- Home
- Telangana
- సిద్ధిపేటలో కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్.. ప్రతీ కుటుంబానికి రూ. 5 లక్షలు
సిద్ధిపేటలో కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్.. ప్రతీ కుటుంబానికి రూ. 5 లక్షలు
Telangana: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

గురువారం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం (నవంబర్ 19) సిద్దిపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా రూ.5 లక్షల బీమా పరిహారం అందించనున్నారు. ఈ బీమా కోసం లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే బీమా సంస్థలకు ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుంది.
పథకానికి ఎవరు అర్హులు.. వయోపరిమితి ఎంత?
ఈ పథకంలో చేరేందుకు ప్రభుత్వం నిర్దిష్ట వయోపరిమితిని నిర్ణయించింది. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులుగా పేర్కొంది. అంటే 1967 నవంబర్ 19 నుంచి 2008 నవంబర్ 18 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సంపాదిస్తున్నట్లయితే వారిలో ఎవరికి బీమా వర్తింపజేయాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చు. అయితే ఒక కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. బీమా కవరేజీ ప్రారంభమైన తర్వాత గరిష్ట వయోపరిమితికి చేరువయ్యే వారి విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది.
రేషన్ కార్డు లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు
ఈ పథకంలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. రేషన్ కార్డు తప్పనిసరి కాదు. రేషన్ కార్డు ఉన్నవారి కుటుంబ వివరాలను అందులోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నమోదు చేస్తారు. కార్డు లేని వారు కూడా ప్రత్యేక దరఖాస్తు ఫారం ద్వారా తమ వివరాలను అందించవచ్చు. ఆధార్ వివరాలతో పాటు కుటుంబ సభ్యుల సమాచారం సమర్పించాల్సి ఉంటుంది. బీమా ప్రయోజనం పొందేందుకు నామినీ వివరాలు నమోదు చేయడం తప్పనిసరి. ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా పేర్కొనాలనుకుంటే వారికి ఎంత శాతం పరిహారం అందాలనే విషయాన్ని కూడా దరఖాస్తులో స్పష్టంగా తెలియజేయాలి.
డిసెంబర్ 18 వరకు ప్రత్యేక దరఖాస్తు శిబిరాలు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో ప్రజల నమోదు కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, వార్డు కార్యాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. అర్హులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు (ఉంటే) తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కుటుంబ వివరాలను సేకరించనున్నారు. ఇతర జిల్లాల్లో నివసిస్తున్న వారు కూడా తమకు సమీపంలోని నమోదు కేంద్రంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
యాప్, వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకునే అవకాశం
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వీటి ద్వారా అర్హులైన కుటుంబాలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే యాప్, వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుతం గీత కార్మికులు, నేత కార్మికులు, మత్స్యకారులకు అమలవుతున్న రూ.2 లక్షల జీవిత బీమా ప్రయోజనాన్ని కూడా రూ.5 లక్షలకు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నెల రోజుల పాటు జరిగే ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని అర్హులైన కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.














