- Home
- Telangana
- మహిళలకు శుభవార్త.. ఉచిత చీరల పంపిణీపై క్లారిటీ వచ్చేసింది. రూ. 1600 విలువ చేసే చీరలు
మహిళలకు శుభవార్త.. ఉచిత చీరల పంపిణీపై క్లారిటీ వచ్చేసింది. రూ. 1600 విలువ చేసే చీరలు
Telangana: తెలంగాణలో మహిళలకు చీరల పంపిణీ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ సందర్భంగా ఉచితంగా చీరలను పంపిణీ చేయగా.. ఇప్పుడు కాంగ్రెస్ మహిళా శక్తి పేరుతో పథకాన్ని తీసుకొస్తోంది.

ఇందిరా మహిళా శక్తి పేరుతో పంపిణీ
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని “ఇందిరా మహిళా శక్తి” పేరుతో నిర్వహిస్తోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఇవ్వాల్సిన ఈ చీరలు, తయారీ ఆలస్యం కారణంగా అప్పుడు పంపిణీ కాలేదు. ఇప్పుడు, ఆ కానుకను మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి రోజు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
నవంబర్ 15లోపు తయారీ పూర్తి
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చీరల తయారీ తుది దశలో ఉంది. సర్కార్ నిర్ణయం ప్రకారం, నవంబర్ 15 లోపు అన్ని చీరలు తయారవ్వాలి. తర్వాత అవి గోదాములకు తరలించి, జిల్లాల వారీగా పంపిణీ చేయనున్నారు. బతుకమ్మ పండుగలో సాధ్యంకాని పంపిణీని ఈసారి సక్రమంగా చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది
1.94 లక్షల మహిళలకు లాభం
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 18,848 స్వయం సహాయక బృందాలు (SHGs) పనిచేస్తున్నాయి. వీటిలో సుమారు 1.94 లక్షల మహిళా సభ్యులు ఉన్నారు. ప్రతి సభ్యురాలికి రెండు చీరల చొప్పున ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో చీర ధర రూ. 800గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే రెండు చీరలు ఇస్తారా, లేదా ఒక చీర ఇస్తారా.? అన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు.
సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో పంపిణీ
గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీని సెర్ప్ (SERP) ద్వారా, పట్టణ ప్రాంతాల్లో మెప్మా (MEPMA) ద్వారా నిర్వహించనున్నారు. ఈ రెండు సంస్థలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని పారదర్శకంగా జరపాలని అధికారులు సూచించారు.
నాణ్యతపై కఠిన నియంత్రణ
చీరల నాణ్యతపై ఎటువంటి ఆరోపణలు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. చీరలను సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో ఉన్న మగ్గాల ద్వారా నేసిస్తున్నారు. ప్రతి చీరను నాణ్యత తనిఖీ తర్వాతే పంపిణీకి సిద్ధం చేస్తున్నారు.