Vegetable Price : హైదరాబాద్ లో కిలో టమాటా ధర ఎంతో తెలుసా?
Vegetable Price : వర్షాకాలంలో దిగుబడి బాగా పెరగడంతో కూరగాయల ధరలు దిగివస్తున్నాయి. ముఖ్యంగా వంటల్లో ఎక్కువగా ఉపయోగించే ఉల్లిపాయలు, టమాటా ధరలు ప్రస్తుతం హైదరాబాద్ లో ఎంతున్నాయో తెలుసా?

సెంచరీలు కొట్ఠిన కూరగాయలు డకౌట్...
Vegetable Price : టమాటా, ఉల్లిపాయ... వీటిధరలు ఎప్పుడూ అసాధారణంగా ఉంటాయి. క్రికెట్ భాషలో చెప్పాలంటే ఒక్కోసారి వీటిధర సెంచరీలు (కిలో 100 రూపాయల కంటే ఎక్కువ) కొడుతుంటుంది... ఒక్కోసారి డకౌట్ (ధరలేక రైతులు రోడ్లపై పడేసే పరిస్థితి) అవుతుంది. మరి ప్రస్తుతం వీటిధర డకౌట్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర అమాంతం పడిపోయి రైతులతో కన్నీరు పెట్టిస్తోంది.
అంతుచిక్కని టమాటా...
తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద టమాటా మార్కెట్ మదనపల్లెలో కిలో టమాటా ధర కేవలం రూ.5 పలుకుతోంది. ఇలా రైతులు గిట్టుబాటు ధరలేక టమాటా పంటను చేళ్లలోనే వదిలిపెడుతున్నారు. కానీ హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రం కిలో టమాటా ఏకంగా 25-30 రూపాయలు పలుకుతోంది. అంటే రైతులను నిండా ముంచుతున్న టమాటా వ్యాపారులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. ఇలా ప్రస్తుతం రైతులు అమ్మబోతే రూ.5 పలుకుతున్న ఇదే టమాటా వినియోగదారులు కొనబోతే మాత్రం రూ.30 పలుకుతోంది... మధ్యలో ఈ రూ.20-25 డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో?
టమాటా ధరల్లో హెచ్చుతగ్గులు...
సామాన్య మధ్యతరగతి జీవులు రోజు తినే వంటల్లో ప్రధానమైన కూరగాయలు టమాటా, ఉల్లిపాయలు... ఇవి లేకుండా వారింట్లో అసలు వంటే ఉండదు. ఏ కూర, పులుసు, సాంబారు, రసం అయినా టమాటా, ఉల్లిపాయలు తప్పనిసరి. అయితే కొన్నిసార్లు వీటి ధరలు అమాంతం అందనంతలా ఎదుగుతాయి… ఒక్కోసారి అధ:పాతాళానికి చేరతాయి.
ప్రస్తుతం మార్కెట్లోకి బస్తాల కొద్దీ ఉల్లిపాయలు, పెట్టెల కొద్దీ టమాటాలు వస్తున్నాయి. దీనివల్ల వీటిధరలు బాగా తగ్గాయి. కొన్ని వారాల క్రితం టమాటా ధర కిలో 80 రూపాయలు కూడా దాటింది... అదే టమాటా ఇప్పుడు రైతులు అమ్ముతుంటే రూ.5, వినియోగదారులు కొంటే మాత్రం రూ.25-30 పలుకుతోంది. అలాగే ఉల్లిపాయల ధరలు కూడా రూ.20-30 కి దిగివచ్చాయి.
బాగా తగ్గిన టమాటా, ఉల్లి ధర
హైదరాబాద్ మార్కెట్లలో టమాటా రకాలను బట్టి కిలో రూ.20 నుండి రూ.30 వరకు అమ్ముతున్నారు. 100 రూపాయలకు 5 కిలోలు కూడా అమ్ముతున్నారు. ఉల్లిపాయల ధర కూడా తగ్గింది. కిలో రూ.20 నుండి రూ.30 వరకు అమ్ముతున్నారు… ఇవి కూడా 100 రూపాయలకు 5 కిలోలు అమ్ముతున్నారు. వంటలకు అవసరమైన ఈ రెండు కూరగాయల ధరలు గతంతో పోలిస్తే బాగా తగ్గాయనే చెప్పాలి.
హైదరాబాద్ లో ఇతర కూరగాయల ధరలివే
1. పచ్చిమిర్చీ - కిలో 54-60 రూపాయలు
2. బీట్రూట్ - కిలో 43-47 రూపాయలు
3. బంగళాదుంప - కిలో 32-36 రూపాయలు
4. క్యాప్సికం - కిలో 51-56 రూపాయలు
5. కాకరకాయ - కిలో 40-44 రూపాయలు
6. బీరకాయ - కిలో 40-44 రూపాయలు
7. బీన్స్ - కిలో 43-47 రూపాయలు
8. క్యాబేజి - కిలో 31-34 రూపాయలు
9. క్యారెట్ - కిలో 49-55 రూపాయలు
10. చిక్కుడు - కిలో 46-51 రూపాయలు
11. వంకాయలు - కిలో 35-40 రూపాయలు
12. బెండకాయలు - కిలో 45-50 రూపాయలు