తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై కొండపైకి ఉచిత ప్రయాణం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిలో తిరుమలకు ఉచిత బస్సు వర్తించదని తెలిపారు. అయితే తాజాగా ఒక గుడ్ న్యూస్ వచ్చింది.

కీలక ప్రకటన
తిరుపతి-తిరుమల మధ్య ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని మార్గాల్లో ఇప్పటికే ఉచిత ప్రయాణ పథకం అమలులోకి వచ్చినప్పటికీ, ఇప్పటివరకు తిరుమలకు వెళ్ళే బస్సులకు ఈ అవకాశం వర్తించకపోవడం వల్ల మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా నిర్ణయం వారికి ఉపశమనం కలిగించబోతోంది.
KNOW
ప్రభుత్వంపై అదనపు భారం రూ. 23 కోట్లు
ప్రస్తుతం అమలవుతున్న "స్త్రీశక్తి" పథకంతో ప్రతి సంవత్సరం 25 లక్షల మహిళలు ప్రయోజనం పొందుతున్నారు. తిరుపతి-తిరుమల బస్సులు కూడా ఈ జాబితాలో చేరితే ప్రభుత్వంపై అదనంగా రూ. 23 కోట్ల భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉచిత ప్రయాణ పథకానికి ఏడాదికి సుమారు రూ. 1960 కోట్లు వెచ్చిస్తోంది. ఈ నేపథ్యంలో అదనంగా పడే రూ. 23 కోట్లు పెద్ద భారమేమీ కాదని పలువురు భావిస్తున్నారు.
రోజువారీ ప్రయాణం, మహిళల సంఖ్య
తిరుపతి-తిరుమల మార్గంలో ప్రస్తుతం 298 డీజిల్ బస్సులు, 64 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు మినహాయించి మిగతా వాహనాల్లో ఉచిత ప్రయాణం లభించనుంది. ప్రతిరోజూ 1160 ట్రిప్పులు నడుస్తున్న ఈ మార్గంలో సుమారు 45 వేల మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారిలో 35 శాతం అంటే దాదాపు 13,500 మంది మహిళలు. వీరిలోనూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉంటారు.
ఎంత మందికి లాభం జరగనుంది.?
ఆర్టీసీ లెక్కల ప్రకారం రోజూ 7 వేల వరకు ఆంధ్రప్రదేశ్ మహిళలు తిరుపతి-తిరుమల మధ్య ప్రయాణిస్తున్నారు. నెలకు 2.10 లక్షల మంది, సంవత్సరానికి 23 లక్షల మంది వరకు ఈ సదుపాయం ఉపయోగించుకుంటారని అంచనా. యాత్రికులే కాకుండా టీటీడీ సిబ్బంది, చిన్న వ్యాపారులు, కూలీలు కూడా దీనివల్ల లబ్ధి పొందబోతున్నారు.
ఒక్కొక్కరికీ రూ. 180 ఆదా
తిరుపతి నుంచి తిరుమల వరకు 24 కిలోమీటర్ల దూరానికి ఒక వైపు చార్జీ రూ. 90. వెళ్లిరావడానికి మొత్తం రూ. 180 అవుతుంది. ఈ మొత్తాన్ని మినహాయించడం ద్వారా భక్తులు, ముఖ్యంగా కుటుంబాలతో వెళ్లేవారికి లబ్ధి జరగనుంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.