Holidays : ఈ శుక్రవారం సెలవుందా..? ఉంటే వీరికి వరుసగా మూడ్రోజులు సెలవులే
ఈ శుక్రవారం (జూన్ 27న) తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ఉందా? ఉంటే కొందరికి ఈవారం లాంగ్ వీకెండ్ గా మారనుంది. మరి ఈ శుక్రవారం సెలవు ఎందుకో తెలుసా?

ఎల్లుండి సెలవేనా?
Telangana Holidays : తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ఇటీవలే వేసవి సెలవులు ముగిసాయి... మళ్ళీ స్కూళ్లు ప్రారంభమై పదిపదిహేను రోజులు కావస్తోంది. సమ్మర్ మొత్తం చదువుల ఒత్తిడి లేకపోవడంతో పిల్లలు పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన అవసరం లేకుండాపోయింది... దీంతో తెగ ఎంజాయ్ చేశారు. సొంతూళ్లకు వెళ్లి కొందరు హాయిగా గడిపారు... మరికొందరు తల్లిదండ్రులతో విహార యాత్రలకు వెళ్లారు... ఇంకొందరు ఆటాపాటలతో సరదాగా గడిపారు.
ఇలా తెగ ఎంజాయ్ చేసిన విద్యార్థులను ఒక్కసారిగా స్కూల్ కి వెళ్లమంటే బాధగానే ఉంటుంది. అందుకే కొందరు పదిహేను రోజులు గడుస్తున్న ఇంకా భారంగానే భుజాలకు బ్యాగు తగిలించుకుని వెళుతున్నారు. ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అని చాలామంది విద్యార్థులు ఎదురుచూస్తుంటారు. అలాంటి తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే సమాచారమిది. ఈ వారం కొందరు విద్యార్థులకు లాంగ్ వీకెండ్ వచ్చే అవకాశాలున్నాయి.
ఈ శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో ఆప్షనల్ హాలిడే
తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా జూన్ 27, 2025 ను ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. ఈ రోజు హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రథయాత్ర ఉంది... కాబట్టి తెలుగు రాష్ట్రాలు ఐచ్చిన సెలవు ఇచ్చాయి. అంటే ఈరోజు ఉద్యోగులు, విద్యార్థులు కావాలనుకుంటే సెలవు తీసుకోవచ్చు. కొన్ని ధార్మిక విద్యాసంస్థలు కూడా ఈరోజు సెలవు ప్రకటించే అవకాశాలుంటాయి.
ఏమిటీ రథయాత్ర?
రథయాత్ర అనేది భారతదేశంలో ఒక ముఖ్యమైన హిందూ పండుగ. ఈరోజు దేవాలయాల్లోని దేవతామూర్తుల విగ్రహాలను రథాలలో ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాథ ఆలయంలో ఈ రథయాత్ర కన్నులపండగగా జరుగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు దేవాలయాల్లో ఈ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుపుతారు. దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి రథంపై ఊరేగిస్తారు. ఈ వేడుకలో భక్తులు భారీగా పాల్గొని రథాన్ని లాగుతారు. ఇలా దేవుడి వద్దకు భక్తులు కాదు... భక్తుల వద్దకే ఆ దేవతామూర్తులు వచ్చి ఆశీర్వదిస్తారు.
వారికి శని, ఆదివారం సెలవులు
హైదరాబాద్ తో పాటు ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే విశాఖపట్నం వంటి నగరాల్లో కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు శని, ఆదివారం రెండ్రోజులు సెలవు ఉంటుంది. అలాగే ప్రైమరీ క్లాస్ విద్యార్థులకు కూడా కొన్ని స్కూళ్లు రెండ్రోజులు సెలవు ఇస్తుంటాయి. పిల్లలు తల్లిదండ్రులతో గడిపేందుకు వీలుగా ఇలా రెండ్రోజుల సెలవులు ఇస్తున్నారు. ఇలాంటి విద్యాసంస్థలు ఈ శుక్రవారం రథయాత్రకు సెలవు ఇస్తే వరుసగా మూడ్రోజుల సెలవులు కలిసివస్తాయి.
ఉద్యోగులకు లాంగ్ వీకెండ్?
అలాగే సాప్ట్ వేర్ ఉద్యోగులతో పాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వారంలో శని, ఆదివారం రెండ్రోజులు సెలవు ఉంటుంది. ఇలాంటివారు ఈ శుక్రవారం (జూన్ 27) ఆప్షనల్ హాలిడే తీసుకుంటే మూడ్రోజుల సెలవులు కలిసివస్తాయి. ఇలా వీరికి సాధారణ వీక్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతుంది.
ఇలా పిల్లలు, పేరెంట్స్ కి మూడ్రోజుల సెలవులు వస్తే హాయిగా ఏదయినా వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే పేరెంట్స్, పిల్లలు కలిసి హాయిగా ఇంట్లోనే సరదాగా గడపవచ్చు. అయితే ఇలా మూడ్రోజుల సెలవులు అందరికీ కలిసివచ్చే అవకాశం లేదు... కొంతమందికి మాత్రమే కలిసివస్తాయి.