- Home
- Telangana
- కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములను పేదలకు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములను పేదలకు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో భూముల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై విచారణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

ఎర్రవల్లి భూములపై కలెక్టర్‌కు ఆదేశాలు
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ దాదాపు 700 ఎకరాల విస్తీర్ణంలో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. అందులో సుమారు 388 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నట్లు ఆరోపించారు. ఈ భూముల వివరాలు, వాటి హక్కులు, రికార్డులు ఎలా నమోదయ్యాయనే అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఫామ్‌హౌస్ పరిధిలో ప్రభుత్వ భూమి ఉన్నట్లు విచారణలో తేలితే.. ఆ భూమిని పేదలకు ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. ఈ వ్యవహారంపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే రెవెన్యూ రికార్డులు, సర్వే వివరాలు, గతంలో జరిగిన భూ లావాదేవీలను పరిశీలించాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూములపై ప్రస్తావన
అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధించిన భూముల వివరాలను కూడా ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబానికి సిద్దిపేటలో 67.5 ఎకరాలు ఉన్నాయని, కేటీఆర్ కుటుంబానికి 123 ఎకరాలు, హరీశ్‌రావు కుటుంబానికి 30 ఎకరాలు, కల్వకుంట్ల కవిత కుటుంబానికి 37 ఎకరాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జోగినపల్లి సంతోష్‌రావు కుటుంబానికి 79 ఎకరాలు, నవీన్‌రావుకు 52 ఎకరాలు, కొండల్‌రావుకు 48 ఎకరాలు ఉన్నట్లు సభలో వివరించారు. అలాగే కల్వకుంట్ల కుటుంబానికి తొమ్మిది జిల్లాల్లోని 24 మండలాలు, 31 గ్రామాల్లో కలిపి 439 ఎకరాల భూమి ఉన్నట్లు సీఎం తెలిపారు.
కేసీఆర్ దంపతులకు ఒక కుటుంబానికి అనుమతించే భూమి పరిమితికి మించి భూములు ఉన్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ కుటుంబంలోని నలుగురి పేర్లపై కలిపి 123 ఎకరాల భూమి ఉన్నట్లు వివరించారు. కేటీఆర్ పేరుతో 49.5 ఎకరాలు, ఆయన భార్య శైలిమ పేరుతో 17.5 ఎకరాలు, అలేఖ్య పేరుతో 9.38 ఎకరాలు, హిమాన్ష్ పేరుతో 46.3 ఎకరాలు ఉన్నాయని సభలో పేర్కొన్నారు.
ఇతర నేతల భూములపైనా సీఎం ఆరోపణలు
భూముల అంశంలో బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నేతల పేర్లను కూడా సీఎం ప్రస్తావించారు. గంగుల, ఎర్రబెల్లి, సుధీర్‌రెడ్డి తదితరులు కలిపి 650 ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపించారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి 50 ఎకరాల ఫామ్‌హౌస్‌లో 11.5 ఎకరాల ఇనాం భూమి ఎలా వచ్చిందనే ప్రశ్నను రేవంత్‌రెడ్డి లేవనెత్తారు. పైలట్ రోహిత్‌రెడ్డి అజీజ్‌నగర్‌లో అసైన్డ్ భూమిలో ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని కూడా సభలో పేర్కొన్నారు.
కేటీఆర్ జన్వాడ ఫామ్‌హౌస్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. తనపై వచ్చిన విమర్శలకు సీఎం స్పందించారు. ఎన్నికల సమయంలో స్టీఫెన్‌సన్‌కు నజరానా ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు. రూ.50 కోట్ల విలువైన భూమిని రూ.1.53 కోట్లకే రెగ్యులరైజ్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలను అధికారిక రికార్డులు, విచారణ రిపోర్టులు తేల్చాల్సి ఉంటుంది.
ధరణి పార్ట్-2పై త్వరలో చర్యలు
రాష్ట్రంలో ధరణి వ్యవస్థను అడ్డుపెట్టుకుని భారీ స్థాయిలో భూ అక్రమాలు జరిగాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మొత్తం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.లక్ష కోట్ల మేర భూ కుంభకోణం జరిగిందని ఆయన సభలో పేర్కొన్నారు. ధరణిపై ఇప్పటికే వెల్లడించిన అంశాలు మొదటి దశకు సంబంధించినవేనని, త్వరలో మరిన్ని వివరాలతో ‘ధరణి పార్ట్-2’ను ప్రజల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.
టీజీఐఐసీ భూములకు సంబంధించిన అక్రమాలను కూడా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో వెల్లడిస్తామని సీఎం చెప్పారు. 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి వారంలోపు సమగ్ర మార్గదర్శకాలు రూపొందిస్తామని తెలిపారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ పరిధిలోని లేఔట్లకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులతో పాటు కొత్తగా వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలించి నిర్ణీత విధానంలో పరిష్కరిస్తామని చెప్పారు.
ఎల్బీనగర్ బాధితులకు త్వరలో పరిష్కారం
జీవో 118 పరిధిలోని ఎల్బీనగర్ భూముల అంశంపైనా సీఎం రేవంత్‌రెడ్డి సభలో కీలక ప్రకటన చేశారు. ఆ ప్రాంతంలో భూముల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. జీవో 118 కింద ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమస్యతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుమారు 9,500 మంది బాధితులు ఉన్నట్లు సీఎం వెల్లడించారు. ఒకవైపు ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై 30 రోజుల్లో విచారణ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించగా.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 22ఏ భూములు, ధరణి రికార్డులు, లేఅవుట్లు, ప్రభుత్వ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కొత్త విధానాలను తీసుకొచ్చే దిశగా చర్యలు ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

