతపల్లిలో 15.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనవరి 4 నుండి ఏపీలో కూడా మళ్ళీ ఉష్ణోగ్రతలు పడిపోతాయని... పొగమంచు తగ్గి చలి పెరుగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

