Rain: ఉరుములు, పిడుగుల వేళ.. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా.? చాలా డేంజర్
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఎండ కాలం ఇలా ముగిసిందో లేదో అలా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇదే తరుణంలో పిడుగు పాటికి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

పిడుగులతో జాగ్రత్త
నైరుతి రుతుపవనాల ప్రారంభంతో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిడుగుపాట్ల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఆదిలాబాద్‌లో 6 మంది ప్రాణాలు కోల్పోగా, గతేడాది రాజన్న సిరిసిల్లలో ఇద్దరు రైతులు మరణించారు. ఈ నేపథ్యంలో ప్రజలు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆరుబయట ఉండేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో బయట పనులకు దూరంగా ఉండాలి. చేపలు పట్టడం, పశువులను మేపడం వంటి పనులు ఆపాలి. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలకు దూరంగా ఉండాలి. చెరువులు, నీటి కుంటలు, తడిచిన మైదానాల నుంచి దూరంగా ఉండటం ఉత్తమం. ఎత్తైన నిర్మాణాల వద్ద నుంచి దూరంగా ఉండాలి. పిడుగులు ఎక్కువగా ఎత్తైన ప్రదేశాలపై పడతాయి. టవర్లు, విద్యుత్ స్తంభాలు, ఎత్తయిన చెట్లు వంటి వాటి వద్దకి వెళ్లకూడదు.
విద్యుత్ పరికరాలు వాడకూడదు
విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల సమయంలో విద్యుత్ పరికరాల వాడకం ప్రమాదకరం. కంప్యూటర్, ల్యాప్‌టాప్, రెంట్ స్టవ్ వంటి పరికరాలను వాడకూడదు. విద్యుత్ నియంత్రికలు, స్విచ్ బోర్డ్ల దగ్గర ఉండరాదు.
ఫోన్ చార్జింగ్ పెట్టి వాడకూడదు. పిడుగుల సమయంలో భూమిపై కూర్చోవడం మంచిది. ఆ సమయంలో బయట ఉంటే నెమ్మదిగా భూమిపై కూర్చోవాలి. భారీ శబ్ధాల నుంచి తట్టుకోవడానికి చెవులు మూసుకోవాలి.
రైతులు అప్రమత్తంగా ఉండాలి
రైతులు, గ్రామీణ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. వర్షాల సమయంలో రైతులు పొలాల్లో పనులకు దూరంగా ఉండాలి. కరెంట్ మోటార్ల వద్దకు వెళ్లకూడదు. మొబైల్ ఫోన్లను వాడకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

