- Home
- Telangana
- Telangana : తెలంగాణలో 119 కాదు 153 అసెంబ్లీలు... ఎక్కడ, ఎన్ని నియోజకవర్గాలు పెరగనున్నాయో తెలుసా?
Telangana : తెలంగాణలో 119 కాదు 153 అసెంబ్లీలు... ఎక్కడ, ఎన్ని నియోజకవర్గాలు పెరగనున్నాయో తెలుసా?
దేశవ్యాప్తంగా త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఎన్ని నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నాయో తెలుసా?

తెలంగాణలో ఎన్ని నియోజకవర్గాలు పెరగనున్నాయి?
Constancies delimitation in Telangana : తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఖాయమేనా? ఈ దిశగా కేంద్రం అడుగులు వేస్తుందా? రాష్ట్రంలో ప్రస్తుతం 119 మంది ఎమ్మెల్యేలుంటే భవిష్యత్ లో ఈ సంఖ్య 153 కు పెరుగుతుందా? భవిష్యత్ లో ఏ జిల్లాలో ఎన్ని అసెంబ్లీలుంటాయి.. ఇందులో కొత్తగా ఏర్పడేవి ఎన్ని? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గాల పునర్విభజనపై తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో మరోసారి రాజకీయ నాయకుల నుండి సామాన్య ప్రజల వరకు దీనిపై చర్చ మరింత జోరందుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే...
హైదరాబాద్ లో ఇటీవలే మరో ప్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దివంగత నేత పిజెఆర్ (పి జనార్ధన్ రెడ్డి) పేరుతో నగరంలోని ప్రధాన ప్రాంతం కొండాపూర్ ను ఓఆర్ఆర్ తో కలుపుతూ 1.2 కిలో మీటర్ల ప్లైఓవర్ ను నిర్మించారు… దీన్ని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే సిఎం రేవంత్ నియోజకవర్గాల పునర్విభజన గురించి ప్రస్తావించారు.
త్వరలో ప్రస్తుతమున్న అసెంబ్లీలతో పాటు కొత్తగా మరికొన్ని నియోజకవర్గాలు ఏర్పడతాయని... 2029లో ఈ అసెంబ్లీలు అన్నింటికి ఎన్నికలు జరుగుతాయనేలా రేవంత్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లోకి కీలక ప్రాంతం శేరిలిగంపల్లి నాలుగైదు నియోజకవర్గాలుగా విభజించబడుతుందని... ఇక్కడి నుండి మరింతమంది ఎమ్మెల్యేలు, నాయకులు వస్తారని అన్నారు.
సీఎం రేవంత్ శేరిలింగంపల్లి అసెంబ్లీ పునర్విభజన గురించి చేసిన కామెంట్స్ రాజకీయ చర్చకు దారితీసాయి. శేరిలింగంపల్లి ఒక్కటే నాలుగు నియోజకవర్గాలుగా మారితే మరి తమ నియోజకవర్గాలు ఎలా మారనున్నాయో అని ఎమ్మెల్యేలే కాదు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అధికారులను ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో కూడా దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
నియోజకవర్గాల పునర్విభజన ఎలా చేపడతారు?
నియోజకవర్గాల పునర్విభజన ప్రదానంగా జనాభా ఆధారంగా జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లోని సగటు జనాభాను బట్టి నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులు నిర్ణయిస్తాయి. ఈక్రమంలో కొన్నిచోట్ల కేవలం నియోజకవర్గాల సరిహద్దులే మారతాయి... మరికొన్నిచోట్ల మాత్రం కొత్త నియోజకవర్గాలు పుట్టుకువస్తాయి. అంటే 2026 లో జరిగే జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాలను విభజించపన్నారన్నమాట.
ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారం సగటున 2 లక్షలకు పైగా జనాభా కలిగిన ప్రాంతాన్ని ఓ అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటుచేశారు. ఈ పదిహేనేళ్లలో జనాభా భారీగా పెరిగింది... ఎంత పెరిగిందో 2026 లో చేపట్టే జనగణనలో తేలుతుంది... దీని ఆధారంగా డీలిమిటేషన్ కమీషన్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది.
జిహెచ్ఎంసి పరిధిలోనే అత్యధిక నియోజకవర్గాలు.. ఎన్నో తెలుసా?
ఉమ్మడి జిల్లాల వారిగా చూసుకుంటే ప్రస్తుతం అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోనే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పెరిగిన జనాభా ప్రాతిపదికన చూసుకున్నా ఈ జిల్లాలోనే అత్యధికంగా అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశాలున్నాయి. అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 10-11 కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాలు కనిస్తున్నాయి.
విద్యా, ఉద్యోగ, ఉపాధితో పాటు వివిధ కారణాలతో హైదరాబాద్ నగరానికి రోజురోజుకు వలసలు పెరిగిపోతున్నాయి... పల్లెలు ఖాళీ అవుతూ పట్టణాలు పెరిగిపోతున్నాయి. ఇలా ఇటీవల కాలంలో హైదరాబాద్ బాగా విస్తరించింది... జనాభా బాగా పెరిగింది. ఒక్క శేరిలింగంపల్లిలోనే కొత్తగా నాలుగు నియోజకవర్గాలు ఏర్పడతాయని సీఎం చెప్పారంటే ఏ స్థాయిలో నగర జనాభా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
ఓల్డ్ హైదరాబాద్ కంటే కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, రాచకొండ ప్రాంతాల్లోనే నియోజకవర్గాల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశాలున్నాయి. అటు మేడ్చల్, మల్కాజ్ గిరి , ఉప్పల్, రాజేంద్రనగర్, మహేశ్వరం... ఇటు శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, పటాన్ చెరు, కుత్బుల్లాపూర్ వంటి నియోజకవర్గాల నుండి మరికొన్ని అసెంబ్లీలు పుట్టుకురానున్నాయి. మొత్తంగా కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం (15+14) 29 అసెంబ్లీలుంటే పునర్విభజన తర్వాత అ సంఖ్య (17+23) 40కి చేరుకునే అవకాశాలున్నాయి.
ఏ జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాలు పెరగొచ్చు?
2027 లో నియోజకవర్గాలు పునర్విభన తర్వాత తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 119 నుండి 153 కి పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే మొత్తంగా రాష్ట్రంలో 34 నియోజకవర్గాలు పెరగనున్నాయి... ఇంతమంది కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం దక్కనుంది.
ఉమ్మడి జిల్లాలవారిగా చూసుకుంటే హైదరాబాద్ లో అత్యధికంగా 15 సీట్లు ఉన్నాయి.. కానీ ఇక్కడ కేవలం మరో 2 సీట్లు మాత్రమే పెరిగి మొత్తం అసెంబ్లీల సంఖ్య 17 కు చేరుకునే అవకాశాలున్నాయి. కానీ ఇదే హైదరాబాద్ కు ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 14 నియోజకవర్గాలుంటే భవిష్యత్ లో ఇవి 23 కు చేరుకోవచ్చని అంటున్నారు. ఈ జిల్లాల్లో 9 అసెంబ్లీలు పెరగవచ్చు... కేవలం శేరిలింగంపల్లి ఒక్కటే నాలుగు నియోజకవర్గాలుగా మారబోతోందని సీఎం చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం.
ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ లో ప్రస్తుతం 14 అసెంబ్లీలుంటే మరో 4 పెరిగి 18 చేరుకుంటాయి. కరీంనగర్ లో 13 నుండి 17 కు అంటే నాలుగు అసెంబ్లీలు, వరంగల్ లో 12 నుండి 15 కు అంటే 3 అసెంబ్లీలు, నల్గొండలో 12 నుండి 15కు అంటే 3 నియోజకవర్గాలు, మెదక్ లో 10 నుండి 13కు అంటే 3 నియోజకవర్గాలు పెరగనున్నాయి. అలాగే ఖమ్మంలో 10 నుండి 12 కు అంటే 2 అసెంబ్లీలు, ఆదిలాబాద్ లో 10 నుండి 12 కు అంటే 2 అసెంబ్లీలు, నిజామాబాద్ లో 9 నుండి 11 అంటే 2 అసెంబ్లీల చొప్పున పెరిగే అవకశాలున్నాయి.