హైదరాబాద్ నుండి ఈ ప్రాంతాలకు రోడ్ ట్రిప్ మనసు దోచేస్తుంది... ఈ వీకెండ్ ట్రై చేయండి
వీకెండ్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుండి ఈ ప్రదేశాలు వర్షాకాలంలో వెళితే అద్భుతంగా ఉంటుంది. ప్రకృతిలో మునిగిపోవాలంటే ఇవే బెస్ట్ డెస్టినేషన్స్!

హైదరాబాద్ నుండి వీకెండ్ రోడ్ ట్రిప్స్
Hyderabad Tourism : తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు కురుస్తున్నాయి... ప్రస్తుతం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. హైదరాబాద్ లో కూడా చిరుజల్లుతో చల్లచల్లగా అద్భుత వాతావరణం ఉంది. ఇలాంటి వెదర్ లో దుప్పటి కప్పుకుని ఎవరైనా పడుకుంటారు... కానీ ప్రియురాలినో, భార్యనో లాంగ్ డ్రైవ్ కు తీసుకెళ్ళేవాడే రొమాంటిక్ పర్సన్... కుటుంబాన్ని సరదాగా బయటకు తీసుకెళ్లేవాడే ఫ్యామిలీ మ్యాన్.
వీకెండ్ వచ్చేసింది... కాబట్టి ఆఫీస్ టెన్షన్స్ మరిచి హాయిగా లాంగ్ డ్రైవ్ కు వెళ్లాలనుకుంటున్నారా? భార్యాపిల్లలతో ఓ రోజంతా సరదాగా గడిపిరావాలని అనుకుంటున్నారా? ఈ వర్షాకాలంలో పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదించాలని అనుకుంటున్నారా? పైనుంచి చినుకులు రాలుతుంటే వాటిని చీల్చుకుంటూ కారును ముందును పోనిస్తూ డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా?.... అయితే మీరు ఈ ప్రాంతాలకు పయనం కావాల్సిందే. హైదరాబాద్ నుండి ఇలా ఉదయం వెళ్లి అలా సాయంత్రం తిరిగివచ్చే అద్భుతమైన రోడ్ ట్రిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. హైదరాబాద్ నుండి శ్రీశైలం :
ప్రకృతి ప్రేమికులు సాధారణంగానే వర్షాకాలంలో ట్రిప్ అంటేనే ఆనందిస్తారు... ఇలాంటివారినే మైమరిపించేలా ఉంటుంది హైదరాబాద్-శ్రీశైలం రోడ్ ట్రిప్. పచ్చని అడవి మధ్యలోంచి ప్రయాణం సాగుతుంది... చెట్ల మధ్యలోంచి రోడ్డు మలుపులు, అక్కడక్కడా జంతువుల సందడి, పక్షుల సవ్వడితో 200 కిలోమీటర్లకు పైగా ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. చివర్లో శ్రీశైలం ఘాట్ రోడ్డులో మలుపులు తిరుగుతూ శ్రీశైలం జలాశయంలోంచి కిందకు దూకే నీటినిచూస్తుంటే ఆ సీన్ నభూతో నభవిష్యత్ అన్నట్లు ఉంటుంది.
ఇక శ్రీశైలం చేరుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే ప్రకృతి యాత్రతో పాటు ఆద్యాత్మిక యాత్ర పూర్తిచేసినట్లు ఉంటుంది. కృష్ణా నదిలో బోటింగ్, అక్కమహాదేవి గుహల సందర్శన, రోప్ వే జర్నీ కూడా ఉంటాయి. తిరుగు ప్రయాణంలో కూడా ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు.
2. హైదరాబాద్ నుండి వికారాబాద్
నగరానికి అత్యంత దగ్గర్లో ప్రశాంత వాతావరణం కలిగిన ప్రాంతం వికారాబాద్. వర్షాకాలంలో ఇక్కడికి వెళితే పచ్చగా పరుచుకునే ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. రెండుమూడు గంటల ఈ రోడ్ ట్రిప్ ఆహ్లాదకరంగా ఉంటుంది. వికారాబాద్ అడవులు, అనంతగిరి కొండలు, చెరువులు, జలపాతాలు, జంతువులు, పక్షులు... ఆహా.. ఇది కదా ప్రకృతి అందాలంటే అనేలా ఉంటుంది.
3. హైదరాబాద్ నుండి నర్సాపూర్
నగరం నుండి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నర్సాపూర్. పచ్చని అడవి మధ్యలోంచి మలుపులు తిరుగుతూ సాగిపోయే రోడ్డు... జంతువులు, పక్షుల సందడితో హైదరాబాద్ నుండి నర్సాపూర్ రోడ్ ట్రిప్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి దగ్గర్లోనే పోచార అభయారణ్యం ఉంటుంది.
4. హైదరాబాద్ టు చిల్కూరు :
హైదరాబాద్ సమీపంలోని చిల్కూర్ ఆలయానికి కూడా రోడ్ ట్రిప్ బాగుంటుంది. ఇక్కడికి కేవలం గంట గంటన్నర జర్నీ ఉంటుంది. హైదరాబాద్ దాటగానే రోడ్డుపక్కన పచ్చని చెట్లు దర్శనమిస్తాయి. ఇక చిల్కూరు ఆలయానికి సమీపంలో చుట్టూ ఫార్మ్ హౌస్ లతో వాతాావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మార్గమధ్యలో ఉస్మాన్ సాగర్ జలాశయం కనువిందు చేస్తుంది.
5. హైదరాబాద్ టు విశాఖపట్నం
హైదరాబాద్ నుండి కాస్త ఎక్కువదూరం పోయివద్దామనుకుంటే విశాఖపట్నం పర్పెక్ట్ గా ఉంటుంది. ఒంపులు తిరుగుతూ సాగే రోడ్డు, తెలుగు రాష్ట్రాలమీదుగా పారే గోదావరి కృష్ణమ్మల పరవళ్లు, విశాఖ సమీపంలో దట్టమైన అడవులతో ఏజన్సీ ప్రాంతాలు, కొండల మీదుగా ఘాట్ రోడ్లపై జర్నీ... ఈ రోడ్ ట్రిప్ మరపురాని అనుభూతిని ఇస్తుంది. కానీ ఈ ట్రిప్ ఒక్కరోజులో ముగిసేది కాదు... నాలుగైదు రోజులపాటు సాగుతుంది.