- Home
- Telangana
- గంటల్లో 400 మిమీ వర్షపాతమేంటి సామీ..! డబుల్ క్లౌడ్ బరస్ట్ రేంజ్ లో ఇక్కడ మొంథా మోత మోగించిందిగా..!!
గంటల్లో 400 మిమీ వర్షపాతమేంటి సామీ..! డబుల్ క్లౌడ్ బరస్ట్ రేంజ్ లో ఇక్కడ మొంథా మోత మోగించిందిగా..!!
IMD Rain Alert : క్లౌడ్ బరస్ట్ కాదు… అంతకు మించిన వర్షపాతం తెలంగాాణలో నమోదయ్యింది. మొంథా తుపాను ప్రభావంతో కేవలం 12 గంటల్లో 400 మిమీ వర్షపాతం నమోదయ్యింది… ఆ ప్రాంతమేదో తెలుసా?

తెలంగాణలో మొంథా దెబ్బకు కుండపోత
IMD Rain Alert : సాధారణంగా ఓ ప్రాంతంలో 100 మిమీ కంటే ఎక్కువ వర్షం కురిస్తే 'క్లౌడ్ బరస్ట్' జరిగిందంటారు... మరి గంటల వ్యవధిలో ఏకంగా 400 మిల్లిమీటర్ల వర్షం కురిస్తే... వాతావరణ బాషలో కూడా ఇలాంటి వానకు పేరులేదు. ఇంతటి కుండపోత వర్షం బుధవారం (అక్టోబర్ 29న) తెలంగాణలో కురిసింది. ఆంధ్ర ప్రదేశ్ లో తీరందాటిన మొంథా తుపాను అక్కడ విధ్వంసం సృష్టించడమే కాకుండా ముందుకుసాగి తెలంగాణలో మోత మోగించేసింది.
మొంతా దెబ్బకు ఈ జిల్లాలు విలవిల
మొంథా తుపాను దెబ్బ తెలంగాణకు గట్టిగానే తాకుతోంది... గత రెండుమూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే నిన్న(బుధవారం) మాత్రం కొన్ని తెలంగాణ జిల్లాల్లో ఊహకందని వర్షం కురిసింది. గతంలో ఎన్నడూ చూడనిస్థాయిలో రికార్డు వర్షపాతం నమోదయ్యింది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అయితే ఉదయం నుండి రాత్రివరకు కుండపోత వర్షాలు కురిశాయి.
క్లౌడ్ బరస్ట్ కాదు అంతకుమించి..
క్లౌడ్ బరస్ట్ కాదు అంతకు మించిన వర్షాలు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కురిశాయి. 100, 200 మి.మీ వర్షపాతానికే రెడ్ అలర్ట్ జారీచేస్తారు... అంటే అత్యంత భారీ వర్షమని, చాలా ప్రమాదకరమని అర్థం. అలాంటిది ఈ జిల్లాల్లో ఏకంగా 400 మిమీ వర్షం కురిసింది... దీన్నిబట్టే ముంథా తెలంగాణను ఎలా ముంచేసిందో అర్థంచేసుకోవచ్చు. ఎడతెరిపి లేకుండా కురిసిన జోరువాన ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసింది.
అత్యధిక వర్షపాతం ఇక్కడే...
బుధవారం ఉదయం 8.30 గంటల నుండి అదేరోజు రాత్రి 9 గంటల వరకు అంటే కేవలం 12-13 గంటల్లో రికార్డుస్థాయి వర్షపాతం నమోదయ్యింది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లెలో 390.6 మిల్లిమీటర్లు, వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో 378.6 మిమీ, వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ లో 312.8 మీమీ వర్షం కురిసిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 310.4 మిమీ, హుజురాబాద్ లో 293 మిమీ వర్షపాతం నమోదయ్యిందట. ఈస్థాయిలో వర్షాకాలంలో కూడా వానలు పడవు... అలాంటిది మొంథా తుపాను ఎపెక్ట్ తో వర్షాకాలం ముగిసాక కురిశాయి. నాలుగైదు జిల్లాల్లో దాదాపు 30-40 ప్రాంతాల్లో 200-400 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.
24-HOUR ACCUMULATED RAINFALL (cm)
DATED 29-10-2025 (0830 Hrs) to 30-10-2025 (0830 Hrs) pic.twitter.com/tvHyteiiJW— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) October 30, 2025
ఇంకా తెలంగాణకు వర్షం ముప్పు..
ఇప్పటికే మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దయ్యింది. నదులు, వాగులు వంకలు వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి... జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. దీంతో నీటిప్రవాహాల సమీపంలోని జనావాసాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు వంతెనలపైనుండి, రోడ్లపై ప్రవహించే ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయరాదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ప్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం పొంచివుంది... ఇలాంటి సమయంలో తెలంగాణలో ఇవాళ(గురువారం, అక్టోబర్ 30న) భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇవాళ నార్త్ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.
ఈ తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్
గురువారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక కొమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు
ఇవాళ (అక్టోబర్ 30) సాయంత్రం నుండి శుక్రవారం (అక్టోబర్ 31) ఉదయం వరకు ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయట... అందుకే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి?
ఉష్ణోగ్రతల విషయానికి వస్తే తెలంగాణలో అత్యల్పంగా హైదరాబాద్ హయత్ నగర్ లో 19 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యాయి. ఇక మెదక్, హన్మకొండ, ఖమ్మం జిల్లాల్లో 21 డిగ్రీ సెల్సియస్... మిగతా అన్ని జిల్లాల్లో 21 నుండి 24 డిగ్రీ సెల్సియస్ లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా 25 నుండి 30 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. రోజంతా ఆకాశం మేఘాలతో కమ్మేసి వాతావరణం చల్లగా ఉంటుందని... సాయంత్రం, రాత్రి వేళలో తేలికపాటి చిరుజల్లులు, తెల్లవారుజాము పొగమంచు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
నేడు ఏపీలో వర్షాలు
ఇక ఇవాళ (గురువారం) ఆంధ్ర ప్రదేశ్ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్ధ ప్రకటించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల చెరువులు, కాలువలు,వాగులు రోడ్లు మీదుగా పొంగుతున్నాయని... వాటిని దాటే ప్రయత్నం చేయరాదాని సూచించారు. లోతట్టు ప్రజలు మరో 2రోజుల వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్స్ కు సంప్రదించాలని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ ప్రజలకు సూచించారు.