TGSRTC: సంక్రాంతి పండుగకు ఉచిత బస్సు సదుపాయం ఉంటుందా.? ఇదిగో క్లారిటీ..
TGSRTC: స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. దీంతో పట్టణ వాసులంతా సొంతూర్లకు పయనమవుతున్నారు. ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ఉంటుందా లేదా అన్న అనుమానం చాలా మందికి వస్తోంది.

సంక్రాంతి రద్దీకి టీజీఎస్ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సెలవులు ప్రారంభం కావడంతో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. పండుగ రోజుల్లో ప్రయాణ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.
6,431 ప్రత్యేక బస్సులకు గ్రీన్ సిగ్నల్
సంక్రాంతి రద్దీకి తగ్గట్టుగా టీజీఎస్ఆర్టీసీ మొత్తం 6,431 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేసి బస్సులను సిద్ధం చేసింది. తిరుగు ప్రయాణాల కోసం 18, 19 తేదీలకు కూడా ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. అవసరాన్ని బట్టి రూట్లను ఖరారు చేయనున్నారు.
హైదరాబాద్ నుంచి ఏపీ, చెన్నై, బెంగళూరుకు సర్వీసులు
హైదరాబాద్ నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయినపల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకే కాకుండా చెన్నై, బెంగళూరు దిశగా కూడా అదనపు సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్లు, సిబ్బంది అందుబాటులో ఉంటారు.
స్పెషల్ బస్సులకు మాత్రమే అదనపు ఛార్జీలు
ప్రత్యేక బస్సుల నిర్వహణలో భాగంగా సవరించిన ఛార్జీలను వసూలు చేస్తున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది. ఈ అదనపు ఛార్జీలు స్పెషల్ సర్వీసులకు మాత్రమే వర్తిస్తాయి. రెగ్యులర్ బస్సుల్లో మాత్రం సాధారణ టికెట్ ధరలే అమల్లో ఉంటాయి. 9, 10, 12, 13 తేదీలతో పాటు 18, 19 తేదీల్లో మాత్రమే ఈ ఛార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆర్టీసీ స్పష్టత
మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కొనసాగుతుందని టీజీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా నడిచే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ సౌకర్యం యథావిధిగా అమల్లో ఉంటుంది. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కారానికి అదనపు సిబ్బందిని కేటాయించినట్టు ఆర్టీసీ వెల్లడించింది.

