- Home
- Telangana
- Hyderabad : ఆబిడ్స్ నుండి జూబ్లి హిల్స్ వరకు .. ఈ 12 ప్రాంతాలకు ఆ పేర్లెలా వచ్చాయో తెలుసా?
Hyderabad : ఆబిడ్స్ నుండి జూబ్లి హిల్స్ వరకు .. ఈ 12 ప్రాంతాలకు ఆ పేర్లెలా వచ్చాయో తెలుసా?
Hyderabad : ఒకప్పటి భాగ్యనగరం కాస్త కాలక్రమేణ హైదరాబాద్ గా మారిందని చరిత్ర చెబుతోంది. ఇలాగే నగరంలోకి కొన్ని ప్రాంతాల పేర్ల వెనక కూడా ఓ చరిత్ర దాగివుంది. ఇలాంటి 12 ప్రాంతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల వెనకున్న స్టోరీ ఇదే...
Hyderabad : రాజుల కాలంనుండి నేటి ఆధునిక యుగం వరకు ఓ వెలుగు వెలుగుతున్న నగరం మన హైదరాబాద్. కుతుబ్ షాహీల నుండి అసఫ్ జాహీ (నిజాంల) వరకు తెలుగు ప్రాంతాల్లోనే కాదు కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్నిచోట్ల హైదరాబాద్ రాజధానిగా పాలన సాగింది.. ఈ క్రమంలోనే నగర జనాభా పెరిగి విస్తరించింది. ఇక ఐటీ, టెక్నాలజీ విప్లవం తర్వాత నగర రూపురేఖలు మారిపోయాయి... జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ కు తోడుగా సైబరాబాద్ ఏర్పడింది. ఇప్పుడు హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద సిటీగా అవతరించింది. పాత, కొత్తల కలయికతో ఈ నగరం గత చరిత్ర, నేటి ఆధునికతకు ప్రతీకగా నిలుస్తోంది.
అయితే హైదరాబాద్ లో చాలాప్రాంతాల పేర్ల వెనక ఓ చరిత్ర దాగివుంది. చిన్నచిన్న మార్పులతో ఆ ప్రాంతాల పేర్లు ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాం. ఇలా హైదరాబాద్ లోని కొన్ని ప్రధాన ప్రాంతాలకు ఆ పేరు ఎలా వచ్చింది? గతంలో ఎలా పిలిచేవారు, ఇప్పుడు ఎలా పిలుస్తున్నాం? అనే ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
1. తార్నాక
హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీతో పాటు అనేక విద్యాసంస్థలకు నిలయం తార్నాక. ఈ ప్రాంతంలో నిజాంల కాలంలో చెక్ పోస్ట్ గేట్ ఉండేది... అందుకే దీన్ని ‘’తర్ర నాక'' అనేవారు. కాలక్రమేణ ఇదికాస్త తార్నాకగా మారింది.
2. జూబ్లీ హిల్స్
ప్రస్తుతం నగరంలోని రిచ్చెస్ట్ ప్రాంతాల్లో జూబ్లిహిల్స్ ఒకటి... ఇక్కడే తెలుగు రాష్ట్రాల్లోని ధనవంతులు ఎక్కువగా నివాసం ఉండేది. నిజాం నవాబు తన 25 సంవత్సరాల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఇక్కడ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారట. అందుకే ఈ ప్రాంతానికి జూబ్లీ హిల్స్ అనే పేరు వచ్చింది.
3. ఆబిడ్స్
నిజాంల కాలంలో ఆల్బర్ట్ అబిద్ అనే వ్యక్తి ఇక్కడ ఓ షాప్ పెట్టుకున్నాడట. దీని పేరు అబిద్ ఆండ్ కంపెనీ... కాలక్రమేణ ఈ ప్రాంతం ప్రముఖ వ్యాపారకేంద్రంగా మారింది. ఇక్కడ మొదట అబిద్ షాప్ ఉండేదికాబట్టి ఆబిడ్స్ గా పిలిచేవారు.
4. లంగర్ హౌస్
గోల్కొండ నుండి పాలించే నిజాం రాజులు సైనికుల భోజనం కోసం లంగర్ ఖానా ఏర్పాటుచేశారు. కోటలో పనిచేసే సైనికులు ఇక్కడే భోజనం చేసేవారట. ఈ లంగర్ ఖాన ఉన్న ప్రాంతమే నేటి లంగర్ హౌజ్.
5. మల్లేపల్లి
ఈ ప్రాంతంలో మల్లె తోటలు ఎక్కువగా ఉండేవట. అందుకే నిజాం రాజ్యంలోని ప్రజలు ఈ ప్రాంతాన్ని మల్లెపల్లిగా పిలిచేవారు. అయితే రానురాను మల్లె తోటలు కనుమరుగై నివాస ప్రాంతంగా మారింది... అయినా ఆ ప్రాంతానికి మల్లెపల్లి అనే పేరు స్థిరపడింది.
6. టోలి చౌకి
దీన్ని మొదట ‘తొలి చౌకి’ అని పిలిచేవారు. అంటే ఇక్కడ ఫస్ట్ గాడ్ ఫోస్ట్ (నిజాంల కాలంలో మొదటి డిఫెన్స్ క్యాంప్) ఉండేది. కాలక్రమేణ ఇది టోలి చౌకిగా మారింది.
7. చంచల్ గూడ
అసలు హైదరాబాద్ నగరం ఈ చంచల్ గూడ ప్రాంతం నుండే ఏర్పడిందని చెబుతుంటారు. ఇక్కడ 'చిచులం' అనే బంజారా తెగ ఉండేదట. ఇదికాస్త చంచల్ గూడ గా మారింది.
8. కార్వాన్
గతంలో షావుకారి కార్వాగా పిలిచే ప్రాంతం కార్వాన్ గా మారింది. ఇక్కడ వజ్రాలు, ముత్యాల వ్యాపారులు ఉండేవారు.. కోహినూర్ వజ్రం కూడా ఇక్కడే సానబట్టారని చెబుతుంటారు.
9. కవాడిగూడ
హుస్సెన్ సాగర్ పై ట్యాంక్ బండ్ ను నిర్మించేందుకు వివిధ ప్రాంతాలనుండి కూలీలు వచ్చారు... వీళ్లు కావడీల ద్వారా రాళ్లు మోసేవారట. ఈ కూలీలంతా ఇప్పుడున్న కవాడిగూడ ప్రాంతంలో నివాసం ఉండేవారట. కావడీలు మోసేవారు నివాసం ఉండేవారు కాబట్టి మొదట కావడీల గూడెం...కాలక్రమంలో కవాడిగూడగా మారింది.
10. పంజాగుట్ట
హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది ఈ పంజాగుట్ట. గతంలో ఈ ప్రాంతంలో ఐదు పెద్దపెద్ద కొండలు ఉండేవట... అందుకే ఈ ప్రాంతాన్ని పంజాగుట్టగా పిలిచేవారట. ఆ పేరు ఇప్పటికీ అలాగే ఉంది.
11. బంజారాహిల్స్
ఒకప్పుడు హైదరాబాద్ అంటే కేవలం మూసీనది పరివాహక ప్రాంతమే. ప్రస్తుతం ఉన్న బంజారాహిల్స్ నగరానికి దూరంగా కొండకోనలతో ఉండేది. ఈ ప్రాంతంలో బంజారా ప్రజలు ఎక్కువగా నివాసం ఉండేవారు.. అందుకే దీన్ని బంజారాహిల్స్ గా పిలిచేవారు. ఆ పేరు అలాగే స్థిరపడిపోయింది.
12. బేగం బజార్
నిజాం భార్య హందా బేగం సిటీ డెవలప్ మెంట్ కోసం వ్యాపారులకు కొంత స్థలం కేటాయించారు. దీంతో ఆమె గౌరవార్థం ఆ ప్రాంతాన్ని బేగం బజార్ గా పిలిచేవారు. కాలక్రమంలో ఈ ప్రాంతంలో గుజరాత్, రాజస్థాన్ వ్యాపారులు స్థిరపడిపోయారు. ఇప్పుడు బేగం బజార్ ప్రముఖ వ్యాపారకేంద్రంగా వెలుగొందుతోంది.

