Hyderabad : డియర్ సిటీ పీపుల్.. మీరు ఇప్పుడే అలర్ట్ కాకుంటే తాగునీటి కష్టాలే..!
Hyderabad Drinking Water Cut : హైదరాబాద్ లో ఈ వీకెండ్ తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. సింగూరు నుండి నీటిని తరలించే పైప్ లైన్ మరమ్మతుల కారణంగా సరఫరా నిలిపివస్తున్నట్లు HMWSSB ప్రకటించింది.

హైదరాాబాద్ కు నీటిసరఫరా బంద్
Hyderabad Water Supply : తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ కు మంజీరా జలాలు సరఫరా చేసేందుకు సింగూరు ప్రాజెక్టును ఉపయోగించే విషయం అందరికీ తెలిసిందే. ఇందుకోసం సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్ట్ నుండి హైదరాబాద్ వరకు భారీ పైప్ లైన్ ఉంది. అయితే ఈ పైప్ లైన్ నుండి భారీగా నీరు లీక్ అవుతుండటంతో మరమ్మతులకు సిద్దమయ్యింది అధికార యంత్రాంగం... ఇందుకోసమే హైదరాబాద్ కు నీటిసరఫరా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటిన్ వాటర్ సప్లై ఆండ్ సీవరేజ్ బోర్డ్ ప్రకటించింది.
ఈ వీకెండ్ వాటర్ సప్లై లేనట్లే...
సింగూరు ప్రాజెక్ట్ నుండి హైదరాబాద్ కు మంజీరా నీటిని తరలించే మెయిన్ పైప్ లైన్ చాలాచోట్ల దెబ్బతింది. 1,600 MM డయా ఫేజ్-3 మెయిన్ పైప్ లైన్ అత్యవసర మరమ్మతుల కోసం నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. జనవరి 3 అంటే రేపు(శనివారం) ఉదయం 10 గంటల నుండి తర్వాతరోజు జనవరి 4(ఆదివారం) తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ పైప్ లైన్ ద్వారా ఎలాంటి నీటి సరఫరా జరగదని HMWSSB ప్రకటించింది.
ఏఏ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదంటే..
ఈ శనివారం పూర్తిగా, ఆదివారం కొద్దిసేపు సింగూరు నీటి సరఫరా నిలిచిపోనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో నీటి కష్టాలు తప్పవు. దాదాపు 18 గంటలపాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇవాళ (శుక్రవారం, జనవరి 2) జాగ్రత్త పడాలి... నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది.
హైదరాబాద్ నగరంలోని ఏఏ ప్రాంతాల్లో సింగూరు జలాల సరఫరా ఉండదో ప్రకటించింది వాటర్ సప్లై బోర్డు. కాబట్టి కింద పేర్కొన్న ప్రాంతాల్లోని ప్రజలు ఈ వీకెండ్ జాగ్రత్తగా ఉండాలి.. నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి.
ఓఆండ్ఎం డివిజన్ 6 : ఫతేనగర్
ఓఆండ్ఎం డివిజన్ 9 : భరత్ నగర్, మూసాపేట, గాయత్రీ నగర్, బాలానగర్, కిపిహెచ్బి
ఓఆండ్ఎం డివిజన్ 15 : మలేషియా టౌన్షిప్, మాదాపూర్, కొండాపూర్, డోయెన్స్ సెక్షన్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
ఓఆండ్ఎం డివిజన్ 17 : హఫీజ్ పేట, మయూరి నగర్, గోపాల్ నగర్, మియాపూర్
ఓఆండ్ఎం డివిజన్ 22 : ప్రగతి నగర్
ఇక బిహెచ్ఈఎల్, మిగ్-1 ఆండ్ 2, రైల్ విహార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతాల్లో కూడా నీటి సరఫరా ఉండదని HMWSSB స్పష్టం చేసింది.
ఈ ముందుజాగ్రత్తలు పాటించండి...
1. ఇవాళ (జనవరి 2, శుక్రవారం) నీటి సరఫరా ఉంటుంది... కాబట్టి వీలైనన్ని ఎక్కువ నీటిని పట్టుకొండి. వీటిని నీటి సరఫరా లేని సమయంలో వాడుకోవచ్చు.
2. నీటిని పొదుపుగా వాడుకోవాలి. లేదంటే ఇబ్బందిపడాల్సి ఉంటుంది.
3. తాగునీటితో వాహనాలు కడగడం, మొక్కలకు పట్టడం చేయకూడదు. నీటి వృధాను అరికడితే ఇప్పుడే కాదు భవిష్యత్ లో కూడా సమస్య ఉండదు.
4. ఇంటి యజమానులు అద్దెకు ఉండేవారికి ముందుగానే సమాచారం ఇవ్వండి. నీటి సరఫరా ఉండదుకాబట్టి జాగ్రత్తగా నీటిని వాడుకోవాలని సూచించాలి.
5. వాణిజ్య అవసరాలకు సింగూరు నీటిని ఉపయోగించేవారు కూడా ఈ రెండ్రోజులకు సరిపడా నీటిని ఇప్పుడే స్టోర్ చేసుకోవాలి

