IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
IMD Cold Wave Alert : తెలంగాణలో గడ్డకట్టే స్థాయిలో చలిగాలులు వీస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే 5°C కు టెంపరేచర్స్ పడిపోయే ప్రమాదం ఉందట... దీంతో రెడ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ.

తెలంగాణలో చలిగాలుల ప్రమాదం
Telangana Weather : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు సాధారణంగా ఉండటంలేదు. ఒక్కోసారి కుండపోత వానలు, మరోసారి విపరీతమైన ఎండలు, ఇప్పుడు కాశ్మీర్ స్థాయిలో గజగజ వణికించే చలి. ప్రస్తుతం అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులేవీ లేవు... వానలు కురిసే అవకాశం లేదనుకుంటున్న సమయంలో పొగమంచు ప్రారంభమయ్యింది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయి రాత్రి, తెల్లవారుజామున ఇంట్లోంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
ఈ ఐద్రోజులు గడ్డకట్టే చలి
ప్రస్తుతమున్న చలి చాలదన్నట్లు రాబోయే నాలుగైదు రోజులు తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని... చలి తీవ్రత తారాస్థాయికి చేరుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రెడ్ అలర్ట్ జారీచేసే స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయంటే చలి తీవ్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఏకంగా 5 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయి గడ్డకట్టే చలి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ జిల్లాల ప్రజలు బిఅలర్ట్
తెలంగాణలో ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతోంది. ఈ ఐదురోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. ఈ జల్లాలకు ఆరెంజ్ అలర్ట్... మిగతా తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
నేటి నుండి చలి పంజా
ఇవాళ్టి (డిసెంబర్ 6, శనివారం) నుండి తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుందని... నాలుగైదు రోజులు క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో డిసెంబర్ 6 నుండి 10 వరకు అత్యల్పంగా 5 నుండి 10 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు... కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 8 వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మిగతా తెలంగాణ జిల్లాల్లో 10 నుండి 15 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించింది.
హైదరాబాద్ లో కూడా గజగజా వణుకుడే...
హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతాయని.. చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆకాశం పాక్షికంగా మేఘాలతో నిండివుంటుందని... ఉదయం, రాత్రి సమయాల్లో పొగమంచు కురుస్తూ విపరీతమైన చలి ఉంటుందని తెలిపింది. ఉదయం 8 నుండి 9 గంటల వరకు చలి ఉంటుందని... తిరిగి సాయంత్రం 6 గంటల నుండే మళ్లీ చలి మొదలవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని.. చలికి తట్టుకునే దుస్తులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

