తెలంగాణలో మొంథా బీభత్సం.. 16 జిల్లాలకు రెడ్ అలర్ట్, స్కూళ్లకు సెలవులు
Cyclone montha: వాతావరణ శాఖ ముందు నుంచి వేస్తున్న అంచనాల ప్రకారమే మొంథా తుఫాను బీభత్సం చూపించింది. ఆంధ్రప్రదేశ్‌లో అల్లకల్లోలం సృష్టించిన తుఫాను ఇప్పుడు తెలంగాణపై తన ప్రభావాన్ని చూపిస్తోంది.

మొంథా తుఫాను విధ్వంసం
గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడిన మొంథా తుఫాను ఇప్పుడు తెలంగాణలో విధ్వంసం సృష్టిస్తోంది. కోస్తా ఆంధ్ర, తూర్పు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లి జనజీవనం అస్తవ్యస్తమైంది. మొదట తుఫాను ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్తుందని అంచనా వేసినా, అది మార్గం మార్చి ఉత్తరాంధ్ర–తెలంగాణ సరిహద్దుల మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతోంది. ఈ మార్పు వల్ల ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
తెలంగాణలో ఉగ్రరూపం
తెలంగాణలో బుధవారం రాత్రి నుంచి వర్షాలు ఆగడం లేదు. వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలు వర్ష బీభత్సంతో వణికుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, చెట్లు కూలిపోయాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుధవారం సాయంత్రానికి తుఫాను వాయుగుండంగా బలహీనపడినా, వాతావరణ శాఖ ప్రకారం గురువారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగనున్నాయి.
స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
భారీ వర్షాల కారణంగా ములుగు, వరంగల్, జనగామ, కరీంనగర్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, సిద్ధిపేట జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో రహదారులు దెబ్బతిన్నాయి. రైళ్లను నిలిపివేశారు, కొన్నింటినీ దారి మళ్లించారు. శ్రీశైలం హైవేలో డిండి వాగు పొంగి రోడ్డు కొట్టుకుపోవడంతో హైదరాబాద్–శ్రీశైలం రూట్‌పై వాహనాలను మళ్లించారు.
16 జిల్లాలకు వరద ముప్పు
వాతావరణశాఖ హెచ్చరికల ప్రకారం గోదావరి పరీవాహక ప్రాంతంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాల్లో వరద ప్రమాదం ఉంది. ప్రాజెక్టులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్, హనుమకొండ జిల్లాలకు మరో 24 గంటలు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. పర్వతగిరిలో 34.8 సెం.మీ., రెబర్తిలో 17.4 సెం.మీ., దూల్మిట్టలో 15.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
సహాయక చర్యలు
హనుమకొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో NDRF బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. అధికారులు ప్రజలకు “ఇళ్లలోనే ఉండండి, వాగులు–వంకల దగ్గరికి వెళ్లకండి” అని హెచ్చరికలు జారీ చేశారు.