- Home
- Telangana
- Raja Saab : నా చావు కోరుకుంటున్నారా? రాజాసాబ్ టికెట్ల రచ్చ.. తెగేసి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
Raja Saab : నా చావు కోరుకుంటున్నారా? రాజాసాబ్ టికెట్ల రచ్చ.. తెగేసి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
Raja Saab Komatireddy : కుటుంబాలను టార్గెట్ చేస్తూ వస్తున్న అసత్య ప్రచారాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజాసాబ్ టికెట్ల పెంపు, లేడీ ఆఫీసర్లపై రూమర్స్, హైవే విస్తరణపై కీలక విషయాలు వెల్లడించారు.

విషం పెట్టి చంపేయండి.. నా కొడుకు పోయినప్పుడే సగం చచ్చా: కోమటిరెడ్డి ఎమోషనల్ !
తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో తనపైన, అలాగే ప్రభుత్వ అధికారులపైన వస్తున్న వ్యక్తిగత ఆరోపణలు, అసత్య ప్రచారాలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రభాస్ కొత్త సినిమా ది రాజాసాబ్ టికెట్ల పెంపు వ్యవహారం, జాతీయ రహదారుల విస్తరణపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు.
మానసికంగా వేధించకండి.. ఒకేసారి చంపేయండి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
సోషల్ మీడియాలో, కొన్ని వార్తా ఛానెల్స్‌లో రేటింగ్స్ కోసం వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వస్తున్న కథనాలపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఐఏఎస్ అధికారులపై, మంత్రులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా ఉద్వేగానికి లోనయ్యారు.
"నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయాను. ఇంకా నన్ను ఎందుకు మానసికంగా హింసిస్తారు? నన్ను ఇలా వేధించడం కన్నా.. ఒకేసారి ఇంత విషం పెట్టి చంపేయండి" అని మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఐఏఎస్‌లపై తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమైన విషయమనీ, మహిళా ఆఫీసర్లను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. తనపై విమర్శలు చేస్తే తట్టుకుంటానని, కానీ కుటుంబ సభ్యులను, మహిళా అధికారులను ఇందులోకి లాగవద్దని మీడియాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
లేడీ ఐఏఎస్‌లపై దుష్ప్రచారం తగదు
ఇటీవల ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ మంత్రి మండిపడ్డారు. రేటింగ్స్, వ్యూస్ కోసం అవాస్తవాలను వండి వార్చడం జర్నలిజం కాదని ఆయన అన్నారు. అధికారుల బదిలీలు అనేది పూర్తిగా పరిపాలనా పరమైన అంశమని, అది ముఖ్యమంత్రి పరిధిలో జరుగుతుందని స్పష్టం చేశారు.
మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే బదిలీల ప్రక్రియ జరుగుతుందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. తన మంత్రి హయాంలో నల్లగొండ జిల్లాలో నలుగురు కలెక్టర్లు మారారని, అది సాధారణ ప్రక్రియ అని తెలిపారు. మహిళా అధికారులపై వస్తున్న ఆరోపణల విషయంలో ప్రభుత్వం తరఫున సమగ్ర దర్యాప్తు జరిపించాలని తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరనున్నట్లు వెల్లడించారు.
రాజాసాబ్ టికెట్ల పెంపుతో నాకేం సంబంధం లేదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
సంక్రాంతి క్రమంలో వచ్చిన ప్రభాస్ కొత్త సినిమా ది రాజాసాబ్ టికెట్ల ధరల పెంపు వివాదంపై కూడా మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. సినిమా టికెట్ల ధరల పెంపునకు సంబంధించిన జీవోలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పటికీ, గత కొంతకాలంగా సినీ పరిశ్రమ వ్యవహారాలను పట్టించుకోవడం మానేశానని స్పష్టం చేశారు.
"పుష్ప-2 సినిమా తర్వాత నేను టికెట్ రేట్ల పెంపునకు ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదు. రాజాసాబ్ సినిమా రేట్ల పెంపు ఫైల్ నా దగ్గరకు రాలేదు. రాత్రి వచ్చిన జీవోలకు, నాకు లింకు పెట్టొద్దు" అని ఆయన పేర్కొన్నారు. టికెట్ల రేట్ల పెంపు కోసం తనను కలవద్దని, దరఖాస్తులు కూడా పెట్టుకోవద్దని నిర్మాతలకు ముఖాముఖిగానే చెప్పినట్లు మంత్రి వెల్లడించారు. అంటే మెగాస్టార్ చిరంజీవీ మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా టిక్కెట్టు ధరల పెంపు వుండకపోవచ్చు.
సంధ్య థియేటర్ ఘటన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ వైరల్
తాను సినిమా వ్యవహారాలకు దూరంగా ఉండటానికి గల బలమైన కారణాన్ని మంత్రి బయటపెట్టారు. గతంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, ఒక బాలుడు గాయపడటం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు.
ఆ ఘటన తర్వాతే తాను కఠిన నిర్ణయం తీసుకున్నానని, కనీసం ఆ సినిమా నిర్మాత కూడా బాధితులను పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో తన సొంత డబ్బులు రూ. 25 లక్షలు ఇచ్చి బాధితులను ఆదుకున్నానని, గాయపడిన బాలుడి చదువు బాధ్యత తీసుకున్నానని గుర్తుచేశారు. అందుకే ఇకపై కేవలం పేద సినీ కార్మికుల సమస్యలు తప్ప, కమర్షియల్ విషయాల్లో జోక్యం చేసుకోనని, తన పూర్తి సమయం నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేటాయిస్తానని స్పష్టం చేశారు.
రూ.10,400 కోట్లతో హైవే విస్తరణ.. ప్రయాణికులకు ఊరట
రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి శుభవార్త చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి (NH-65)ని 6 లేన్లుగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. దీనికోసం రూ.10,400 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఈ పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు.
ఇక సంక్రాంతి రద్దీ దృష్ట్యా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. తార్నాక వైపు వెళ్లే వారు వలిగొండ రూట్ ద్వారా వెళ్తే ట్రాఫిక్ చిక్కులు ఉండవని సూచించారు. దాదాపు 10 నుంచి 12 లక్షల వాహనాలు హైవేపై వెళ్తున్నాయని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని మంత్రి భరోసా ఇచ్చారు.

