- Home
- Telangana
- Hyderabad : ఈ శివారు గ్రామాలే కాబోయే కోకాపేట్, నియో పోలిస్.. ఇప్పుడే తక్కువ ధరకు భూములు కొనిపెట్టుకొండి
Hyderabad : ఈ శివారు గ్రామాలే కాబోయే కోకాపేట్, నియో పోలిస్.. ఇప్పుడే తక్కువ ధరకు భూములు కొనిపెట్టుకొండి
హైదరాబాద్ శివారులో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్‌తో భవిష్యత్ కోకాపేట్లుగా మారబోయే గ్రామాలు ఇవే. తక్కువ ధరలో భూములు కొనడానికి ఇదే సరైన సమయం. ఆ గ్రామాలేవో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us

హైదరాబాద్ శివారులో మరిన్ని స్మార్ట్ సిటీస్..
Hyderabad Real Estate : హైదరాబాద్... ఈ నగరం అందరినీ అమ్మలా అక్కున చేర్చుకుంటుంది... నాన్నలా ఆలనాపాలనా చూస్తుంది... బందువుల్లా ఆత్మీయతను పంచుతుంది.. స్నేహితుల్లా అండగా ఉంటుంది. అందుకే ఈ నగరంతో తెలుగు ప్రజలకే కాదు అందరికీ స్పెషల్ అటాచ్ మెంట్ ఉంటుంది.. బ్రతుకుదెరువు కోసం వచ్చినవారు కూడా సొంతూరిలా భావిస్తారు. అందుకే ఈ నగరంలో సొంతిళ్లు అనేది చాలామంది కల... కానీ ఆ కలను నిజం చేసుకోవాలంటే లక్షలు, కోట్ల రూపాయలు గుమ్మరించాల్సిందే.
ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఆబిడ్స్, నాంపల్లి, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట ప్రాంతాలే... ఆ తర్వాత నగరం అభివృద్ధి చెంది బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, కూకట్ పల్లి, మియాపూర్ వంటి ప్రాంతాలకు విస్తరించింది. ఇక ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రాకతో నగర రూపురేఖలే మారిపోయాయి... కొండలు గుట్టలతో నిండివుండే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్ రాం గూడ వంటి ప్రాంతాల్లో ఆకాశహర్మ్యాలు వెలిసాయి. భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.
ఐటీ ఎఫెక్ట్ కు ఔటర్ రింగ్ రోడ్డు తోడవడంతో నగర శివారుప్రాంతాలు బాగా డెవలప్ అయ్యాయి. కోకాపేట వంటి ప్రాంతాల్లో ఎకరం వందకోట్లు పలుకుతోందంటే హైదరాబాద్ శివారులో భూములకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ధరలు పెట్టి సామాన్యుడు భూములు కొనడం అసాధ్యం. అలాగని నగరంలో సొంతిటి కలను చంపుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్ ను ముందుగానే ఊహించి నగరానికి కాస్త దూరమైనా ఇప్పుడే పెట్టుబడులు పెడితే భవిష్యత్ లో మంచి లాభాలను పొందవచ్చు... ఇంటికలను కూడా సాకారం చేసుకోవచ్చు. ఇలా హైదరాబాద్ శివారులో డెవలప్ అయ్యే ప్రాంతాలేమిటి? ఎందుకు డెవలప్ అయ్యే అవకావశాలున్నాయి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
రీజినల్ రింగ్ రోడ్డు (RRR) తో రియల్ బూమ్
హైదరాబాద్ లో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది... ఐటీ కంపెనీలకు నిలయమైన హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. చివరకు ట్రాఫిక్ జామ్ పై కూడా వార్తలు వస్తున్నాయి.. దీన్నిబట్టి ఏ స్థాయిలో వాహనాలు పెరిగిపోయాయో అర్థం చేసుకోవచ్చు. నగరంలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు(ORR) పై కూడా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. ఈ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా భవిష్యత్ లో నగర అభివృద్ధి, విస్తరణను దృష్టిలో పెట్టుకుని రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నాయి కేంద్ర, రాాష్ట్ర ప్రభుత్వాలు.
30 నుండి 50 కిలోమీటర్ల దూరంలో నగరం చూట్టూ 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డును ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వ భారతమాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ ఆర్ఆర్ఆర్ రోడ్డును నిర్మిస్తోంది. రూ.21,480 కోట్లతో ఎక్స్ ప్రెస్ వే రెండు భాగాలుగా నిర్మించనున్నారు... ఉత్తర భాగం 161 కి.మీ, దక్షిణ భాగం 182 కి.మీ ఉంటుంది. ఓఆర్ఆర్ అవతల వివిధ పట్టణాలు, గ్రామాల మీదుగా ఈ రీజనల్ రింగురోడ్డు వెళుతుంది.
ఈ రోడ్డు ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉండగానే భూముల ధరలు అమాంతం పెరిగాయి... ఇక పనులు ప్రారంభమైతే మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ ఆర్ఆర్ఆర్ ఏ ప్రాంతాలమీదుగా అయితే వెళుతుందో అక్కడ రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఈ ఆర్ఆర్ఆర్ రోడ్డు ఏ గ్రామాలమీదుగా అయితే వెళుతుందో అక్కడ భూముల ధరలు ప్రస్తుతం కాస్త తక్కువగానే ఉన్నాయి... భవిష్యత్ లో రేట్లు భారీగా పెరిగే అవకాశాలున్నాయని... అందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను వీటిపై పడిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆర్ఆర్ఆర్ తో ఈ ప్రాంతాలు మరో కోకాపేట్ అవుతాయా?
రీజనల్ రింగ్ రోడ్డు నగర శివారులోని వివిధ జిల్లాల మీదుగా వెళుతుంది. ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఈ అలైన్ మెంట్ కు ఆమోదం తెలిపింది... భూముల సేకరణ కూడా ప్రారంభమయ్యింది. టెండర్లను కూడా ఆహ్వానించారు... త్వరలోనే రోడ్డు నిర్మాణపనులు ప్రారంభం కానున్నాయి.
ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర కారిడార్ సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వెల్, ప్రజ్ఞాపూర్, జగదేవ్ పూర్, భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాలమీదుగా సాగుతుంది. ఇక దక్షిణ కారిడార్ చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, అమన్గల్, చేవెళ్ల, శంకర్ పల్లి, సంగారెడ్డి వరకు సాగనుంది.
సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్, సదాశివపేట్, హత్నూర్, సంగారెడ్డి మండలాల్లోని వివిధ గ్రామాల మీదుగా ఈ ఆర్ఆర్ఆర్ రోడ్డు వెళుతుంది. ఇక మెదక్ జిల్లాలో నర్సాపూర్, తూప్రాన్, మాసాయిపేట మండలాల్లోని గ్రామాలు... సిద్దిపేట జిల్లాలో ప్రజ్ఞాపూర్, గజ్వెల్, జగదేవ్ పూర్, రాయిపోల్ మండలాల గ్రామాల మీదుగా సాగుతుంది. భువనగిరి జిల్లాల్లో యాదగిరిగుట్ట, వెల్గొండ, భువనగిరి మండలాలు... రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, కందుకూరు, అమన్గల్, చేవెళ్ల, శంకర్ పల్లి మండలాల్లోని గ్రామాల మీదుగా వెళుతుంది. నల్గొండ జిల్లాలో చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాలు కూడా ఈ రీజనల్ రింగురోడ్డులో భాగం కానున్నాయి.
ఆర్ఆర్ఆర్ రాకతో జరిగే డెవలప్ మెంట్ ఇదే..
ఇలా ఆర్ఆర్ఆర్ రోడ్డు వెళ్లే పట్టణాలు, గ్రామాల రూపురేఖలు భవిష్యత్ లో పూర్తిగా మారిపోతాయని... భారీ టౌన్ షిప్ లు, ఇండస్ట్రియల్ క్లస్టర్లు, ఐటీ, ఫార్మా కంపనీలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో భూముల ధరలు ఆర్ఆర్ఆర్ ఏర్పాటుతర్వాత భారీగా పెరుగుతాయి.. కాబట్టి ఇప్పుడే ఇక్కడ భూములు కొనుక్కుంటే భవిష్యత్ లో మంచి లాభాలుంటాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ ఎలాగైతే డెవలప్ మెంట్ జరిగిందో అంతకంటే ఎక్కువగా ఈ రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ జరుగుతుందని చెబుతున్నారు.
సంగారెడ్డి భూములకు మరింత డిమాండ్
ఇప్పటికే సంగారెడ్డి పట్టణం హైదరాబాద్ లో కలిసిపోయింది… ఇక్కడినుండి ఐటీ ఉద్యోగులు రోజూ నగరానికి రాకపోకలు సాగిస్తున్నారు. అందుబాటు ధరల్లో ఇక్కడ భూములు, ఇళ్లు, ప్లాట్ల ధరలు ఉండటంతో కొనడానికి ఐటీ ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు. సంగారెడ్డి నుండి మదీనగూడ వరకు ముంబై హైవే విస్తరణ జరుగుతోంది... ఇది పూర్తయితే సంగారెడ్డికి మరింత డిమాండ్ పెరగనుంది.
ఇదే సమయంలో సంగారెడ్డికి జిల్లాలో NIMZ (నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ మాన్యూఫ్యాక్చరింగ్ జోన్) ప్రాజెక్ట్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జహిరాబాద్ ను ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇది కూడా సంగారెడ్డి పరిసరాల్లో భూముల ధరల పెరగడానికి కారణం. ఇలా వివిధ అంశాలు హైదరాబాద్ స్థాయిలో శివారు ప్రాంతమైన సంగారెడ్డిలో భూముల ధరలకు రెక్కలు వచ్చేలా చేస్తున్నాయి.
నోట్: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. కష్టపడి సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్ చేసే ముందు చాలా ఆలోచించాలి. ఈ రంగంలో నిపుణులైన వారి నుంచి నేరుగా సలహాలు తీసుకోవడం మరీ మంచిది.