Kavitha: ఇప్పుడు పార్టీ పేరు మార్చమని అంటే ఎలా.? ఎన్నికల సంఘానికి కవిత లేఖ
Kavitha: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి అధికారిక గుర్తింపు కల్పించాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

పార్టీ రిజిస్ట్రేషన్‌కు ఆలస్యం చేయొద్దని విజ్ఞప్తి
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం దాఖలు చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీ దరఖాస్తును నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి వెంటనే ఆమోదించాలని లేఖలో కోరారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన పదాలు లేదా పోలికలు ఉన్న పేర్లతో అనేక రాజకీయ పార్టీలు ఇప్పటికే నమోదు అయ్యాయని, అలాంటి పరిస్థితుల్లో తమ పార్టీ పేరుపై మాత్రమే అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు.
వెయ్యి అభ్యంతరాల వివరాలు ముందుగా ఇవ్వాలని డిమాండ్
జూన్ 23న ఎన్నికల సంఘం పంపిన లేఖలో తమ పార్టీ పేరుపై దాదాపు వెయ్యి అభ్యంతరాలు అందినట్లు పేర్కొన్నప్పటికీ, ఆ అభ్యంతరాల ప్రతులను ఇప్పటి వరకు అందించలేదని ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు. ఎవరు అభ్యంతరాలు తెలిపారు? వాటిలో ఉన్న అంశాలు ఏమిటి? అనే వివరాలు తెలియకుండా సమగ్ర సమాధానం ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల సంఘం నిర్వహించే వ్యక్తిగత విచారణకు హాజరయ్యే ముందు అన్ని అభ్యంతరాల కాపీలు తమకు ఇవ్వాలని లేఖలో స్పష్టం చేశారు. తెలంగాణలో కోట్లాది జనాభా ఉండగా, కేవలం వెయ్యి అభ్యంతరాల ఆధారంగా పార్టీ రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు.
పార్టీ పేరు మార్చాలని చెప్పడం వల్ల నష్టం జరుగుతుందన్న ఆందోళన
ఈ ఏడాది ఏప్రిల్ 28న తెలంగాణ రక్షణ సేన అనే పేరును ఉపయోగించేందుకు ఎన్నికల సంఘం అధికారికంగా అనుమతి ఇచ్చిందని పార్టీ నాయకత్వం గుర్తు చేసింది. ఆ అనుమతిని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలోని 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు జెండాల ఆవిష్కరణ, సంస్థాగత కార్యక్రమాలు చేపట్టామని వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ పేరు మార్చాలని సూచిస్తే ఇప్పటికే చేసిన రాజకీయ, సంస్థాగత కార్యక్రమాలన్నింటికీ నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ప్రజల్లో ఏర్పడిన గుర్తింపు కూడా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పూర్తి పేరును పరిగణనలోకి తీసుకోవాలని సూచన
రాజకీయ పార్టీల పేర్లను పరిశీలించే సమయంలో మొత్తం పేరునే ప్రమాణంగా తీసుకోవాలని, అందులోని ఒక్కో పదాన్ని విడదీసి పోల్చడం సరికాదని ఎన్నికల సంఘానికి సూచించారు. ఎన్నికల సంఘం ప్రస్తావించిన తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రాటిక్), తెలంగాణ రాజ్య సమితి వంటి పార్టీలకు తమ పార్టీతో పేరు, నాయకత్వం, ఉచ్చారణ పరంగా ఎలాంటి సారూప్యత లేదని స్పష్టం చేశారు. అందువల్ల కేవలం కొన్ని పదాలు ఒకేలా ఉన్నాయనే కారణంతో పార్టీ రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయడం న్యాయసమ్మతం కాదని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఇలాంటి పేర్లతో ఎన్నో పార్టీలు ఉన్నాయన్న కవిత
దేశంలో ఇప్పటికే ఒకే తరహా పదాలతో నమోదైన రాజకీయ పార్టీల సంఖ్య ఎక్కువగా ఉందని లేఖలో ప్రస్తావించారు. ఆమ్ ఆద్మీ, అఖండ్ భారత్, మక్కల్, ప్రజా సేవ, జన్ అధికార్, రాష్ట్రీయ జనతా వంటి పదాలు వివిధ పార్టీల పేర్లలో సాధారణంగా ఉపయోగిస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి ఉదాహరణల జాబితాను కూడా ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు తెలిపారు. కేవలం సాధారణ పదాలు లేదా ఊహాజనిత సంక్షిప్త రూపాల ఆధారంగా వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, చట్టపరమైన ప్రమాణాల ప్రకారం తెలంగాణ రక్షణ సేన పార్టీకి రిజిస్ట్రేషన్, గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కల్వకుంట్ల కవిత, అనిల్ కుమార్ కోరారు.

