హైదరాబాద్ చుట్టుపక్కల అందమైన జలపాతాలు... ఈ వీకెండ్ లో సరదాగా వెళ్లిరండి
హైదరాబాద్ లో నివాసముండేవారు ఇలా ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగివచ్చేలా అనేక టూరిస్ట్ ప్రాంతాలున్నాయి. కానీ ఈ వర్షాకాలంలో కొన్ని ప్రకృతి అందాలను మాత్రం మిస్ కావద్దు… అలాంటి టాప్ 5 జలపాతాల గురించి తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

హైదరాబాద్ దగ్గర్లో ప్రకృతి అందాలు
Telangana Tourism : వీకెండ్ వచ్చిందంటే చాలామంది హైదరబాదీలు సరదాగా లాంగ్ డ్రైవ్, చిన్నచిన్న ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. నగరం చుట్టుపక్కలే ఓ 100-300 కిలోమీటర్ల దూరంలో ఉండే పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడికి ఉదయం వెళ్లి రాత్రికి ఇంటికి చేరుకోవచ్చు... బాగా అలసిపోయినా రెస్ట్ తీసుకోవచ్చు. దీంతో సరదాగా చేపట్టే ఈ ట్రిప్ ప్రభావం ప్రొఫెషనల్ లైఫ్ పై పడదు... పనికి పని ట్రిప్ ట్రిప్ కు కానియ్యవచ్చు.
ఇలా మీరుకూడా ఈ వర్షాకాలంలో చల్లచల్లని ఆహ్లాదకర వాతావరణంలో మరింత చిల్ కావాలనుకుంటున్నారా? ఈ వీకెండ్ లో ఇలా ఉదయం వెళ్ళి ప్రకృతి అందాలను వీక్షించి సాయంత్రానికి ఇంటికి చేరాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ సమీపంలోని ఈ జలపాతాల గురించి ఇక్కడ తెలుసుకొండి. కుటుంబం లేదంటే స్నేహితులతో కలిసి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయవచ్చు... చాలా తక్కువ బడ్జెట్ లోనే ఈ వన్డే ట్రిప్ ముగుస్తుంది.
హైదరాబాద్ సమీపంలో టాప్ 5 జలపాతాలు
వర్షాకాలంలో ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది. భూమికి పచ్చని చీరచుట్టినట్లుగా కనిపించే ప్రకృతి సోయగాలు చూసేందుకు కనువిందు చేస్తాయి. ఇక వర్షఫునీటితో నిండుకుండలా మారే జలాశయాలు, పరవళ్లు తొక్కే ప్రవాహాలు, అంతెత్తు కొండలపైనుండి జాలువారే జలపాతాలు... ఆహా.. ఆ అందాల గురించి చెబుతుంటేనే అద్భుతమైన ఫీలింగ్ కలుగుతోంది... అలాంటిది కనులారా చూస్తే ఇంకెలా ఉంటుంది. ఇలాంటి సరికొత్త అనుభూతిని కలిగించే జలపాతాలు హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి... నగరం నుండి ఈజీగా వెళ్లివచ్చే ఇలాంటి టాప్ 5 జలపాతాల గురించి తెలుసుకుందాం.
1. కుంటాల జలపాతం (ఆదిలాబాద్)
తెలంగాణలో అత్యంత ఎత్తైన జలపాతం ఈ కుంటాల. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల గ్రామ సమీపంలో ఉంటుంది. కడెం నది సహ్యాద్రి పర్వతాల్లోంచి నీటిని మోసుకుంటూ వచ్చి కుంటాల గ్రామ సమీపంలో కిందకు దూకుతుంది. దాదాపు 44 మీటర్ల ఎత్తునుండి నీరు కిందకు దూకుతుంటే…. నీటితుంపర్లు మీదపడుతుంటే, పాలనురగలా నీరు కనిపిస్తుంటే ఆ సీన్ అద్భుతంగా ఉంటుంది. అందుకే వర్షాకాలం వచ్చిందంటే కుంటాల జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరుగుతుంది.
హైదరాబాద్ నుండి 260 కిలోమీటర్ల దూరంలో ఈ కుంటాల జలపాతం ఉంటుంది. ఆదిలాబాద్-నిర్మల్ మధ్యగల 44వ జాతీయ రహదారి మీదుగా ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు. ఆదిలాబాద్ నుండి 60కి.మీ, మండలకేంద్రం నేరడిగొండ నుండి 12 కి.మీ దూరంలో ఈ జలపాతం ఉంటుంది.
2. ఎత్తిపోతల జలపాతం (నాగార్జునసాగర్) :
ఈ జలపాతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో పల్నాడు జిల్లాలో ఉంది. కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదీజలాలు దాదాపు 70 అడుగుల ఎత్తునుండి జాలువారుతుంటే ఆ దృశ్యం చూసేందుకు, ఆ నీటి సవ్వడి వినేందుకు అద్భుతంగా ఉంటుంది. ఈ జలపాతం సమీపంలోని నాగార్జున సాగర్ డ్యామ్ ఉంటుంది.
ఈ జలపాతం హైదరాబాద్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది… ఇది ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ నుండి ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు వెళుతుంటారు.
3. మల్లెల తీర్థం (నాగర్ కర్నూల్)
నాగర్ కర్నూల్ జిల్లాలోని అందమైన జలపాతం ఈ మల్లెల తీర్థం. 150 అడుగుల ఎత్తునుండి నీరు జాలువారుతుంటే చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. పచ్చని నల్లమల అడవుల్లోని ఈ జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా సాహస యాత్రికులు ఈ ట్రిప్ ను ఎంజాయ్ చేయవచ్చు... ట్రెక్కింగ్, క్యాంపింగ్ కు అనుకూలంగా ఉంటుంది. శ్రీశైలం నుండి కేవలం 58 కిలోమీటర్ల దూరం, హైదరాబాద్ లో 185 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
4. బోగత జలపాతం
ఈ జలపాతాన్ని తెలంగాణ నయాగరాగా పిలుస్తారంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందమైన అడవుల మధ్యలోంచి ప్రవహించే జలాలు అంతెత్తునుండి కిందకు దూకుతుంటే ఆ సీన్ కనువిందు చేస్తుంది. ములుగు జిల్లా వాజేడు మండలం బోగత గ్రామ సమీపంలో ఈ జలపాతం ఉంది.
వరంగల్ నుండి 130, భద్రాచలం నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంటుంది. హైదరాబాద్ నుండి అయితే 320 కి.మీ దూరం ఉంటుంది... కాస్త ఎక్కువ దూరమే ఉన్నా ఈ జలపాతం అందాలు దాన్ని మైమరిపించేలా ఉంటాయి.
5. సిర్నాపల్లి జలపాతం (ఆదిలాబాద్)
హైదరాబాద్ కు అతి సమీపంలోని జలపాతాల్లో సిర్నాపల్లి ఒకటి. ఇది నగరానికి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది... కాబట్టి చాలా ఈజీగా ఇక్కడికి చేరుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామ సమీపంలో ఈ జలపాతం ఉంటుంది. దట్టమైన అడవిలో దాదాపు 40 అడుగుల ఎత్తునుండి నీరు జాలువారుతుంది. వీకెండ్ లో హైదరాబాద్ నుండి చాలామంది ఈ జలపాతాన్ని చూసేందుకు వెళుతుంటారు.