- Home
- Telangana
- Telangana Bandh : వచ్చే సోమ, మంగళవారం స్కూళ్లు, కాలేజీలు నడవడం కష్టమే.. ఈ నాల్రోజులు సెలవులేనా?
Telangana Bandh : వచ్చే సోమ, మంగళవారం స్కూళ్లు, కాలేజీలు నడవడం కష్టమే.. ఈ నాల్రోజులు సెలవులేనా?
Telangana Bandh : తెలంగాణలో మరోసారి విద్యాసంస్ధలకు వరుస సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల వివాదం కారణంగా ఇవాళ్టి నుండి నాల్రోజులు విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలాలేవు.

సోమ, మంగళవారం స్కూళ్లు నడవడం డౌటే...
Telangana Bandh : తెలంగాణలో ఈ నాల్రోజులు స్కూళ్లు, కాలేజీలు నడిచే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నారు. ఈ రెండ్రోజులు (రెండో శని, ఆదివారం) ఎలాగూ సెలవులే... అయితే రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సోమ, మంగళవారం (అక్టోబర్ 13,14) కూడా విద్యాసంస్థల కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మంగళవారం తెలంగాణ బంద్ కు బిసి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో సెలవు ఉండే అవకాశాలున్నాయి... కొన్ని విద్యాసంస్థలు నడిచినా బంద్ కారణంగా విద్యార్థుల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ఇబ్బందులు తలెత్తవచ్చు.
ఎందుకు తెలంగాణ బంద్?
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన బిసి రిజర్వేషన్లను పెంచేందుకు సిద్దమయ్యింది. ఇందులో భాగంగా స్థానికసంస్థల ఎన్నికల్లో బిసిలకు ఏకంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించింది... దీంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటిపోవడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యాక ఈ రిజిర్వేషన్ జీవో9 పై రాష్ట్ర హైకోర్ట్ స్టే విధించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ఆగిపోయాయి.
ఇలా బిసిలకు రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు స్టే, ప్రభుత్వ తీరుపై బిసి సంఘాలు నిరసనకు సిద్దమయ్యాయి. న్యాయస్థానం బిసిలకు అన్యాయం చేసేలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని... ప్రభుత్వం కూడా బిసిల తరపున గట్టిగా పోరాడలేకపోయిందని బిసి నాయకులు అంటున్నారు. అందుకే తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ తరహాలో భారీ ఉద్యమాన్ని చేపట్టనున్నామని... ఇందుకోసం కార్యాచరణ రూపొందించామని బిసి నేత ఆర్.కృష్ణయ్య తెలిపారు.
అక్టోబర్ 14న తెలంగాణ వ్యాప్తంగా బంద్ చేపట్టనున్నట్లు కృష్ణయ్య ప్రకటించారు. అలాగే అక్టోబర్ 13న అంటే ఈ సోమవారం ఎక్కడిక్కడ జాతీయ రహదారులను నిర్భంధించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు విద్యాసంస్థలు, వ్యాపారులు, ప్రజలు సహకరించాలని... తమ హక్కులను కాపాడుకునేందుకు చేపట్టిన ఈ నిరసనల్లో బిసిలు పెద్దఎత్తున పాల్గొనాలని కృష్ణయ్య కోరారు.
తెలంగాణ బంద్ కు ప్రతిపక్ష బిఆర్ఎస్ మద్దతు?
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా, బిసి రిజర్వేషన్ల వివాదంపై ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ కూడా సీరియస్ గా ఉంది. ఈ విషయంలో బిసి సంఘాలతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ బషీర్ బాగ్ లో నిర్వహించిన 22 బిసి సంఘాల సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, మధుసూదనాచారి కూడా పాల్గొన్నారు. బిసి నేత ఆర్.కృష్ణయ్యతో కలిసి మీడియా సమావేశంలో కూడా వీరు పాల్గొన్నారు. దీంతో తెలంగాణ బంద్ కు మద్దతిస్తున్నట్లు బిఆర్ఎస్ చెప్పకనే చెప్పింది.
ఇలా బిసి సంఘాలు, రాజకీయ పార్టీ నిరసనలు, బంద్ కు మద్దతిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో అక్టోబర్ 13, 14 తేదీ విద్యాసంస్థల నిర్వహణకు ఆటంకం కలిగే అవకాశాలుంటాయి. రహదారుల దిగ్బంధం, నిరసనలతో విద్యార్థుల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది... ఇక బంద్ రోజు విద్యాసంస్థలు ఓపెన్ చేసినా నాయకులు మూసివేయించే అవకాశాలుంటాయి. ఇలా వచ్చే సోమ, మంగళవారం స్కూళ్లు, కాలేజీలు నడవడం కష్టమే... కొన్ని విద్యాసంస్ధలు విద్యార్థులకు సెలవులు ఇచ్చే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే వరుసగా నాల్రోజులు సెలవులు కలిసివస్తాయి (రెండో శని, ఆది, సోమ, మంగళవారం).
టిఆర్పి తెలంగాణ బంద్
తెలంగాణ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బిసి నినాదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే... ఈ పార్టీ కూడా ఇప్పటికే తెలంగాణ బంద్ చేపట్టింది. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బిసిలకు అన్యాయం జరిగేలా ఉందంటూ హైకోర్టు తీర్పు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిన్న శుక్రవారం (అక్టోబర్ 10న) ఎమ్మెల్సీ మల్లన్న బంద్ కు పిలుపునిచ్చారు. అయితే బంద్ ప్రభావం రాష్ట్రంలో పెద్దగా కనిపించలేదు.
రేవంత్ సర్కార్ ఏం చేయబోతోంది?
తెలంగాణ హైకోర్ట్ రిజర్వేషన్ జీవోపై స్టే విధించడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయాయి. దీంతో ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడంలేదు... అయితే హైకోర్ట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఏమైనా వెళతుందా? అన్నది తేలాల్సిఉంది.
స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే పూర్తిచేయాలని భావిస్తున్న ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రస్తుతం హైకోర్టు తీర్పును స్టడీ చేస్తున్న సీనియర్ కౌన్సిల్స్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు రాజకీయ వర్గాల నుండి సమాచారం అందుతోంది.