Andhra's Goa: గోవా దాకా ఎందుకు? మన దగ్గరే 'ఆంధ్రా గోవా'.. ఫుల్ డిటైల్స్ ఇవే
Andhra's Goa: బంగాళాఖాతం ఒడ్డున ఉన్న చీరాల బీచ్‌ను ఆంధ్రా గోవా అని పిలుస్తారు. ఇక్కడ విశాలమైన బంగారు ఇసుక, ప్రశాంత వాతావరణం, తక్కువ రద్దీ తో అద్భుతంగా ఉంటుంది. ఈ బీచ్‌ల విశేషాలు, వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్స్, సీ ఫుడ్ పూర్తి వివరాలు మీకోసం.

ఆంధ్రా గోవా: వాటర్ స్పోర్ట్స్, ఫ్రెష్ సీ ఫుడ్ టూర్ గైడ్
విశాలమైన సముద్ర తీరం, మెరిసే బంగారు ఇసుక తిన్నెలు, ఒడ్డును తాకే అలల సప్పుడు, ఆహ్లాదపరిచే చల్లని గాలి.. వీటన్నింటినీ ఆస్వాదించడానికి ప్రతిససారి గోవా వరకు వెళ్లాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో ఉన్న చీరాల తీరప్రాంతం (వాడరేవు, రామపురం) ప్రకృతి అందాలకు, ప్రశాంతతకు నిలయంగా మారింది. గోవాను తలపించేలా తీరప్రాంత వైభవం, సందడి, ప్రశాంత వాతావరణం ఉండటంతో పర్యాటకులు దీనిని ముద్దుగా ఆంధ్రా గోవా అని పిలుచుకుంటున్నారు.
ప్రధాన నగరాల రద్దీ, రోజూవారీ పనుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలసి వీకెండ్ ట్రిప్ వేయడానికి ఇది ఒక అద్భుతమైన డెస్టినేషన్. మరి ఈ ఆంధ్రా గోవా చీరాల బీచ్‌లోని ప్రధాన ప్రత్యేకతలు, అక్కడ అందుబాటులో ఉన్న వసతులు, విశేషాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ప్రశాంత వాతావరణం, బంగారు ఇసుక తిన్నెలు
గోవా లేదా ఇతర ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఉండే తీవ్రమైన రద్దీతో పోలిస్తే చీరాల బీచ్ చాలా స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మృదువైన, బంగారు వర్ణంలో మెరిసే ఇసుక తిన్నెలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయ సమయాల్లో ఆకాశం నారింజ, గులాబీ రంగుల్లోకి మారే దృశ్యాలు ఫోటోగ్రఫీకి అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌గా నిలుస్తాయి. ఒడ్డున నిలబడి సముద్రపు గాలిని పీలుస్తూ, అలల చప్పుడు వింటూ నడవడం మనసుకు ఎంతో ప్రశాంతతను, ఆహ్లాదాన్ని అందిస్తుంది.
వాటర్ స్పోర్ట్స్, బీచ్ యాక్టివిటీస్ థ్రిల్
సముద్ర తీరంలో కేవలం నడవడమే కాకుండా, కాస్త సాహసంతో కూడిన వినోదాన్ని కోరుకునే వారి కోసం ఇక్కడ రకరకాల వాటర్ స్పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏటీవీ రైడ్స్, జెట్ స్కీలు, స్పీడ్ బోటింగ్, బనానా బోట్ రైడ్స్, బీచ్ వాలీబాల్ వంటి వినోద కార్యక్రమాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. వీటి ధరలు రూ. 500 నుండి రూ. 800 వరకు అందుబాటులో ఉంటాయి. పారామోటరింగ్ ద్వారా చీరాల తీరాన్ని పైనుంచి చూసే అవకాశం కూడా ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో గుర్రపు స్వారీ, ఒంటె స్వారీలు చేస్తూ బీచ్‌లో సరదాగా గడపవచ్చు.
బీచ్ రిసార్ట్‌లు, క్యాంప్‌ఫైర్ నైట్ లైఫ్
పర్యాటకుల బస కోసం తీరం పొడవునా గోవా శైలిని ప్రతిబింబించేలా అందమైన ప్రైవేట్ రిసార్ట్‌లు, కాటేజీలు అందుబాటులోకి వచ్చాయి. "గోల్డెన్ శాండ్స్ – ది బే రిసార్ట్" వంటి బడ్జెట్ హోటల్స్ నుంచి ప్రీమియం బీచ్ రిసార్ట్స్ వరకు వివిధ రకాల వసతి సదుపాయాలు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. రాత్రి వేళల్లో సముద్ర గాలిని ఆస్వాదిస్తూ ఓపెన్ టాప్ క్యాంప్‌ఫైర్‌లు, మ్యూజిక్ నైట్స్, బీచ్ సైడ్ డిన్నర్‌లతో ప్రైవేట్ రిసార్ట్స్ గోవా తరహా నైట్ లైఫ్ ఫీలింగ్ ఇస్తాయి.
నోరూరించే తాజా సీ ఫుడ్ రుచులు
సముద్ర తీరప్రాంతం కావడంతో చీరాల బీచ్ పరిసరాల్లో లభించే తాజా సీ ఫుడ్ రుచులు ఆహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మత్స్యకారులు రోజువారీ వేట ద్వారా తెచ్చే తాజా చేపలు, రొయ్యలు, పీతలతో స్థానిక ఆంధ్ర మసాలాలు జోడించి చేసే వంటకాలు బీచ్ షాక్స్, రిసార్ట్‌లలో లభిస్తాయి. ముఖ్యంగా చేపల ఫ్రై, రొయ్యల వేపుడు, స్పైసీ పీతల కూర ఇక్కడ నోరూరిస్తాయి.
వాడరేవు, రామపురం బీచ్‌లు.. చేనేత షాపింగ్
చీరాల సమీపంలోని వాడరేవు బీచ్ మత్స్యకారుల జీవన విధానాన్ని, ఉదయాన్నే జరిగే చేపల వేలం దృశ్యాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తుంది. రామాపురం బీచ్ కొబ్బరి చెట్ల వరుసలతో, ప్రశాంతమైన వాతావరణంతో రిలాక్స్ అవ్వడానికి అనువుగా ఉంటుంది. అలాగే చిన్న బొంబాయిగా పేరుగాంచిన చీరాల పట్టణంలో ప్రపంచప్రసిద్ధి చెందిన పట్టు, కాటన్ చీరలు, చేనేత వస్త్రాలను సరసమైన ధరలకే కొనుగోలు చేయవచ్చు.
ఎప్పుడు వెళ్లాలి?
అక్టోబర్ నుండి మార్చి నెలల మధ్య వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో సందర్శించడం బెస్ట్. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నుంచి సులభంగా చేరుకోగల ఈ ఆంధ్రా గోవా తక్కువ బడ్జెట్‌లో కుటుంబంతో విహరించడానికి ఒక బెస్ట్ ఆప్షన్.

