తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు
Rain Alert: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

చక్రవాత ఆవర్తన ప్రభావం
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. విదర్భ, మరత్వాడ ప్రాంతాల సమీపంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వాయువ్య దిశలో గాలులు వీస్తుండటంతో తెలుగు రాష్ట్రాలపై తేమగాల కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితి
ఉత్తర కోస్తా & యానాం:
ఆదివారం, సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది. మంగళవారం మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
ఈ ప్రాంతంలో కూడా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారం సాధారణ వర్షాలు పడుతుండగా, మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
రాయలసీమ:
రాయలసీమ జిల్లాల్లో కూడా ఆదివారం, సోమవారం తేలికపాటి వర్షాలు పడతాయని, మంగళవారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో వాతావరణ పరిస్థితి
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా అంచనా ప్రకారం, తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
మంగళవారం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ హెచ్చరికలు
వాతావరణ శాఖ ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద లేదా బహిరం ప్రదేశాల్లో నిలబడకూడదని సూచిస్తున్నారు. రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.