- Home
- Business
- Bank Strike: కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. బ్యాంకుల సమ్మె వాయిదా.. అక్టోబర్ 2న కొత్త తలనొప్పి
Bank Strike: కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. బ్యాంకుల సమ్మె వాయిదా.. అక్టోబర్ 2న కొత్త తలనొప్పి
Bank Strike Called Off : దేశంలో 3 రోజుల బ్యాంకుల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఐదు రోజుల పని దినాలపై ఐబీఏ హామీ ఇవ్వడంతో యూనియన్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

బిగ్ బ్రేకింగ్.. క్యాన్సిల్ అయిన బ్యాంకుల సమ్మె
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయేమోనని కంగారుపడ్డ సామాన్య ప్రజలకు, వ్యాపారులకు అదిరిపోయే తీపి కబురు అందింది. ఈ నెల 28 నుంచి 30 వరకు మూడ్రోజుల పాటు తలపెట్టిన దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెను చివరి నిమిషంలో యూనియన్లు వాయిదా వేశాయి. మరోవైపు, అక్టోబర్ 2న రిటైలర్లు 'నో యూపీఐ డే'కి పిలుపునివ్వడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
రాత్రి వేళ కుదిరిన అంగీకారం
సోమవారం నుంచి బ్యాంకులు బంద్ అవుతాయన్న వార్తలతో ఆదివారం అంతా ఒకటే ఉత్కంఠ నెలకొంది. అయితే ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రతినిధుల మధ్య జరిగిన అత్యవసర చర్చలు సఫలమయ్యాయి. ఐబీఏ నుంచి సానుకూల హామీ లభించడంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు యూఎఫ్బీయూ అధికారికంగా ప్రకటించింది. దీంతో సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి.
‘ఫైవ్ డే వర్కింగ్’ పై కీలక కమిటీ
బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న వారానికి ఐదు రోజుల పనిదినాల అంశంపై ఐబీఏ ముందడుగు వేసింది. ప్రస్తుతం నెలలో రెండు, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే మిగిలిన శనివారాలను కూడా సెలవులుగా ప్రకటించాలని యూనియన్లు పట్టుబడుతున్నాయి. దీనిపై క్షేత్రస్థాయిలో ఉన్న సాధ్యాసాధ్యాలను, ఖాతాదారులకు కలిగే వెసులుబాటును పరిశీలించేందుకు ఐబీఏ, యూఎఫ్‌బీయూ ప్రతినిధులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది.
పెండింగ్ డిమాండ్లపై సానుకూల స్పందన
కేవలం పనిదినాల సంఖ్యే కాకుండా, స్కేల్-4, ఆపై స్థాయి అధికారులకు ఇచ్చే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకంలో కొన్ని కీలక మార్పులు చేయడానికి ఐబీఏ ఒప్పుకుంది. ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం, 2024 మార్చి ఒప్పందంలోని పెండింగ్ అంశాల పరిష్కారానికి ప్రభుత్వం వద్దకు ఉమ్మడి ప్రతిపాదనలు తీసుకెళ్లేందుకు ఇరువర్గాలు ఒకే బాటలో నడవాలని నిర్ణయించాయి.
అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే’ నిరసన
ఇదిలా ఉంటే, డిజిటల్ లావాదేవీలకు సంబంధించి మరో కొత్త నిరసన తెరపైకి వచ్చింది. రూ.2,000కు మించిన మర్చంట్ యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండిఆర్ (MDR) ఛార్జీలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ 'ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్' (AIMRA) అక్టోబర్ 2న 'నో యూపీఐ డే' నిర్వహించనుంది. ఆ రోజున మొబైల్ దుకాణాల్లోని క్యూఆర్ కోడ్‌లపై నల్లటి వస్త్రం కప్పి తమ నిరసన వ్యక్తం చేయనున్నారు. ఈ ఛార్జీల వల్ల చిన్న వ్యాపారులపై నెలకు రూ.2,000 నుంచి రూ.12,000 వరకు భారం పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.
సీఏఐటీ స్పష్టత.. ఖాతాదారులకు ఊరట
అక్టోబర్ 2 నాటి యూపీఐ నిరసన కార్యక్రమానికి తమకు ఎలాంటి సంబంధం లేదని అఖిల భారత వర్తక సమాఖ్య (CAIT) స్పష్టం చేసింది. అయితే, బ్యాంకుల సమ్మె వాయిదా పడటం వల్ల ఈ నెల ఆఖరులో జరిగే అర్థసంవత్సర ముగింపు (హ్యాఫ్ ఇయర్లీ క్లోజింగ్) ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకపోవడం డిపాజిటర్లకు, వ్యాపారులకు పెద్ద ఉపశమనంగా మారింది.

