- Home
- Telangana
- Hyderabad: రూ. 530 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. హైదరాబాదీలకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి
Hyderabad: రూ. 530 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. హైదరాబాదీలకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి
Hyderabad: హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన ఆల్విన్ కాలనీ నుంచి మియాపూర్ వరకు కొత్త ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు జారీ చేసింది.

1.8 కిలోమీటర్ల పొడవుతో భారీ ఎలివేటెడ్ కారిడార్
ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.530 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం ఆమోదించింది. దీంతో కూకట్‌పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్ పరిసరాల్లో ప్రతిరోజూ ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈ ఫ్లైఓవర్‌ను అంజయ్య నగర్ మార్గంలో నిర్మించనున్నారు. మొత్తం 1.8 కిలోమీటర్ల పొడవుతో, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్ల రహదారిగా దీన్ని రూపొందిస్తున్నారు.
వేగవంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉండేలా ఆధునిక సదుపాయాలతో నిర్మాణం చేపట్టనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో రూ.330 కోట్లు నిర్మాణ పనుల కోసం వినియోగించనుండగా, మిగిలిన రూ.200 కోట్లు భూసేకరణ, నష్టపరిహారం కోసం ఖర్చు చేయనున్నారు. పరిపాలనా అనుమతులు పూర్తికావడంతో త్వరలోనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టే ప్రాజెక్టు
ప్రస్తుతం గాజులరామారం, షాపూర్ నగర్, జీడిమెట్ల, చింతల్ ప్రాంతాల నుంచి మియాపూర్, లింగంపల్లి, పటాన్‌చెరు వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బాలానగర్, వై జంక్షన్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్, జేఎన్టీయూ, నిజాంపేట్ సిగ్నళ్ల వద్ద గంటల తరబడి నిలిచిపోవాల్సి వస్తోంది. కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే జగద్గిరిగుట్ట వైపు నుంచి వచ్చే వాహనాలు ఆల్విన్ కాలనీ ద్వారా నేరుగా మియాపూర్ చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో ప్రధాన జంక్షన్లపై ఒత్తిడి తగ్గి, ప్రయాణ సమయం కూడా తగ్గనుంది.
రోజువారీ ప్రయాణికులకు భారీ ఉపశమనం
ఈ ప్రాజెక్టుతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపార వర్గాలు ఎక్కువగా లాభపడనున్నాయి. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో కూకట్‌పల్లి–జేఎన్టీయూ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోతుంటాయి. ఫ్లైఓవర్ పూర్తయితే సిగ్నళ్ల వద్ద ఆగాల్సిన అవసరం తగ్గి, ప్రయాణం వేగంగా సాగుతుంది.
భూసేకరణ తర్వాత టెండర్ల ప్రక్రియ
ప్రాజెక్టుకు అనుమతులు రావడంతో GHMC అధికారులు తదుపరి చర్యలపై దృష్టి పెట్టారు. ముందుగా భూసేకరణ పూర్తి చేసి, అనంతరం టెండర్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. జూన్ నెలలో పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. నిర్మాణ పనులను దశలవారీగా పూర్తి చేసి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ మౌలిక వసతుల అభివృద్ధిలో మరో అడుగు
హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే పలు ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లైఓవర్లు, స్కైవాక్‌ల నిర్మాణాన్ని చేపట్టింది. సికింద్రాబాద్ వైపు ఎలివేటెడ్ మార్గాలు, ఎల్బీనగర్–హయత్‌నగర్ కారిడార్ వంటి ప్రాజెక్టులు కొనసాగుతున్న వేళ.. ఆల్విన్ కాలనీ–మియాపూర్ ఫ్లైఓవర్ కూడా నగర ట్రాఫిక్ వ్యవస్థను మరింత మెరుగుపరచనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర హైదరాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గి, వేలాది మంది వాహనదారులకు ప్రతిరోజూ ఉపశమనం లభించే అవకాశం ఉంది.

