Rice Prices: బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? మరింత పెరుగుతాయా?
Rice Prices Surge: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బియ్యం రేట్లు గడిచిన కొన్ని నెలల్లోనే 15% నుండి 25% వరకు పెరగడంతో మధ్యతరగతి, పేద వర్గాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. ఎందుకు బియ్యం ధరలు పెరుగుతున్నాయి?

ప్రజలకు బియ్యం షాక్.. కిలో రేటు ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాకే!
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బియ్యం ధరలు తీవ్ర షాక్ ఇస్తున్నాయి. గత కొన్ని నెలలుగా మార్కెట్‌లో అన్ని రకాల బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. సన్న రకాల నుంచి సాధారణ రకాల వరకు రిటైల్ విక్రయాల్లో దాదాపు 15% నుండి 25% వరకు ధరల పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన పట్టణాల్లో వినియోగదారులు బియ్యం కొనుగోలు చేయాలంటే జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మార్కెట్‌లో ప్రస్తుత బియ్యం, ధాన్యం ధరలు ఎలా ఉన్నాయి?
ప్రస్తుతం హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో బియ్యం రకం, క్వాలిటీ, ప్రాసెసింగ్ విధానాన్ని (రా లేదా స్టీమ్) బట్టి ధరలు వేర్వేరుగా ఉన్నాయి. పౌల్ట్రీ, పారిశ్రామిక రంగానికి డిమాండ్ పెరగడంతో నూకల ధరలు కూడా కిలో రూ. 20 నుంచి రూ. 28 - 30కి చేరుకున్నాయి. మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న సోనా మసూరి, బీపీటీ 5204, హెచ్ఎంటీ వంటి సన్న బియ్యం రకాల రిటైల్ ధరలు కిలోకు ₹65 నుండి ₹83 వరకు పలుకుతుండగా, క్వింటాలుకు ₹6,500 నుండి ₹8,300 వరకు వ్యాపారం జరుగుతోంది.
ప్రతిరోజూ వాడే సాధారణ లేదా మీడియం రకం బియ్యం కిలోకు ₹10 నుండి ₹12 వరకు పెరిగి, ప్రస్తుతం ₹50 నుండి ₹62 మధ్య విక్రయమవుతున్నాయి. క్వింటాలుకు ₹5,000 నుండి ₹6,200 వరకు ఉన్నాయి. మరోవైపు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసే మండీ ప్యాడీ లేదా అన్-మిల్డ్ ధాన్యం ధరలు కిలోకు ₹24 నుండి ₹34 (క్వింటాలుకు ₹2,350 నుండి ₹3,389) వరకు ఉన్నాయి. అలాగే పౌల్ట్రీ, పారిశ్రామిక రంగా నుంచి డిమాండ్ పెరగడంతో గతంలో కిలో రూ. 20 వరకు ఉన్న నూకల ధరలు కూడా ఇప్పుడు పెరిగాయి.
సాగు విస్తీర్ణం తగ్గడం, ఎల్ నినో ప్రభావం
వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడమే బియ్యం ధరల పెంపునకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అనిశ్చిత వర్షపాతం, ఎల్ నినో పరిస్థితుల వల్ల తెలంగాణలో గతంలో 92 లక్షల ఎకరాలుగా ఉన్న వరి సాగు విస్తీర్ణం ఈ సీజన్‌లో దాదాపు 78 లక్షల ఎకరాలకు పడిపోయింది. దీనివల్ల ప్రజలు ఎక్కువగా ఉపయోగించే సోనా మసూరి, హెచ్ఎంటీ వంటి ఫైన్ రైస్ దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది.
పక్క రాష్ట్రాల కొనుగోళ్లు, ఎగుమతుల ఒత్తిడి
తెలుగు రాష్ట్రాల్లో లభించే ధాన్యానికి ఇతర రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం వంటి సరిహద్దు జిల్లాల్లోని రైతుల వద్దకు నేరుగా వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. బెంగళూరు, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాలకు ఈ బియ్యాన్ని తరలిస్తుండటంతో స్థానిక తెలుగు మార్కెట్లలో సరుకు కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి.
ప్రభుత్వ కొనుగోళ్లు, బియ్యం మిల్లుల కొత్త నిబంధనలు
ప్రభుత్వ వర్గాలు ఎఫ్‌సిఐ అలాగే పౌర సరఫరాల సంస్థ ద్వారా బఫర్ స్టాక్ కోసం పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ చేస్తున్నాయి. దీనివల్ల ప్రైవేట్ మిల్లర్లు, సాధారణ వ్యాపారులకు లభించే ఓపెన్ మార్కెట్ స్టాక్ తగ్గిపోయింది. మరోవైపు రైస్ మిల్లర్లు పాత అప్పుల పద్ధతిని పక్కనబెట్టి, క్యాష్ అండ్ క్యారీ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో వ్యాపారులు తమ వర్కింగ్ క్యాపిటల్ భారాన్ని నేరుగా వినియోగదారులపైనే వేస్తున్నారు.
గ్లోబల్ బెంచ్‌మార్క్‌లు, భవిష్యత్ మార్కెట్ అంచనా
అంతర్జాతీయ మార్కెట్‌లో ఆసియన్ ఎగుమతి బెంచ్‌మార్క్‌లు (థాయ్, ఇండియన్ 5% బ్రోకెన్ రైస్) బలంగా ఉండటంతో దేశీయంగా కూడా బియ్యం కనీస ధర పెరుగుతోంది. రాబోయే 1-2 నెలల్లో కొత్త పంట మార్కెట్ యార్డులకు పూర్తిస్థాయిలో వచ్చే వరకు బియ్యం ధరలు ఇదే అధిక స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. భవిష్యత్తు ధరల అంచనాలు చూస్తే.. కొత్త ఖరీఫ్ పంట రాకతో పాటు ప్రభుత్వం ఇచ్చే నిల్వల పరిమితి ఆదేశాలు, మార్కెట్ జోక్యం నిర్ణయాలపైనే ధరలు తగ్గుతాయా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.

