- Home
- Telangana
- Telangana: బుల్లెట్ ట్రైన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ధరణిపై సిట్ దర్యాప్తు
Telangana: బుల్లెట్ ట్రైన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ధరణిపై సిట్ దర్యాప్తు
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని సచివాలయంలో శుక్రవారం జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, గ్రామీణ పాలన, విద్య, భూ వ్యవహారాలు, మౌలిక వసతులకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.

ధరణి వ్యవహారంపై సిట్, ఫోరెన్సిక్ ఆడిట్‌కు గ్రీన్ సిగ్నల్
ధరణి పోర్టల్‌కు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు, వివాదాస్పద భూ లావాదేవీలు, అక్రమ రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ధరణి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రక్రియలను పరిశీలించేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించనున్నారు. భూముల బదిలీలు, రికార్డుల మార్పులు, అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యుల పాత్రను గుర్తించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి
గ్రామాల అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018లో కీలక సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయం ప్రభుత్వ ట్రెజరీ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇకపై ఆ నిధులను నేరుగా గ్రామ పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చట్టాన్ని సవరించనున్నారు. దీంతో అత్యవసర అభివృద్ధి పనుల కోసం నిధులు త్వరగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ మార్పును అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం త్వరలో ఆర్డినెన్స్ జారీ చేయనుంది.
విద్య, గృహ నిర్మాణానికి కేబినెట్ ప్రాధాన్యం
జగిత్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచేందుకు అవసరమైన కొత్త పోస్టుల భర్తీకి మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. దీంతో విద్యార్థులకు మెరుగైన బోధన అందే అవకాశం ఉంది. అదే సమయంలో పఠాన్‌చెరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు అవసరమైన భూమి కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అదనంగా విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే ప్రక్రియకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బుల్లెట్ ట్రైన్, పాలమూరు ప్రాజెక్టుపై కీలక నిర్ణయాలు
రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌లో మార్పులకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, సాంకేతిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించిన పెరిగిన అంచనా వ్యయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సంగారెడ్డి జిల్లాలో భూముల కేటాయింపునకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల అమలుకు మరింత వేగం తీసుకురానున్నాయి.

