కేవలం రూపాయికే కిలో ఉల్లిపాయలు.. హైదరాబాద్ లో ధరలివే..!
Onion Price in Hyderabad : ఉల్లిపాయ ఒక్కోసారి కిలో వంద రెండోందలు పలుకుతుంది… ఒక్కోసారి కిలో రూపాయి రెండు రూపాయలకు పడిపోతుంది. మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఉల్లి ధర ఎంతో తెలుసా?

ఉల్లి రైతులకు కన్నీళ్ళు
Onion Price : ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదని అంటారు... అంటే ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయని అర్థం. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఉల్లిపాయలను ప్రతి వంటకంలో వాడుతుంటారు. మరీముఖ్యంగా తెలుగువారి వంటింట్లో ఉల్లిపాయలకు మామూలు డిమాండ్ ఉండదు... బిర్యానీ నుండి పచ్చిపులుసు వరకు ప్రతిదాంట్లో ఉల్లిపాయలు ఉండాల్సిందే. ఇంత డిమాండ్ ఉన్న ఉల్లిపాయలకు మార్కెట్లో డిమాండ్ లేదు... ప్రస్తుతం గిట్టుబాటు ధరలేక ఉల్లిరైతులు అల్లాడిపోతున్నారు. కొద్దిరోజులుగా అంతకంతకూ తగ్గుతూ వస్తున్న ఉల్లిధర ప్రస్తుతం కిలో రూపాయికి చేరింది.
రూపాయికే కిలో ఉల్లిపాయలు
కనీస గిట్టుబాటు ధర లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఉల్లి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని మాల్వా ప్రాంతంలో మరీ దారుణం... ఎంతో కష్టపడి పండించిన ఉల్లిపాయ పంటను మార్కెట్ కు తరలిస్తే రవాణా డబ్బులు కూడా రావడంలేదు. మాల్వా మార్కెట్ లో కిలో ఉల్లిధర కేవలం ఒక్క రూపాయి పలుకుతోంది.
ఎంపీలోని రత్లాం వ్యవసాయ మార్కెట్ కు మొఫత్ లాల్ మాలి అనే రైతు ఉల్లిపాయలను తరలించాడు. 30 క్వింటాళ్ళ పంటను తరలించేందుకు అతడికి రవాణా ఖర్చులే రూ. 2 వేలు అయ్యాయి. కానీ అతడు తీసుకువచ్చిన పంట క్వింటాల్ కు రూ.250 మాత్రమే పలికింది. ఉల్లికి ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం ఉల్లి రైతులందరిదీ ఇదే పరిస్థితి... ఒక్క ఎంపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఉల్లి రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిధర ఎంత?
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఉల్లిపాయ ధరలు పతనం అవుతున్నాయి. ఇటీవల రైతులు ఆందోళనకు గురవడంతో ఏపీలో కూటమి కనీస మద్దతుధరతో ఉల్లి పంటను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది... మార్క్ పెడ్ ద్వారా క్వింటాకు రూ.1200 ధర చెల్లించి కొనుగోలు చేసింది. అయినప్పటికీ రైతులు నష్టపోయారు... అలాంటిది ఇప్పుడు కిలో రూపాయి రెండు రూపాయలు పలుకుతోంది... మరి రైతులకు ఏస్థాయిలో నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఉల్లి ధరలు పడిపోడానికి కారణం
ఉల్లిపాయలు ఎక్కువకాలం నిల్వవుండే పంట... అందుకే రైతులు ధర వచ్చేవరకు వీటిని నిల్వ ఉంచుకుంటారు. మంచి ధర రాగానే అమ్మేస్తారు. అయితే గత నాలుగైదు నెలలుగా ఉల్లిపాయలకు అసలు ధర లేదు.. దీంతో చేసేదేమిలేక రైతులు ఉల్లిపాయలను మార్కెట్ కు తరలిస్తున్నారు. దీంతో సప్లై పెరిగి ధర ఒక్కసారిగా పడిపోతోంది. మధ్యప్రదేశ్ సరిగ్గా ఇదే జరిగి ఉంటుందని ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు.
వినియోగదారులకు మాత్రం కిలో ఉల్లి రూ.20, 30 :
రైతుల వద్ద కిలో రూపాయి రెండు రూపాయలకు ఉల్లిపాయలను కొంటున్న వ్యాపారులు వినియోగదారులకు మాత్రం 20, 30 రూపాయలకు అమ్ముతున్నారు. హైదరాబాద్ లో వంద రూపాయలకు నాలుగైదు కిలోల ఉల్లిపాయలు లభిస్తున్నాయి. అంటే అటు రైతులు, ఇటు వినియోగదారులు ఇద్దరూ నష్టపోతున్నారు... మధ్యలో దళారులు, వ్యాపారులు లాభపడుతున్నారు.
ఉల్లి పంటవేసి తీవ్రంగా నష్టపోతున్నామని... కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రూపాయి రెండు రూపాయలు కాకుండా కనీస మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని కోరుతున్నారు. మధ్యవర్తుల దోపిడీని నివారించి రైతులకు లాభం దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.