- Home
- Telangana
- మీరు ఆర్థిక కష్టాల్లో ఉంటే పిల్లల చదువుకు నెలనెలా రూ.4,000 సాయం.. ఏమిటీ పథకం, ఎలా అప్లై చేసుకోవాలి?
మీరు ఆర్థిక కష్టాల్లో ఉంటే పిల్లల చదువుకు నెలనెలా రూ.4,000 సాయం.. ఏమిటీ పథకం, ఎలా అప్లై చేసుకోవాలి?
మీరు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారా? పిల్లలను చదివించేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారా? అయితే ప్రభుత్వం నుండి మీ పిల్లల చదువు, ఇతర ఖర్చులకోసం నెలనెలా రూ.4000 ఆర్థిక సాయం పొందవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

పుష్ప2 బాధిత కుటుంబానికి మిషన్ వాత్సల్య పథకం
Mission Vatsalaya Scheme : అందరికీ ఆనందాన్ని పంచిన సినిమా వారిజీవితాల్లో మాత్రం విషాదాన్ని నింపింది. పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిన సినిమా ఓ అమాయకురాలి ప్రాణం తీసింది... ఇద్దరు పిల్లలకు తల్లిప్రేమను దూరం చేసింది. ఇలా హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్ లో పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా చోటుచేసుకున్న ఘటన ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. సినిమా చూసేందుకు కుటుంబంతో కలిసివెళ్లిన రేవతి ప్రాణాలు కోల్పోగా... ఆమె కొడుకు శ్రీతేజ తీవ్రగాయాలపాలై ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోతున్నాడు. ఇలా పుట్టెడు దు:ఖంలో ఉన్న ఈ కుటుంబాన్ని పెద్దమనసుతో ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకువచ్చింది... మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది.
ఈ మిషన్ వాత్సల్య పథకం కింద శ్రీతేజ సోదరికి ప్రతి నెల రూ.4,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఇలా బాలికకు 18 సంవత్సరాలు నిండేంతవరకు నెలనెలా ఆర్థికసాయం అందుతుంది. ఇటీవల నెలకు రూ.4,000 చొప్పున గత మూడు నెలల మొత్తం రూ.12,000 నేరుగా బాలిక తండ్రి భాస్కర్ ఖాతాలో జమ చేశారు. ఇకపై నెలనెలా రూ.4 వేల ఆర్థిక సాయం అతడి ఖాతాలో జమ అవుతాయని తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ ప్రకటించింది.
పుష్ఫ2 సినిమా రిలీజ్ సమయంలో ప్రమాదానికి గురైన బాధిత కుంటుంబాన్ని మిషన్ వాత్సల్య పథకానికి ఎంపిక చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఓ పథకం ఉందని చాలామందికి తెలియదు. కాబట్టి అసలు ఏమిటీ మిషన్ వాత్సల్య పథకం? ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
KNOW
ఏమిటీ మిషన్ వాత్సల్య పథకం?
కరోనా మహమ్మారి ఎందరో చిన్నారులను అనాధలను చేసింది. చాలామంది చిన్నారుల పేరెంట్స్ కరోనా బారినపడి చనిపోవడంతో అనాధలుగా మారారు. ఇక కుటుంబాన్ని పోషించేవారు చనిపోవడంతో మరికొందరు చిన్నారులు ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలా లక్షలాదిమంది చిన్నారుల జీవితాలను చీకటిమయం చేసింది కరోనా... వీరి జీవితాల్లో తిరిగి వెలుగులు నింపేందుకు కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో 2021లో మిషన్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించింది.
అనాధలు, వివిధ కారణాలతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నా పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవడమే మిషన్ వాత్సల్య ముఖ్య ఉద్దేశ్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తున్నాయి... కేంద్రం 60, ఆయా రాష్ట్రాలు 40 శాతం నిధులు అందిస్తాయి. ఈ పథకానికి ఎంపిక చేసిన చిన్నారులకు 18 ఏళ్ళు వచ్చేవరకు నెలకు రూ.4,000 ఆర్థిక సాయం అందిస్తారు.
ఈ పథకానికి ఎవరు అర్హులు?
1. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడంతో ఏదిక్కూలేకుండా అనాధలుగా మారిన చిన్నారులకు ఈ పథకం ద్వారా ఆర్థికసాయం అందిస్తారు. వారు చదువు కొనసాగించేందుకు, గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు నెలనెలా రూ.4,000 అందిస్తారు.
2. కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కు చనిపోవడంతో పిల్లలను చదివించేందుకు ఇబ్బందిపడే వితంతువులకు ఈ ఆర్థిక సాయం అందిస్తారు. అంటే తల్లి లేదా తండ్రి ఉన్నా ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న చిన్నారులకు కూడా ఈ పథకం ద్వారా నెలనెలా రూ.4 వేలు అందిస్తారు.
3. తల్లిదండ్రులను కోల్పోయి బంధువుల ఇల్లలోనో లేదా తమ ఇంట్లోనే నివాసముండే పిల్లలకు కూడా ఈ మిషన్ వాత్సల్య ద్వారా ఆర్థిక సాయం అందిస్తారు.
ఈ పథకానికి ఎవరు అర్హులు?
4. తల్లిదండ్రులు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి పిల్లల చదువుకు ఖర్చు చేయలేని పరిస్థితి కొన్ని కుటుంబాల్లో ఉంటుంది. అలాంటి విధ్యార్థులకు కూడా యుక్తవయసు వచ్చేవరకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది.
5. ఇంటినుండి పారిపోయివచ్చిన పిల్లలు బాల కార్మికులు, యాచకులకు మారకుండా ఉండేందుకు ఈ మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థికసాయం అందిస్తుంది ప్రభుత్వం. అంగవైకల్యం, హెచ్ఐవి బాధిత బాలబాలికలకు కూడా మిషన్ వాత్సల్య పథకం వర్తిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో మిషన్ వాత్సల్య పథకం.. ఎలా అప్లై చేయాలి?
తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ మిషన్ వాత్సల్య పథకం అమలవుతోంది. ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు జిల్లా మహిళా, శిశు సంక్షేమ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. వ్యక్తిగత వివరాలతో కూడిన పత్రాలతో పాటు ఆర్థిక పరిస్థితిని తెలియజేసే ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు వంటి జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు వీటిని పరిశీలించి అన్ని అర్హతలు ఉంటే మిషన్ వాత్సల్య పథకం కింద నెలనెలా రూ.4,000 అందించేందుకు ఎంపిక చేస్తారు.