- Home
- Telangana
- IMD Weather Alert: బంగాళఖాతంలో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు. వచ్చే వారం రోజులూ గడ్డకట్టే చలి ఖాయం
IMD Weather Alert: బంగాళఖాతంలో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు. వచ్చే వారం రోజులూ గడ్డకట్టే చలి ఖాయం
IMD Weather Alert: వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. వాతావరణ శాఖ అధికారులు ముందు నుంచి చెబుతున్నట్లు ఈసారి చలి ఓ రేంజ్‌లో ఉండనుంది. కాగా మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఉత్తర తెలంగాణను వణికిస్తున్న చలి
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతూ ప్రజలను వణికిస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు ఒక్క అంకెలకు పడిపోతున్నాయి. మంగళవారం రాత్రి కుమ్రంభీం-ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో 10.2°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత కఠినంగా ఉండగా, ఉదయం పొగమంచు, రాత్రి చలిగాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు ఇదే తరహా పరిస్థితులు కొనసాగుతాయని అంచనా. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 4–5°C తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ వంటి జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా నమోదవుతోంది.
ఈ సీజన్‌లో మొదటిసారి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
ఈ ఏడాది శీతాకాలం ప్రారంభం నుంచే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. గత వారం రోజులుగా అనేక ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగా పూర్‌లో అత్యల్పంగా 8.7°C నమోదై ఈ సీజన్‌లో తొలిసారి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదైంది. తుపాను ప్రభావం ముగిసిన కొద్ది రోజుల్లోనే చలి పెరగడంతో ప్రజలు భిన్న వాతావరణానికి అలవాటు పడలేక ఇబ్బంది పడుతున్నారు. జలుబు, గొంతునొప్పి, దగ్గు, జ్వరంతో ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
వైద్యారోగ్యశాఖ హెచ్చరిక
చలి తీవ్రత నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. డైరెక్టర్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ.. చలి కారణంగా రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్లు, సీజనల్ ఫ్లూ వంటి వ్యాధులు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదని, వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని సూచించారు. చలిని తట్టుకునేలా వెచ్చని దుస్తులు ధరించడం, గోరువెచ్చని నీళ్లు తాగాలని సూచిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం
తెలంగాణ వెదర్‌మ్యాన్ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 13 నుంచి 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులు మరింత బలపడతాయని అంచనా వేశారు. ఉత్తర, మధ్య, పశ్చిమ జిల్లాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు ఉష్ణోగ్రతలు 8–10°C వరకు పడిపోవచ్చని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11–13°C వరకు నమోదయ్యే అవకాశముంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం వచ్చే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3°C తక్కువగా ఉండే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో నవంబర్ 17న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. దీని ప్రభావంతో 17, 18 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15–17°C మధ్య కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.