- Home
- Telangana
- TGSRTC: అందరూ ఇలా నిజాయితీగా ఉంటే ఎంత బాగుండు.. కండెక్టర్ అన్న చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
TGSRTC: అందరూ ఇలా నిజాయితీగా ఉంటే ఎంత బాగుండు.. కండెక్టర్ అన్న చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
మనం చేసే పనిని నిబద్ధతత, నిజాయితీగా చేయాలని పెద్దలు చెబుతుంటారు. చిన్ననాటి నుంచి ఇలాంటి విలువలను నేర్పిస్తుంటారు. అయితే సమాజంలో ఎంత మంది వీటిని పాటిస్తున్నారు.? అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. అయితే స్వార్థం నిండిపోతున్న ప్రస్తుత తరుణంలో కూడా నిజాయితీగా నిలువుటద్దంలా నిలిచాడు ఓ కండెక్టర్. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..

TGS RTC
ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు తెలంగాణ ఆర్టీసికి చెందిన కండక్టర్ వెంకటేశ్వర్లు. అచ్చంపేట డిపోకి చెందిన ఆయన, బస్సులో ఓ ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగును తిరిగి ఇచ్చిన నిజాయితీని చాటుకున్నారు. బ్యాగులో సుమారు రూ.13 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు, పలు కీలక డాక్యుమెంట్లు ఉన్నాయి.
RTC conductor
ఈ ఘటన ఈ నెల 26న అచ్చంపేట-హైదరాబాద్ రూట్ లో చోటుచేసుకుంది. ఎంజీబీఎస్‌కు బస్సు చేరుకున్న తర్వాత వెంకటేశ్వర్లు విధులు ముగిస్తున్న సమయంలో బస్సులో ఓ బ్యాగ్ కనిపించింది. ఓపెన్ చేసి చూడగా బ్యాగులో 14 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు, రూ. 14 వేల నగదుతో పాటు బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి.
దీంతో వెంటనే వెంకటేశ్వర్లు ఈ విషయాన్ని అచ్చంపేట డిపో మేనేజర్ మురళీ దుర్గాప్రసాద్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన సూచన మేరకు బ్యాగును ఎంజీబీఎస్ స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో అప్పగించారు. ఈ సమయంలో అనిల్ కుమార్ అనే ప్రయాణికుడు డీఎంను సంప్రదించి, బ్యాగ్ మరిచిపెట్టినట్లు తెలిపారు. అతను కందుకూర్‌లో బస్సు ఎక్కి, సీబీఎస్ వద్ద దిగిన తర్వాత కాచిగూడ వెళ్లినట్లు చెప్పాడు.
వివరాలు సరిపోలడంతో అధికారులు బ్యాగ్‌ను అనిల్‌కు అప్పగించారు. నిజాయితీతో వ్యవహరించిన వెంకటేశ్వర్లును టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. సోమవారం హైదరాబాద్ బస్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ అతన్ని ప్రత్యేకంగా సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కండెక్టర్ నిజాయితీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.