- Home
- Telangana
- Medaram Jatara: మేడారం వెళ్లలేకపోతున్నారా.? ఏం పర్లేదు ప్రసాదం మీ ఇంటికే వస్తుంది. ఎలాగంటే..
Medaram Jatara: మేడారం వెళ్లలేకపోతున్నారా.? ఏం పర్లేదు ప్రసాదం మీ ఇంటికే వస్తుంది. ఎలాగంటే..
Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారంకు వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చే ఈ వేడుకకు నేరుగా వెళ్లలేని వారికి తెలంగాణ ఆర్టీసీ ఒక మంచి అవకాశం కల్పించింది.

మేడారం జాతరకు ముస్తాబు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 28 నుంచి 31 వరకూ జాతర జరగనుంది. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం మేడారం పరిసర ప్రాంతాల్లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. మంత్రులు స్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. భద్రత, రవాణా, వైద్య సదుపాయాలపై ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
మేడారం జాతర సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ భక్తులకు మరో మంచి అవకాశం కల్పించింది. జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ప్రత్యేక సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు ఇప్పుడు ఇంటి వద్ద నుంచే ప్రసాదం పొందే అవకాశం లభించింది.
ఇంటికే అమ్మవారి బంగారం ప్రసాదం
టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా మేడారం సమ్మక్క సారలమ్మ బంగారం ప్రసాదాన్ని నేరుగా భక్తుల ఇళ్లకు చేరవేయనున్నారు. దేవాదాయ శాఖ సహకారంతో ఈ సేవ అమలు కానుంది. ప్రసాదం ప్యాకెట్ లో దేవతల ఫోటో, బెల్లం, పసుపు కుంకుమ వంటి పూజా సామగ్రి అందించనున్నారు.
బుకింగ్ విధానం, ధర వివరాలు
బంగారం ప్రసాదం ప్యాకెట్ కోసం భక్తులు రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. ఇక బుకింగ్ కోసం www.tgsrtclogistics.co.in వెబ్‌సైట్‌లో సెర్చ్ చేయండి. లేదంటే సమీప టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో సంప్రదించవచ్చు. పూర్తి సమాచారం కోసం 040-69440069, 040-23450033 నెంబర్లను సంప్రదించాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు.

