- Home
- Telangana
- తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్!
తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్!
Heavy Rain Forecast in Telangana : తెలంగాణలో అల్పపీడన ప్రభావం కొనసాగుతుంది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.

తెలంగాణ అతలాకులం
తెలంగాణలో అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అతలాకులం అవుతుంది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిసాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి.
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెం.మీ వర్షం నమోదయింది. నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో 32.3 సెం.మీ, మెదక్ జిల్లా సర్దానలో 30.2 సెం.మీ, కామారెడ్డి పట్టణంలో 28.9 సెం.మీ, భిక్‌నూర్ 27.9 సెం.మీ వర్షం నమోదయ్యింది. ఇతర ప్రాంతాల్లోనూ 20-27 సెం.మీ వరకు భారీ వర్షాలు కురిసాయి.
ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్..
భారీ వర్షాల ప్రభావంతో కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పంట పొలాలు, నివాస ప్రాంతాలు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి-భిక్కనూర్ రైలు మార్గంలో వరద ప్రవాహం ఏర్పడడంతో రైలు రాకపోకలు నిలిపివేయాల్సి వచ్చింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాగు పొంగడంతో కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలో నీరు ప్రవేశించి స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
మరోవైపు.. భారీ వరదల కారణంగా హైదరాబాద్-నిజామాబాద్ మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మెదక్ జిల్లా నర్సింగి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో వందలాది వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పలు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్, 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో నేడు నుండి రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి, భూపాలపల్లి, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, కొమురంభీం, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు, పగిలిపోయే ఉరుములు, మెరుపులు తోడుగా ఉంటాయని సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అధికారులు, అత్యవసర సేవల విభాగాలను అప్రమత్తం చేయాలని సూచించారు. అధికారులు సూచించినట్లుగా, వర్షాల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నది, వాగు పక్కన, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి, ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టమని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించమని సూచించారు. హైదరాబాద్‌లో హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, పోలీసు శాఖలను సమన్వయంతో అప్రమత్తం చేశారు. వినాయక చవితి సందర్భంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు భక్తులకు ప్రమాదం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నదులు, వాగులలోని కాజ్‌వేలు, కల్వర్ట్లపై నీటి ప్రవాహం ఉన్న చోట రాకపోకలు నిలిపివేయమని సూచించారు.
మరోవైపు.. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డి. శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. మెదక్, కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలకు అదనపు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని రెవెన్యూ మంత్రి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
విద్యాసంస్థలకు సెలవులు, పరీక్షలు వాయిదా
నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించబడ్డాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా తెలంగాణ వర్సిటీ పరిధిలోని నేటి పరీక్షలు వాయిదా వేశారు. శుక్రవారం యథాతథంగా నిర్వహించనున్నట్లు వీసీ యాదగిరిరావు తెలిపారు.
విషాద ఘటనలు.. అత్యవసర చర్యలు
తెలంగాణలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాల్లో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఓ ఇంటి గోడ కూలి వినయ్ అనే వైద్యుడు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సమీపంలోని ఎగువ మానేరులో పశువులను మేపడానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు వరదలో చిక్కుకుపోయారు. అదనంగా మరో రైతు గల్లంతయ్యాడు.
చిక్కుకున్న వ్యక్తులతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్‌లో మాట్లాడి, వారిని రక్షించేందుకు అన్ని విధాలా సహాయం అందించమని హామీ ఇచ్చారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి. గీతే పర్యవేక్షణలో డ్రోన్ల సహాయంతో నిత్యావసరాలు, ఆహారం అందించారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
మెదక్ జిల్లా నక్కవాగులో కారు కొట్టుకుపోయిన వ్యక్తిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి మొత్తం 504 మంది SDRF, అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎల్లారెడ్డి మండలం బొగ్గుగూడెం వద్ద వాగులో చిక్కుకున్న ట్యాంకర్‌లోని 9 మందిని SDRF, పోలీస్ బృందాలు రక్షించారు.
ప్రమాదం అంచున పోచారం జలాశయం: నిజామాబాద్-మెదక్ జిల్లాల సరిహద్దులోని నాగిరెడ్డిపేట మండలంలో పోచారం జలాశయం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నందున, సమీప ప్రాంతాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. జలాశయం నుండి సుమారు 8 అడుగుల ఎత్తున 1.30 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.